రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు తప్ప అంటారు. ప్రస్తుత కర్ణాటక రాజకీయాల్లో మంత్రి(మాజీ) రమేష్ జార్కిహొళి విషయంలో అదే జరిగింది అనిపిస్తోంది. అనుకోని రీతిలో వివాదంలో చిక్కుకున్న ఈ నేత కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటానికి కారణం అయిన రమేష్ జార్కిహొళి , ఉద్యోగం కోసం తవ వద్దకు వచ్చిన మహిళతో అసభ్యంగా ఉన్న వీడియో బయటపడటంతో అప్రతిష్టపాలై తన రాజకీయ జీవితం పై మచ్చ వేసుకున్నారు.
ముగ్గురూ ముగ్గురే!
రమేష్ జార్కిహొళి కుటుంబలో ఆయనతో పాటు ఇద్దరు సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ముగ్గురు వేర్వేరు పార్టీల నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావడం ప్రత్యేకత. రమేష్ జార్కిహొళి, బాలచంద్ర జార్కిహొళి, సతీష్ జార్కిహొళిలు కర్ణాటకలోని బెల్గామ్ జిల్లా గోకక్, అరబవి, యామకనమరడి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. రమేష్ జార్కిహొళి మొదట కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ప్రస్తుతం రమేష్ సోదరుడు సతీష్ కర్ణాటక కౌన్సిల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1999లో రమేష్ జార్కిహొళి జనతా దళ్ యునైటెడ్ అభ్యర్థి నాయక్ చంద్రశేఖర్ సదాశివను 55 వేల ఓట్ల తేడాతో ఓడించి మొదటిసారి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో అదే అత్యధిక మెజారిటీ. 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మల్లప్ప లక్ష్మణ్ మీద 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున గోకక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడంలో..
2018 లో కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఏపార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాలేదు. బీజేపీ 104 ,కాంగ్రెస్ 80,జనతాదళ్(యస్) 37,బీఎస్పీ మరియు స్వతంత్రులు 3 స్థానాలు గెలిచారు. కాంగ్రెస్, జనతాదళ్(యస్) ,ముగ్గురు ఇండిపెండెంట్లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరినా గవర్నర్ బీజేపీ నేత యడ్యురప్పకు ముఖ్యమంత్రిగా ఆవకాశం ఇచ్చారు. బలనిరూపణకు కూడా రెండు వారాల గడువు ఇవ్వగా కాంగ్రెస్-జనతాదళ్(యస్) సుప్రీంకోర్టుకు వెళ్లగా కోర్టు 48 గంటల్లో యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యే లను కేరళ,హైద్రబాద్ హోటళ్లలో క్యాంప్ రాజకీయం నడిపింది. బలం నిరూపించుకోలేమని అర్ధమైన యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రసంగం చేసి నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామ చేశారు.
కుమారస్వామి మంత్రివర్గం
కాంగ్రెస్ మద్దతుతో జనతాదళ్(యస్) నేత కుమారస్వామి మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ కాంగ్రెస్,జనతాదళ్(యస్) లోని సీనియర్ నేతలందరికీ మంత్రి పదవులు ఇవ్వలేక పోవటంతో నిత్య అసమ్మతి ఎదురుకొన్నారు. సిద్దరామయ్య శిష్యుడైన రమేష్ జార్కిహొళికి మంత్రి పదవి రాకపోవటంతో తిరుగుబాటు జండా ఎగురవేశాడు..
మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ బెల్గామ్ జిల్లా రాజకీయాల్లో కలగచేసుకోవటం, కాంగ్రెస్ పార్టీలో తన విరోధి అయినా లక్ష్మి హెబ్బాల్కర్ ను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించటం తో రమేష్ జార్కిహొళికి కోపం పెరిగింది. మరో వైపు యడ్యూరప్ప రమేష్ జార్కిహొళిని దువ్వటంతో జూలై 2019లో 15 మంది ఎమ్మెల్యే లతో కలిసి తిరుగుబాటు చేసి విశ్వాస తీర్మానంలో కుమారస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వం కూలటానికి కారణమయ్యారు.
అనర్హత-బీజేపీ తరుపున ఎంపిక
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నాటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హట్ వేటు వేశాడు .2019 డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి రమేష్ జార్కిహొళి తన సోదరుడయ్యే కాంగ్రెస్ అభ్యర్థి లఖన్ మీద గెలిచారు. హామీ ఇచ్చినట్లే యడ్యూరప్ప రమేష్ జార్కిహొళికి తమ ప్రభుత్వంలో సాగు నీటి శాఖ మంత్రి పదవి ఇచ్చారు.
మళ్ళీ ముందుకు రాగలరా?
కర్ణాటక రాజకీయాల్లో బెల్గామ్ జిల్లా కీలకం. మహారాష్ట్ర సరిహద్దు ఆనుకుని ఉండే ఈ జిల్లా లో 13 నియోజక వర్గాలు ఉన్నాయి. మరాఠాలు ఎక్కువగానే ఉండే ఈ జిల్లాలో మహారాష్ట్ర రాజకీయ ప్రభావం కనిపిస్తుంది. వాల్మీకి నాయక, లింగయత్ లు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో వీరి ప్రాబల్యం ఎక్కువ. వాల్మీక నాయక్ సామాజిక వర్గానికి చెందిన జార్కిహొళి కుటుంబం దశాబ్దాలుగా ఆ ప్రాబల్యాన్ని అలాగే పెంచుకుంటూ వస్తోంది. ఈ కుటుంబం పట్టు ఎక్కడ కోల్పోకుండా జిల్లాలో రాజకీయాలు చేయడంతో పాటు కాంగ్రెస్ కు రమేష్ వెన్నుముక గా నిలిచేవారు. రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా ఉండే ఈ కుటుంబం ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకోవడంతో కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యంగా బెల్గావ్ జిల్లా రాజకీయాల్లో పెద్ద కుదుపు గా భావించవచ్చు.