iDreamPost
android-app
ios-app

కరోనా బెల్స్‌ : వారం వ్యవధిలోనే ఇన్ని కేసులా?

కరోనా బెల్స్‌ : వారం వ్యవధిలోనే ఇన్ని కేసులా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బుధవారం ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే విస్తుపోవాల్సిందే. సమాజంలో పైకి కనిపించేటంత ప్రశాంతంగా వాతావరణం లేదని, కరోనా శరవేగంగా విజృంభిస్తోందని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు హల్‌చల్‌గా తిరిగి పాజిటివ్‌ వచ్చాక ఆస్పత్రికి వెళ్తేగానీ తెలియడం లేదు.. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని.. అంటూ సోషల్‌మీడియాలో బాధితులు పోస్టులు పెడుతున్నారు. ఈ పరిస్థితి ఏ ఒక్క చోటో కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా 2.1 కోట్ల మందికి కోవిడ్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఒకే ఒక వారంలో భారీగా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఆ స్థాయిలో కేసులు ఇప్పటి వరకు ఇదే మొదటిసారట. గత వారం రోజుల్లో పశ్చిమాసియా దేశాల్లో 39 శాతం, ఆగ్నేయాసియా దేశాల్లో 36 శాతం మేర కోవిడ్ కేసులు పెరిగాయని పేర్కొంది. జనవరి 17- 23తో ముగిసిన వారంలో భారత్‌లో కేసులు 33 శాతం పెరిగాయని తెలిపింది. ఈ వ్యవధిలో దేశంలో కొత్తగా 21.15 లక్షల మందికి కోవిడ్ సోకిందని వివరించింది. అంటే ప్రతిరోజు సగటున మూడు లక్షల మందికి వైరస్‌ ప్రబలిందన్న మాట.

భారత్‌తో పోల్చుకుంటే అమెరికాలో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ అత్యధికంగా 42.15 లక్షల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత వారం రోజుల్లో.. ఫ్రాన్స్‌లో 24.43 లక్షలు, ఇటలీలో 12.31 లక్షలు, బ్రెజిల్‌లో 8.24 లక్షల కేసులు బయటపడ్డాయి. ఇక కోవిడ్ మరణాలు కూడా అమెరికాలోనే ఎక్కువగా సంభవించాయి. జనవరి 17- 23 మధ్యకాలంలో అక్కడ 10,795 మంది కరోనాతో చనిపోయారు. భారత్‌లో 3,343, రష్యాలో 4,792, ఇటలీలో 2,440, బ్రిటన్‌లో 1,888 మంది కోవిడ్ తో మృతిచెందారు. భారత్‌ చేపడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి తమవంతుగా పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో సెక్రెటరీ జనరల్‌ తరఫు అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డ్యుజారిక్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా కరోనాతో ఇప్పటి వరకు తల్లడిల్లిన ఢిల్లీ కాస్త కుదుటపడుతోంది. మొదటి, రెండో దశతో పోల్చుకుంటే.. మూడోవేవ్‌లో పరిస్థితి పర్వాలేదన్నట్లుగానే ఉంది.

ఈసారి జనవరి 13 నాటికి ఢిల్లీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 94,160కి చేరింది. అయితే సగానికి సగం తగ్గడానికి పన్నెండు రోజుల సమయమే పట్టింది. ప్రస్తుతం హస్తినలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గి 42 వేలకు చేరింది. రెండోవేవ్‌ సమయంలో ఆస్పత్రుల్లో కోవిడ్ రోగుల చేరికలు ఎంత భారీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఈసారి ఆస్పత్రుల్లో చేరిక రేటు సగటున రెండు శాతంలోపే ఉంది. మూడోవేవ్‌ నేపథ్యంలో గత పది రోజులుగా.. కోవిడ్ తో ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరికలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (10-15 శాతం), తమిళనాడు (6 శాతం), ఢిల్లీ (3 శాతం), కేరళ (4 శాతం) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇది 2 శాతంలోపే ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రాలు ఈ వివరాలను వెల్లడించాయి.