Idream media
Idream media
ఆయనో సీనియర్ రాజకీయ నాయకుడు.కాంగ్రెస్‌లో ఉండగా ఎన్నో పదవులు అనుభవించారు. రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం రాజ్య సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే.. కొంత కాలంగా ఆయన టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. అందుకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కారణమని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ.. డీఎస్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరికకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయినట్లు తెలిసింది. సోనియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయినా కాంగ్రెస్‌లోకి ఆయన చేరికకు బ్రేక్ పడింది. అందుకు కారణాలేంటి..? సోనియా కూడా ఒకే అన్నాక అడ్డుకున్నదెవరు..? ఇప్పుడు డీఎస్ పొలిటికల్ భవితవ్యం ఏంటి?.. వీటికి సమాధానాలు కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.
అసలేం జరిగింది..
మళ్లీ సొంతగూటికి చేరేందుకు ధర్మపురి శ్రీనివాస్.. ఆయన రాకకోసం కాంగ్రెస్ నాయకత్వం.. ఇరువురూ ప్రయత్నాలు చేశారు. సోనియా కూడా ఒకే అనడం.. డీఎస్ కూడా ఆసక్తి చూపడంతో చేరిక లాంఛనమే అని వార్తలు వచ్చాయి. కానీ ఊహించింది ఒకటైతే.. జరిగింది మరొకటిగా కనిపిస్తోంది.టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లాలనకుంటే అక్కడ ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్.. పదవీకాలం మరో మూడు నెలల్లో ముగుస్తుంది. చాలా కాలంగానే ఆయన టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి జంప్ కావడం ఖాయమన్న ప్రచారం చాలారోజులుగా సాగుతోంది. డీఎస్ కూడా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కాంగ్రెస్‌తోనే తన రాజకీయ శేషజీవితం ముగియాలన్న డీఎస్ కోరికపై సోనియా సానుకూలంగా స్పందించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అతనికి వ్యతిరేక సెగ ఎదురుకావడంతో కథ అడ్డం తిరిగింది.
కారణాలు ఇవేనా..
సోనియాతో చర్చల తర్వాత డీఎస్ పార్టీలోకి ఎంట్రీ విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు అధిష్టానం అప్పగించింది. దాంతో డీఎస్‌ను చేర్చుకునే విషయంపై నిజామాబాద్ నేతలతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలతో ఠాగూర్ మాట్లాడారు. డీఎస్ రాకను రాష్ట్ర పార్టీ నేతలతో పాటు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారట. సోనియా, రాహుల్ గాంధీలపై డీఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు అందుకు ఆజ్యం పోసినట్లు సమాచారం. డీఎస్‌ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదన్నది రాష్ట్ర కాంగ్రెస్ నేతల వాదనగా తెలుస్తోంది. డీఎస్ రీ ఎంట్రీకి పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో.. రాహుల్‌గాంధీ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు పార్టీల్లో ఉండడం కుదరదని, ఒకవేళ డీఎస్ చేరాలనుకుంటే ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్‌లో చేరితేనే స్వాగతించాలని రాహుల్ కూడా సూచించినట్టు సమాచారం. ఫలితంగా మళ్లీ కాంగ్రెస్‌లో చేరి రాజకీయంగా పూర్వవైభవం పొందాలనుకున్న డీఎస్ కోరిక తాత్కాలికంగా తీరే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read : తగ్గేదేలే : కేంద్రంతో కేసీఆర్ మరో విడత యుద్ధం
వీహెచ్ ఏం అన్నారంటే..
కాంగ్రెస్‌లోకి డీఎస్ చేరికపై సీనియర్ నేత వీ.హనుమంతరావు స్పందించారు. “ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో పదవులు అనుభవించారు. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయనను మళ్లీ పార్టీలో చేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. పైగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన కుమారుడు అరవింద్ కూడా వస్తానంటేనే డీఎస్‌ను చేర్చుకోవాలని చెబుతున్నారు.ఇద్దరూ వస్తేనే పార్టీకి కూడా ఉపయోగం. డీఎస్ చేరికతో ఒరిగేది లేదు” అని వీహెచ్ తేల్చి చెప్పారు.