iDreamPost
android-app
ios-app

పంజాబ్ లో పట్టంకట్టేదెవరికి..?

పంజాబ్ లో పట్టంకట్టేదెవరికి..?

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హ‌స్తం చేతుల్లో ఉన్న అధికారాన్ని చేజిక్కించుకోవ‌డానికి ఈసారి ఆప్, బీజేపీ గ‌ట్టిగానే పోరాడాయి. అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి కాంగ్రెస్ కూడా త‌న‌వంతు ప్ర‌య‌త్నాల‌ను బాగానే కొన‌సాగించింది. అయితే.. పార్టీ నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు కొంత గంద‌ర‌గోళాన్ని సృష్టించింది. అయితే.. సీఎం అభ్య‌ర్థిగా మ‌ళ్లీ ఛ‌న్నీని ప్ర‌క‌టించ‌డం, ఆ సంద‌ర్భంగా ఆయ‌న సిద్ధూ కాళ్ల‌పై ప‌డ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఉత్తరప్రదేశ్‌ తర్వాత అందరి దృష్టి పంజాబ్‌పైనే ఉంది. యూపీ తర్వాత ఇదే పెద్ద రాష్ట్రం. ఈసారి అక్కడ పాగా వేయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాకపోతే రైతు చట్టాల కారణంగా అక్కడ బీజేపీ కి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.. మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధినేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై పొత్తు క‌లిసి వ‌స్తుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీతో శిరోమణి అకాలీదళ్‌ తెగతెంపులు చేసుకున్న తర్వాత అక్కడ కమలదళానికి ఓ పార్టీ అవసరం అయ్యింది. అందుకే అమరీందర్‌తో జతకట్టింది. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్‌, బీజేపీ కూటమి మధ్య జరుగుతున్న చతుర్ముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లో మొన్నటి వరకు ఎలాగైతే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయో అలాగే పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప‌న‌లు చేశారు.

వ్యవసాయ చట్టాలను సైతం వెన‌క్కి తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ రైతుల ఆగ్రహం త‌గ్గిన‌ట్లుగా లేదు. అదో ఎన్నికల స్టంట్‌గానే చాలామంది భావిస్తున్నారు.. పైగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ మొన్నటి వరకు పోరాడిన రైతులలో అత్యధికులు పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ రైతుల కోపం తగ్గలేదన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది. జనవరి 5న పంజాబ్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ని రైతులు అడ్డగించారు. హుసేనీవాలాలోని అమరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించడానికి రోడ్డుమార్గంలో వెళుతున్న ప్రధాని కాన్వాయ్‌ని పైరియాణా దగ్గర ఓ ఫ్లైఓవర్‌లో రైతులు అడ్డుకున్నారు. దాంతో ప్రధాని నడిరోడ్డుపై ఓ 20 నిమిషాల పాటు వాహనంలో ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ సంఘటనపై విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు బాగానే జరిగాయి.

ఫిరోజ్‌పూర్‌లో బీజేపీ తలపెట్టిన బహిరంగసభకు ప్రజలు పెద్దగా రాకపోవడంతో ప్రధాని తన పంజాబ్‌ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని వెళ్లిపోయారంటూ విపక్షాలు ఆరోపించాయి. నిజానికి ఈ సంఘటన బీజేపీకి అడ్వాంటేజ్‌ కావాలి కానీ అది జరగలేదు. పైపెచ్చు బీజేపీ మరింత డీలా పడ్డది. అమరీందర్‌ బీజేపీని గట్టున పడేస్తారన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. బీజేపీ అధిష్టానం కూడా అలా అనుకోవడం లేదు. కాంగ్రెస్‌ నుంచి అమరీందర్‌ బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత పంజాబ్‌లోని కీలక కాంగ్రెస్‌ నేతలంతా అమరీందర్‌ సైడుకు వస్తారని అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా అటువైపు చూడలేదు. కాకపోతే ఏదైనా విచిత్రం జరిగి అధికారంలోకి రాకపోతామా అన్న చిగురంత ఆశతో ఉంది. ఆ ఆశతోనే ర్యాలీలు, బహిరంగసభలు నిర్వ‌హించారు.

పంబాబ్‌లో సిక్కులతో పోలిస్తే హిందువుల శాతం తక్కువే. 60 శాతం సిక్కులు ఉంటే 39 శాతం హిందువులు ఉంటారు. అది కూడా పటాన్‌కోట్‌, జలంధర్‌, హోషియార్‌పూర్‌, షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటారు. నిజానికి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఈ జిల్లాల నుంచే ఎక్కువగా పోటీ చేసేది. ఇప్పుడు మాత్రం అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇవాళ కాకపోతే రేపైనా అక్కడ బలపడాలన్నది బీజేపీ వ్యూహం. బీజేపీ 68 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తోంది. కూటమిలో ఉన్న పంజాబ్‌ లోక్ కాంగ్రెస్‌ 34 స్థానాల నుంచి , శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త్‌) 15 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. మెజార్టీ స‌ర్వేలు పంజాబ్ లో ఈసారి ఆప్ స‌త్తా చాటుతుంద‌ని ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలో నేడు ఓట‌ర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో.

Also Read :  పంజాబ్‌ పోరు ముంగిట ఆసక్తికర పరిణామాలు