Idream media
Idream media
పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ సంగ్రామం ముగిసింది. మొత్తం 84.63 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. అత్యధికంగా పూర్బ మేదినీపూర్‌లో 86.32 % పోలింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో జనగ్రామ్(84.74%), పశ్చిమ్ మేదినీపూర్(84.71%), బాన్కురా(84.27%), పురులియా (81.77%) నియోజకవర్గాలు ఉన్నాయి. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందన్న చర్చలు జరుగుతున్న సందర్భంలో అకస్మాత్తుగా వెలుగులోకి ఇద్దరు బీజేపీ నేతల ఫోన్ సంభాషణ రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ కోరిక మేరకే.. బెంగాల్ ఓటర్లు రాష్ట్రంలోని ఏ పోలింగ్ బూత్‌లోనైనా ఏజెంట్లుగా ఉండొచ్చంటూ గత వారం ఈసీ ఆదేశాలు జారీ చేసిందని టీఎంసీ నేతలు ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. అసలు ఆ సంభాషణ ఎలా బయటకు వచ్చిందో ఆ రాష్ట్రం సమాధానం చెప్పాలంటూ అమిత్ షా డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
బెంగాల్ తొలి దశ ఎన్నికలు శనివారం జరిగాయి. అనంతరం ఓ వీడియో క్లిప్ తృణమూల్ కాంగ్రెస్ బయటపెట్టింది. దాంట్లో ‘‘మనకు పశ్చిమ బెంగాల్‌లో చాలా పోలింగ్ బూత్‌లలో పార్టీ ఏజెంట్లు లేరు. ఇలా అయితే కష్టమే. ఎన్నికల్లో గెలవలేము. అందుకే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు కూడా పోలింగ్ బూత్‌లో ఏజెంట్లుగా అవకాశమివ్వాలి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తప్పనిసరిగా విజ్ఞప్తి చేయాలి’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీకి చెందిన శిశిర్ భొజారియాతో అంటున్నట్లుగా ఉంది. ఇదిలా ఉండగా బెంగాల్ ఓటర్లు రాష్ట్రంలోని ఏ పోలింగ్ బూత్‌లోనైనా ఏజెంట్లుగా ఉండొచ్చంటూ గత వారమే ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఫోన్ సంభాషణ వ్యాఖ్యలు టీఎంసీకి ఓ ఆయుధంగా మారాయి. దీనిపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ ఇంతకాలం ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీనా లేక అమిత్‌షానా అంటూ నిప్పులు చెరిగారు.
మరోవైపు ఈ ఫోన్ సంభాషణ బయటకు రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బెంగాల్‌లో ఇద్దరు బీజేపీ నేతల మధ్య ఫోన్ సంభాషణ ఎలా బయటకు వచ్చింది? ఆ రాష్ట్రంలో ఎలాంటి ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతుల్లేవు. అయితే.. వారి ఫోన్లను ఎవరు ట్యాప్ చేశారు? దీనిపై ఆ రాష్ట్ర సర్కారు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. మొదటి దశ ఎన్నికల్లో తాము 30 స్థానాల్లో 26 సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పవిత్రతను శంకించాల్సిన అవసరం లేదని.. అది స్వయం ప్రతిపత్తి గల చట్టబద్ధమైన సంస్థ అని వివరించారు.