iDreamPost
android-app
ios-app

విద్యారంగాన్ని ఎవరు భ్రష్టు పట్టించారు జవహర్‌?

  • Published Feb 15, 2022 | 7:29 AM Updated Updated Feb 15, 2022 | 7:29 AM
విద్యారంగాన్ని ఎవరు భ్రష్టు పట్టించారు జవహర్‌?

దొంగే.. దొంగా దొంగా అని అరచినట్టు ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు. తమ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించడమే కాక ఆ తప్పును ప్రస్తుత ప్రభుత్వం చేసిందంటూ గగ్గోలు పెడుతోంది. మాజీ మంత్రి జవహర్‌ సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం భ్రష్టుపట్టిందని ఆరోపించారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో పెట్టాలనడం విద్యారంగాన్ని నాశనం చేయడమే అన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసానికి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్ కోసం టీడీపీ ఆధ్వర్యంలో మా ఊరు-మా బడి కార్యక్రమం చేపట్టబోతున్నామని వెల్లడించారు.

బాబు పథకం ప్రకారం దెబ్బ తీయలేదా?

చంద్రబాబునాయుడి పాలనలో కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలకు మేలు చేయడం కోసం ప్రభుత్వ విద్యను దారుణంగా దెబ్బతీశారు. తన హెరిటేజ్‌ డెయిరీ వ్యాపారాభివృద్ధి కోసం ప్రభుత్వ డెయిరీలను దెబ్బతీసిన చందంగానే ప్రభుత్వ స్కూళ్లను చంద్రబాబు పథకం ప్రకారం దెబ్బతీశారని వైఎస్సార్‌ సీపీ నాయకులు చెబుతున్నారు.  పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ పి.నారాయణ రుణం తీర్చుకోవడం కోసం ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమే కాక, ప్రభుత్వ విద్యను పణంగా పెట్టారని వైఎస్సార్‌ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా, ఖాళీ అయిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కావాలనే జాప్యం చేసేవారు. డ్రాపవుట్స్‌ వంక చూపి స్కూళ్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేశారు. తమ పిల్లలను కార్పొరేటు, ప్రైవేటు స్కూళ్లకు పంపడం తప్ప వేరే గత్యంతరం లేని స్థితికి తల్లిదండ్రులను నెట్టేసిన ఘనత చంద్రబాబుదే. చంద్రబాబు స్వార్థం కారణంగా ఆయన పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ఏటా అడ్మిషన్లు తగ్గడం, ప్రైవేటులో ఆ మేరకు పెరగడం అందరికీ తెలిసిందేనని అంటున్నారు.

సీఎం జగన్‌ చొరవతో విద్యారంగానికి జవసత్వాలు

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యారంగానికి సీఎం జగన్‌ జవసత్వాలు కల్పించారని వైఎస్సార్‌ సీపీ నేతలు చెబుతున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కార్పొరేటు స్కూళ్లకు ధీటుగా మెరుగుపరిచారు. నాడు- నేడు మనబడి పథకం కింద రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి 57 వేల స్కూళ్ల రూపురేఖలు మార్చేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా 80 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఏటా రూ.15 వేల చొప్పున జమ చేస్తున్నారు. విద్యాకానుకకు రూ.760 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న గోరుముద్దకు రూ.1,200 కోట్లు వెచ్చించారు. ఇవి కాక విద్యాదీవెన, విద్యావసతి వంటి పథకాలతో పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను అరికట్టారు. ఇంగ్లీష్ మీడియం విద్యతోపాటు సీబీఎస్‌ఈ సిలబస్‌ను కూడా దశలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకున్న చర్యల వల్ల ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 7.30 లక్షల అడ్మిషన్లు పెరిగాయని విద్యాశాఖ ఇటీవలే ప్రకటించింది. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త భవనాల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు కూడా. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్‌, ఎన్‌సీఈఆర్‌టీ కూడా మెచ్చుకున్నాయి.

విద్యపైనా రాజకీయ విమర్శలా?

వాస్తవాలు ఇలా ఉండగా ప్రాథమిక విద్యకు చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారని చెప్పడం ఆత్మవంచన కాదా?  పాఠశాల విద్యను మెరుగుపరచడానికి తరగతులను ఒక పద్ధతి ప్రకారం విలీనం చేస్తుంటే దానిపై కూడా రాజకీయ విమర్శలు చేయడం టీడీపీకే చెల్లింది. టీడీపీ ఆధ్వర్యంలో మా ఊరు-మా బడి కార్యక్రమం చేపట్టబోతున్నామని అంటున్న జవహర్‌కు రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లలో విద్యారంగంలో వచ్చిన మార్పులపై కనీస అవగాహన ఉందా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Also Read : టీడీపీ కొత్త కార్యక్రమం.. మా ఊరు – మా బడి