iDreamPost
android-app
ios-app

నాని, సూర్య – తర్వాత ఎవరు

  • Published Aug 23, 2020 | 7:07 AM Updated Updated Aug 23, 2020 | 7:07 AM
నాని, సూర్య – తర్వాత ఎవరు

మొన్నటి దాకా ఓటిటి విషయంలో మౌనంగా ఉంటూ ఎదురు చూపులకే ప్రాధాన్యం ఇచ్చిన సౌత్ స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా డిజిటల్ దారి పడుతున్నారు. థియేటర్లు తెరిచినా తెరవకపోయినా ఇప్పటికిప్పుడు మునుపటి పరిస్థితి వచ్చే అవకాశం లేకపోవడంతో నిర్మాత శ్రేయస్సు కోరి ఆన్ లైన్ రిలీజ్ కు సై అంటున్నారు. ఇందులో మొదటి అడుగుగా నాని వి సెప్టెంబర్ 5న రాబోతోంది. 25 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెజాన్ ప్రైమ్ అంతకన్నా ఎక్కువ ధరనే చెల్లించడం ఇప్పటికే సంచలనంగా మారింది . నిన్న సూర్య కూడా తన ఆకాశమే నీ హద్దురాని అక్టోబర్ 30కి ప్రీమియర్ లాక్ చేయడం ఇంకో సెన్సేషన్.


సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఎయిర్ డెక్కన్ గోపినాద్ బయోపిక్ మీద చాలా హైప్ ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు తర్వాత ఎవరు వస్తారనే దాని మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటరూకు సంబంధించి రేపు ఏదో ప్రకటన ఉంటుందని ఇందాకే ఓ ట్వీట్ చేశారు. అది ఏదైనా పాట గురించా లేక విడుదలకు సంబంధించిన ప్రకటనా అనే విషయంలో రేపు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఎప్పటినుంచో ఊరిస్తున్న అనుష్క నిశబ్దం ఇప్పటిదాకా ఖరారుగా ఏదీ చెప్పలేదు. కోన వెంకట్ అప్పుడప్పుడు హింట్లు ఇస్తున్నారు కానీ అప్ డేట్ మాత్రం చేయడం లేదు. రెడ్ గురించి ప్రచారం జరిగింది కాని హీరో రామ్ దానికి ససేమిరా అన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఉప్పెన ఖచ్చితంగా థియేటర్లలోనే వదులుతామని మేకర్స్ ఎప్పుడో చెప్పారు.
రవితేజ క్రాక్ గురించిన వార్తలను దర్శకుడు గోపీచంద్ ఖండించారు.  కాని ఎవరి నిర్ణయమైనా స్థిరంగా ఉంటుందని చెప్పడానికి లేదు. రానా అరణ్య, యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా చాలా రోజుల నుంచి ప్రమోషన్ కు దూరంగా ఉంటున్నాయి. ఓటిటి సూచనలు ప్రస్తుతానికి లేవు. పెద్ద హీరోలే రాజీ పడుతున్న వేళ ఎంతో కాలం సైలెంట్ గా ఉండటం సాధ్యపడదు. పెట్టుబడుల మీద వడ్డీల భారం లేనివాళ్ళకు ఇదంతా పెద్ద కష్టం కాదు కానీ సగటు నిర్మాతలు పడుతున్న తిప్పలు బయటికి కనిపించకపోయినా లోలోపల నలిగిపోతున్న మాట వాస్తవం. అసలే బాలీవుడ్ లో పోటీ పడుతూ మరీ తమ సినిమాలను ఓటిటిలకు అమ్మేస్తున్నారు. ఇంతకన్నా వేరే గత్యంతం లేదు. డిసెంబర్ నాటికి థియేటర్ల పరిస్థితి కొంతమెరుగు పడుతుంది కానీ అప్పటిదాకా ఓపిగ్గా వేచి చూసేవాళ్ళు ఎందరు