iDreamPost
android-app
ios-app

కేంద్ర మంత్రి మాట‌లు అవాస్త‌వ‌మేనా? రైతుల మృతికి కారకులెవరు?

కేంద్ర మంత్రి మాట‌లు అవాస్త‌వ‌మేనా? రైతుల మృతికి కారకులెవరు?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లఖింపూర్‌ ఖేరి లో జ‌రిగిన ఘటన దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన విష‌యం తెలిసిందే. న‌లుగురు రైతులు స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం చెందారు. దీనికి కార‌ణం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా అని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఆ స‌మ‌యంలో తన కుమారుడు అక్క‌డ లేడ‌ని అజ‌య్ మిశ్రా చెప్పారు. ఏటా తమ స్వగ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి రావాల్సి ఉందన్నారు. లఖింపూర్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, తాను, ఉప ముఖ్యమంత్రి ఇద్దరం తమ స్వగ్రామానికి వెళుతున్నామని చెప్పారు. త‌మ‌తో కానీ, వేరేగా కానీ త‌న కుమారుడు ఆ ప్రాంతానికి రాలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే.. పోలీసుల విచార‌ణ‌లో ఆ స‌మ‌యంలో ఎక్క‌డున్న‌ది అజ‌య్ మిశ్రా కుమారుడు అశిష్‌ మిశ్రా చెప్ప‌లేక‌పోయార‌ని తెలుస్తోంది.

లఖింపూర్‌ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశిష్‌ మిశ్రా విచారణకు హాజరయ్యాడు. సుప్రీం ఆదేశాలతో గత బుధవారం యూపీ పోలీసులు విచారణకు హాజరవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఘటన జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఆయన శనివారం ఉదయం యూపీ క్రైం బ్రాంచ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఈ నెల 3న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటికే అశిష్‌ మిశ్రాపై హత్య కేసు కూడా నమోదైంది.

Also Read : యూపీ బీజేపీకి శిరోభారం, రైతు ఉద్యమం రాజుకుంటుందనే ఆందోళన

లఖింపూర్ ఖేరి హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రా ఉత్తరప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఘటన జరిగిన రోజన తను అక్కడ లేనని చెబుతూ వస్తున్న ఆశిష్.. పోలీసుల ముందు నిరూపించడంలో విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 3న మధ్యాహ్నం 2.36-3.30 గంటల మధ్య లఖింపూర్ ఖేరిలో జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రైతులను తొక్కించుకుంటూ వెళ్లిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తుండగా ఆ సమయంలో తాను వేరే ఊర్లో ఓ కార్యక్రమానికి హాజరైనట్టు ఆశిష్ చెప్పుకొచ్చారు. అయితే, విచారణలో స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అంతకుముందు ఆయన సదర్ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ స్కూటర్‌పై లఖింపూర్ ఖేరి పోలీస్ లైన్స్‌లో ఉన్న క్రైం బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ సందర్భంగా అధికారులు ఆయన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్‌ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై యూపీ ప్రభుత్వాన్ని నిన్న సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మొత్తంగా ఈ ఇష్యూ యూపీ స‌ర్కారుకు, కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కు తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. దీన్ని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా విష‌యం దేశ వ్యాప్తంగా సీరియ‌స్ కావ‌డంతో అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది.

Also Read : ఓ బషీర్‌భాగ్, ఓ నిర్భయ, ఓ లఖీంపూర్‌..