iDreamPost
android-app
ios-app

ఎర్రకోట ముట్టడి సూత్రధారి ఇతడేనా..?

ఎర్రకోట ముట్టడి సూత్రధారి ఇతడేనా..?

ఎర్రకోట ముట్టడి రాజకీయ వర్గాల్లోనే కాదు.. రైతు సంఘాల్లోనూ కలకలం రేపుతోంది. ఈ ముట్టడికి సూత్రధారి పంజాబీ గాయకుడు, నటుడు దీప్‌ సిద్థూ అని కర్షక సంఘాల నేతలు ఆరోపించారు. ఆయనే రైతులను రెచ్చగొట్టి ఎర్రకోట దిశగా మరిల్చాడని, ఓ యువకుణ్ణి ఉసిగొల్పి సిక్కు మత జెండాను ఎగరేసేట్లు చేశాడని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) హరియాణ విభాగం నేత గుర్నామ్‌ సింగ్‌ చదౌనీ చెప్పారు.

ఎర్రకోట వైపు వెళ్లాలని ఏ రైతూ అనుకోలేదని, దీప్‌ సిద్దూయే వారికి చెప్పి, అక్కడ జెండా ఎగరేస్తే గానీ ఆందోళన విజయవంతం కాదని దుష్ప్రచారం చేశాడని ఆయన అన్నారు. ‘మేం మొదట్నుంచీ ఆయనను దూరం పెట్టాం. రైతు సంఘాల సమావేశాల్లో గానీ ఆందోళనల్లో గానీ ఆయనకు స్థానం ఇవ్వలేదు. ఎర్రకోట వద్ద హింస జరిగినపుడు అతను అక్కడే ఉన్నాడు’ అని స్వరాజ్‌ ఇండియా అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌జేఎఫ్‌)తో దీప్‌కు సంబంధాలున్నాయని, ఆ సంస్థ ఆదేశం మేరకే ఈ పనిచేయించడాని రైతు నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీపైనా అనుమానాలు..?

పంజాబ్‌లోని ముక్తసర్‌లో 1984లో పుట్టిన దీప్‌– కింగ్‌ ఫిషర్‌ మోడల్‌గా ఎంపికై తరువాత సినీరంగంలోకి వచ్చారు. ఆయనను తొలుత హీరోగా పరిచయం చేసినది సుప్రసిద్ద బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర. రామ్‌తా జోగి అనే సిన్మాలో నటించాక ఆయన 2019 ఎన్నికల్లో ధర్మేంద్ర కుమారుడైన సన్నీ దేవళ్‌ తరఫున గురుదాస్‌పూర్‌లో బీజేపీకి ప్రచారం చేశారు. ఆ తరువాత రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి వివిధ మార్గాలను వెతుక్కుంటూ ఈ ఆందోళనను తన ఎదుగుదలకు ఓ ఆలంబనగా చేసుకున్నాడు. కొందరు బీజేపీ నాయకులకు ఆయన సన్నిహితుడని ప్రచారం సాగుతోంది. 2019లో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో దిగిన ఫోటోను సుప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ షేర్‌ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి తీవ్ర సంచలనం రేపింది. రైతుల ఆందోళనను దెబ్బతీయడానికి బీజేపీయే ఈ కుట్రకు పాల్పడిందని విమర్శలు రేగాయి. ‘‘రైతుల నిరసనలోకి చొరబడి అన్నదాతలను అప్రదిష్టపాల్జేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందా?’ అని ప్రశాంత్‌ భూషణ్‌ కూడా ట్వీట్‌ చేశారు.

ఫేస్‌బుక్‌లో దీప్‌ పోస్ట్‌

ఎర్రకోట వద్ద తాము ఎగరేసినది సిక్కు మత పవిత్ర పతాకమైన నిశాన్‌ సాహిబ్‌ అనీ, ఇది ఎగరేయడం ద్వారా తమకున్న ప్రజాస్వామ్య హక్కును వినియోగించామని దీప్‌ సిద్ధూ ఓ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని తాము తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. ‘హింసకు ప్రేరేపించినది నేనే అని యూనియన్‌ నేతలు చెప్పడాన్ని ఖండిస్తున్నా… ఇది ఒక్కరి పని కాదు. రెండు నెలల నుంచి రైతుల ఆందోళన సాగుతోంది. ఆవేశకావేశాలు మిన్నంటాయి. ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నపుడు నేనే చేశానని ఎలా నిందిస్తారు?’ అని ఆ వీడియో పోస్ట్‌లో దీప్‌ ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. మంగళవారంనాటి విధ్వంసకర పరిణామాలకు కారణం… కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్షణ కమిటీ అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 41 యూనియన్ల ఐక్య వేదిక కిసాన్‌ మోర్చాతో విభేదించి ఈ సంఘర్షణ్‌ కమిటీ ఘాజీపూర్‌ సరిహద్దుల వద్ద నుంచి ఢిల్లీ దిశగా కదిలింది. నిర్దేశిత మార్గాలను ఉల్లంఘించి ముందుకు సాగాలని రైతులకు పిలుపునిచ్చి అనేక చోట్ల ఉద్రిక్తతలకు కారణమైనట్లు కొందరు రైతు నేతలు అంటున్నారు.