iDreamPost
iDreamPost
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త చరిత్రకు నాందిపలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. అసలు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి, ఆ పేరు ఎవరు పెట్టారు?
భారతదేశపు మొదటి గిరిజన రాష్ట్రపతి పేరు ద్రౌపది. మహాభారతం పాత్ర పేరును అనుకోకుండా ఆమె స్కూల్ టీచర్ పెట్టారు. ఓడియా వీడియో మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ విషయాన్ని రాష్ట్రపతి వెల్లడించారు. తన మొదటిపేరు పుతి. ఇది సంతాలి పేరు. అదే టీచర్ మాత్రం స్కూల్ లో చేర్చుకొంటున్నప్పుడు ద్రౌపదిగా మార్చారు.
“ద్రౌపది నా అసలు పేరు కాదు. ఇది నా స్వస్థలమైన మయూర్‌భంజ్ కాకుండా, వేరే జిల్లాకు చెందిన నా టీచర్ ఆ పేరు పెట్టారు” అని ముర్ము చెప్పారు. మయూర్‌బంజ్ జిల్లాలో గిరిజనులు ఎక్కువ. కాని అక్కడ పనిచేసే టీచర్లు బాలాసోర్ లేదంటే కటక్ నుంచి వచ్చేవారు. స్థానికంగా ఉండేవారు కాదు. అందుకే ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాల గురించి వాళ్లకు తెలియవు. తనను ద్రౌపది అని ఎందుకు పిలుస్తారని అడిగినప్పుడు, “ ఆ టీచర్ నా సొంత పేరును ఇష్టపడలేదు. మార్చారు,” అని రాష్ట్రపతి చెప్పారు. నిజానికి, ఆమె పేరును చాలాసార్లు మార్చేశారంట. దూర్పడి ఐతే, దోర్పిడి అని.
సంతాలీ సంస్కృతిలో పేర్లు ఒక తరం నుంచి మరోతరానికి అందుతూనే ఉంటాయి. కొత్త పేర్ల కోసం వెతుకులాట ఉండదు. పూర్వీకుల పేర్లను కొత్త తరానికి పెడతారు. “ఒక అమ్మాయి పుడితే, ఆమెకు అమ్మమ్మ పేరును పెడతారు. కొడుకు పుడితే తాత పేరును పెడతారని రాష్ట్రపతి ద్రౌపది చెప్పారు. స్కూలు, కాలేజీల్లో ఆమె ఇంటిపేరు తుడు అని నమోదు అయింది. కాని, బ్యాంక్ అధికారి శ్యామ్ చరణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ముర్ము పేరు చేర్చుకున్నారు.
రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్‌పై ఆమెకంటూ సొంత అభిప్రాయాలున్నాయి. పురుషులు ఆధిపత్యం వహించే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి. రాజకీయ పార్టీలు మహిళా అభ్యర్ధులను ఎన్నుకోవడం , ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లను ఇవ్వడంద్వారా ప్రస్తుత పరిస్థితిని మార్చవచ్చు అని అంటారు.
25 ఏళ్ల పెద్ద కొడుకు లక్ష్మణ్ మరణం ఆమెను మానసికంగా బాగా దెబ్బతీసింది. నా కొడుకు మరణంతో నేను పూర్తిగా చితికిపోయాను. నేను రెండు నెలలు డిప్రెషన్‌లో ఉన్నా. ప్రజలను కలవడం మానేసి, ఇంటికే పరిమితమయ్యాను. తరువాత ఈశ్వరీయ ప్రజాపతి బ్రహ్మకుమారిలో చేరాను, యోగా, ధ్యానం చేశాను. అలా కోలుకున్నానని ముర్ము చెప్పారు. కాని 2013లో రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు సిపున్‌ను కోల్పోయారు. ఆ తర్వాత ఆమె సోదరుడు, తల్లి మరణించారు.
“నేను నా జీవితంలో సునామీని ఎదుర్కొన్నాను. ఆరు నెలల్లో నా కుటుంబంలో మూడు మరణాలను చూశాను” అని ముర్ము చెప్పారు, ఆమె భర్త శ్యామ్ చరణ్ కూడా అనారోగ్యంతో 2014 లో మరణించాడు.
అయినా ఆమె తట్టుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలను నెరవేర్చనున్నారు.