Idream media
Idream media
పంజాబ్‌లో కాంగ్రెస్ రాజకీయం రంజుగా మారింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్, నవ్‌జోత్ సింగ్ సిద్ధూపై చేసిన దేశద్రోహ ఆరోపణలతో పంజాబ్ రాజకీయం కాక పుట్టిస్తుంది.మరోవైపు తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక అంశం జన్‌పథ్ గడప తొక్కింది.ఇక సీల్డ్ కవర్ సీఎం ఎవరనేది తేలాల్సి ఉంది.
కాంగ్రెస్‌లో కెప్టెన్ వర్సెస్ క్రికెటర్‌గా నడిచిన అంతర్గత పోరు చివరకు సీఎం అమరేందర్ రాజీనామాకు దారితీసింది. కాగా సొంత పార్టీలోనే తనకు పక్కలో బల్లెంలా వ్యవహరించిన సిద్దూకి ముఖ్యమంత్రి పీఠం దక్కకుండా చేయడానికి కెప్టెన్ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధూకి పాక్‌తో సంబంధాలు ఉన్నాయని,పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వాలతో స్నేహం ఉందని ఆరోపించారు. సిద్ధూ సీఎం అయితే దేశ భద్రతకే ప్రమాదం వాటిల్లుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సిద్ధూని ముఖ్యమంత్రిని చేస్తే అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు కాంగ్రెస్‌పై విరుచుకు పడటానికి కెప్టెన్ వ్యాఖ్యలు అస్త్రాలుగా మారే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో సిద్ధుని కాకుండా సిక్కుయేతర నేతని ముఖ్యమంత్రిగా చేస్తే ఉభయ తారకంగా ఉండి అమరేందర్ సింగ్ వర్గాన్ని కూడా సంతృప్తి పరచవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో అమరేందర్ వర్గం తిరుగుబాటు చేసే అవకాశం ఉండదు. పైగా పీసీసీ అధ్యక్షుడు ఎలాగూ జాట్ సిక్కు నేతే కాబట్టి సీఎం నాన్ సిక్కు అయితే ఆ వర్గం ఓట్లు కూడా దండుకోవచ్చు అనే ఎత్తుగడ కాంగ్రెస్ వేసే అవకాశం ఉంది. తద్వారా సిక్కు-నాన్ సిక్కు కాంబినేషన్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవటం లాభదాయకంగా ఉంటుందని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
తదుపరి సీఎం నాన్ సిక్కు..?
జాట్ సిక్కు వర్గానికి చెందిన అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేయగా నవజోత్ సింగ్ సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. దీంతో సీఎం కుర్చీని సిక్కు యేతర వర్గానికి కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో తదుపరి సీఎంగా పంకోసీ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల సునీల్ కుమార్ జాఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత పలుమార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన అంబికా సోని కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిద్దరితో పాటు సీఎం పదవికి పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ,మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్, మాజీ మంత్రి సుఖ్ జీందర్ సింగ్ వంటి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.కాగా సిక్కుయేతర వర్గానికి ప్రాధాన్యమిస్తే మాజీ పీసీసీ చీఫ్ సునీల్ కుమార్ జాఖరే పంజాబ్ నూతన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.
పంజాబ్‌లో సుమారు 33 శాతం దళితులు ఉన్నారు. ఈ ఓట్ బ్యాంక్ దృష్ట్యా దళిత వర్గానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి పీఠం దక్కిన ఆశ్చర్యం లేదు. ఏదేమైనా “సిక్కు- నాన్ సిక్కు” ఫార్ములాతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మార్పు కాంగ్రెస్‌కి ఏమేరా లభిస్తుందో వేచి చూడాలి.