iDreamPost
iDreamPost
నిన్న సాయంత్రం దర్శకుడు గుణశేఖర్ తన కొత్త సినిమా శాకుంతలంని ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరిచింది. రానాతో చేయాల్సిన హిరణ్యకసిపకు వందల కోట్ల భారీ బడ్జెట్ పాటు కరోనా ఆంక్షలు లేని షూటింగ్ పరిసరాలు అవసరం ఉండటంతో దాన్ని తాత్కలికంగా పెండింగ్ లో ఉంచారు. ఆ స్థానంలోనే శాకుంతలం వచ్చింది. ఇతిహాసాల్లో ఉన్నట్టు శాకుంతల జన్మవృత్తాంతాన్ని, ఆమెకు దుశ్యంతుడితో జరిగిన ప్రేమకథను తెరకెక్కిస్తారా లేక అదే కాన్సెప్ట్ తో మాడరన్ గా ఏదైనా కొత్త స్క్రిప్ట్ ను రాసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. గుణశేఖర్ రుద్రమదేవి తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా హిరణ్యకసిపకే అంకితమయ్యారు.
అయితే పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేకపోవడంతో గతంలోనే రాసుకున్న శాకుంతలంను తెరమీదకు తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఇందులో హీరోయిన్ ఎవరనేది రివీల్ చేయలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్వీటీ అనుష్క పేరే గట్టిగా వినిపిస్తోంది. రుద్రమదేవిలో తనను గుణశేఖర్ ఎంత అద్భుతంగా చూపించారో తెలిసిందే. ఇది అలాంటి బ్యాక్ డ్రాప్ కానప్పటికీ పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో అనుష్క తప్ప ఇంకెవరైనా బెస్ట్ ఛాయస్ అనిపించుకోరని ఆయన అభిప్రాయమట. దీనికి సంబంధించిన క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇక గుణశేఖర్ మణిశర్మల కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలమయ్యింది. చూడాలని ఉంది-ఒక్కడు లాంటి ఆల్ టైం మ్యూజికల్ హిట్స్ వీళ్ళ కాంబోలో వచ్చాయి.
మనోహరం-అర్జున్-వరుడు ఫలితాలు నిరాశపరిచినా సంగీతపరంగా మంచి పేరే వచ్చింది. ఇప్పుడిది ఆరో సినిమా. గుణశేఖర్ తన గత రెండు సినిమాలకు నిప్పుకు తమన్, రుద్రమదేవికి ఇళయరాజాను తీసుకున్నారు కానీ పాటల పరంగా అవేవి అద్భుతాలు చేయలేకపోయాయి. అందుకే తనకు అచ్చి వచ్చిన మణిశర్మకే ఓటు వేశారు. షూటింగ్ కు ఎంత టైం పడుతుంది వచ్చే ఏడాది విడుదలకు ఛాన్స్ ఉంటుందా లేదా లాంటివి తెలియడానికి టైం పడుతుంది. అయితే రానా హిరణ్యకసిప బాగా ఆలస్యమయ్యే మాట మాత్రం వాస్తవం. ఆర్ఆర్ఆర్ లాంటి మల్టీ స్టారర్లే కిందా మీద పడుతున్న కోవిడ్ వాతావరణంలో ఇదే మంచి నిర్ణయమని చెప్పాలి. సరే శకుంతలగా అనుష్కను అనుకుంటే మరి దుశ్యంతుడు ఎవరో.