చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో ధర్నా చేయాలంటే పోలీసుల ముందస్తు అరెస్టులు, నిరసన తెలపాలంటే కేసులకు సిద్ధపడాల్సిందే. ఈ విషయాన్ని నాటి సీఎంగా చంద్రబాబు కూడా చెప్పేశారు. ఇప్పుడు ప్రజా ఉద్యమాలను నిర్బంధంతో అణచివేయలేరిన చెబుతున్న బాబు, అప్పట్లో అధికారం ఉండడంతో తుందుర్రు వంటి గ్రామాల్లో మహిళలను అర్థరాత్రి రోడ్ల మీద ఈడ్చిన దాఖలాలున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే సచివాలయం సమీపంలోకి ఎవరు రావాలని ప్రయత్నించినా సీరియస్ యాక్షన్ ఉండేది. అంతేకాదు చంద్రబాబు ఏ జిల్లాకు వెళ్లినా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులే. సీపీఎం, సీపీఐ నేతలతో పాటు వివిధ ప్రజాసంఘాల వారిని కూడా నిర్బంధించడం నిత్య వ్యవహారంగా కనిపించేది.
కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.20 రోజులుగా సెక్రటేరియేట్ కి చేరువలోనే ఆందోళనలు సాగుతున్నాయి. కానీ అరెస్టుల జోలికి మాత్రం పోవడం లేదు. మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేస్తామని మందకృష్ణమాదిగ గతంలో ప్రకటించగానే ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి సాగించిన వ్యవహారం జనం మరచిపోలేదు. కానీ మంగళవారం నాడు ఏకంగా నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్భంధించినా ఖాకీలు కనీసం చర్యలు తీసుకోలేదు. చివరకు ఆందోళనకారులే స్వచ్ఛందంగా తమ రాస్తారోకో కార్యక్రమం విరమించుకోవాల్సి వచ్చింది. అంతకుమించిన వ్యవహారంలో ప్రభుత్వ విప్ వాహనంపై బరితెగించి దాడికి పాల్పడినా పోలీసు చర్య కనిపించలేదు. సెక్యూరిటీ సిబ్బంది మీద చేయి లేసినా పోలీసులు సహనమే పాటించారు.
యంత్రాంగంలో ఎందుకీ మార్పు
పోలీసు సిబ్బందిలో వచ్చిన ఈమార్పునకు అసలు కారణం ప్రభుత్వ విధానాల్లో ఉన్నట్టు స్పష్టమవుతోంది. గతంలో పూర్తిగా పోలీసులను నమ్ముకున్న చంద్రబాబు ప్రజలపై నిర్బంధం ప్రయోగిస్తే, ప్రస్తుత ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆందోళనలను శాంతియుతంగా నిర్వహిస్తే అడ్డుచెప్పకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని ఉద్యమం వరకూ ఆచితూచి వ్యవహరిస్తోంది. రైతుల విషయంలో ప్రతిపక్షం ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా తాము మాత్రం శాంతియుతంగా వ్యవహరించాలనే ఆదేశాలను పోలీసులకు ఇచ్చింది. ఈ పరిణామాలతోనే రోజుల తరబడి ఉద్యమం సాగుతున్నా రాజధాని ప్రాంతంలో ఒక్కరిపై కూడా కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకూ మీడియాపై దాడి కేసు, తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై జరిగిన కేసులు మినహా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కొందరు టీడీపీ నేతలను మాత్రం గృహనిర్బంధంలో ఉంచడం ద్వారా రైతు ఉద్యమంలో రాజకీయ జోక్యాన్ని నివారించేయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వ వ్యవహారశైలి కారణంగానే అమరావతి ఉద్యమం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి ఓ కారణంగా కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ లాఠీ లేచినా, తుపాకీ గురిపెట్టినా దానిని చిలువలుపలవలుగా చిత్రీకిరంచి, జాతీయ స్థాయిలో పెద్ద వివాదంగా మార్చే యత్నంలో కొందరున్నట్టు సందేహిస్తున్నారు. అలాంటి సమయంలో కూడా సహనంతో వ్యవహరించడం ద్వారా వారికి చెక్ పెట్టే యోచనలో సర్కారు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా సీఎం పర్యటనలో పోలీసులను మోహరించడమే నేరమన్నట్టుగా చిత్రీకరించే యత్నంలో ఓ వర్గం మీడియా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలపై దాడి జరిగినా తప్పు కాదన్నట్టుగా కథనాలు రాస్తున్న పత్రికల్లో పోలీసులు భద్రతా చర్యలు నేరం అన్న చందంగా వార్తలు అల్లడం విశేషం అవుతోంది.
ప్రభుత్వ నిగ్రహం ఫలితం ఏంటి
ఇప్పటి వరకూ రాజధాని రైతుల పట్ల సహనంతో వ్యవహరించడం ద్వారా సర్కారు విపక్షాల చేతికి ఆయుధాలు ఇవ్వకుండా అడ్డుకోగలిగింది. కానీ ఎమ్మెల్యేలపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకోవడం ద్వారా రెచ్చిపోతే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ బస్సు అద్దాలు ధ్వంసంచేసినా చూసీ చూడనట్టు వ్యవహరించిన ప్రభుత్వం తన పార్టీకే చెందిన సీనియర్ నేతతో పాటు మరో యువ ఎమ్మెల్యే పై విరుచుకుపడిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కోరుతున్నాయి. గతంలో చిన్న చిన్న ఘటనలను సాకుగా చూపించి వైసీపీ కార్యకర్తలను వేధించిన ప్రభుత్వ తీరుకి భిన్నంగా సీఎం నిగ్రహంగా సాగుతున్న ధోరణి పరిశీలకును సైతం ఆశ్చర్యపరుస్తోంది.
తన పని తాను చేసుకోవడం ద్వారా మౌనమే సమాధానం అన్నట్టుగా జగన్ సాగుతున్న తీరు విశేషంగా మారుతోంది. గతంలో విపక్ష నేతగా కూడా అనేక ఆందోళనలు, కార్యక్రమాలు చేపట్టినా విపక్షం పూర్తిగా చట్టబద్ధంగానే తన కార్యక్రమాలు కొనసాగించిన నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోనూ అదే విధంగా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. దానిమూలంగా పాలకపక్షానికి ఎంత ప్రయోజనం చేకూరుతుందన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి నష్టం మాత్రం లేదనే చెప్పవచ్చు. రానురాను ఎలా ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ నిగ్రహంతో ఉన్న అధికార పార్టీ పెద్దల వ్యవహారం జనం కూడా గమనించే ఉంటారని చెప్పవచ్చు.