iDreamPost
iDreamPost
శర్వానంద్ తో తీసిన రన్ రాజా రన్ రూపంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సుజిత్ అదే బ్యానర్లో సాహో లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడం ఒకరకంగా వరమయ్యింది మరోరూపంలో శాపమూ అయ్యింది. దాని ఫలితం పాజిటివ్ అయ్యుంటే ఈపాటికే మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో టాప్ లో ఉండేవాడు. షారుఖ్ ఖాన్ సైతం సాహో రిలీజ్ కు ముందు వరకు సుజిత్ మీద ఆసక్తి చూపించాడన్న వార్తలు వచ్చాయి. దీని సంగతలా ఉంచితే మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ బాధ్యతలు తనకే అప్పగించారని దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని గత రెండు నెలలుగా వినపడుతూనే ఉంది.
అఫీషియల్ గా అనౌన్స్ చేయడం తప్ప మిగిలిన వన్నీ జరిగిపోతున్నాయనేలా ఫీలర్స్ బయటికి వచ్చాయి. అయితే తాజాగా ఇది వివి వినాయక్ చేతుల్లోకి వెళ్ళేలా ఉందని సుజిత్ టీం చేసిన వర్క్ చిరుకు అంతగా నచ్చలేదని అందుకే మార్పు ఉండొచ్చనే ప్రచారం జోరుగానే సాగుతోంది. దీనికి సంబంధించిన సభ్యులు ఎవరూ రెస్పాండ్ కావడం లేదు కాని మొత్తానికి తెరవెనుక అయితే ఏదో జరుగుతోంది. ఇప్పుడు దీని బదులు యువి బ్యానర్లోనే గోపీచంద్ హీరోగా సుజిత్ వేరే సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. నిజానికి రామ్ చరణ్ కు సుజిత్ ని రికమండ్ చేసింది ప్రభాసే. అప్పటికే లూసిఫర్ కోసం డైరెక్టర్ ను వెతుకుతున్న చెర్రి ఇదే చేయమని చెప్పాడట.
దాంతో మెగాస్టార్ మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ అంతసులువుగా రాదు కాబట్టి ఓకే చెప్పాడు. కాని ఇప్పుడు జరుగుతోంది వేరు. ఇదంతా నిజమా కదా తెలియదు కాని ఫిలిం నగర్ టాక్ అయితే మహా జోరుగా ఉంది. ఎలాగూ గోపీచంద్ కూడా సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. సుజిత్ తో అంటే మంచి ఛాయసే. అయితే ఈ గందరగోళంకు చెక్ పడాలి అంటే సుజిత్ స్వయంగా చెప్పాలి లేదా లూసిఫర్ కు సంబంధించిన అప్డేట్ కొణిదెల సంస్థ నుంచి రావాలి. ఇది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. అయినా సుజిత్ లాంటి దర్శకులకు రీమేకులు కాకుండా ఫ్రెష్ సబ్జెక్టులతో అవకాశం ఇస్తే చిరంజీవిని బాగా చూపిస్తారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఇంకొంత కాలం ఆగితేనే సుజిత్ చేయబోయేది లూసిఫర్ రీమేకా లేక గోపీచంద్ తో సినిమానా అనే క్లారిటీ వస్తుంది