iDreamPost
android-app
ios-app

అదే జరిగితే ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుంది..?

అదే జరిగితే ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుంది..?

తెలుగు రాష్ట్రాలలో రెండు ఉప ఎన్నికలు జరుగుతున్నా.. అందరి దృష్టి తెలంగాణలోని హుజురాబాద్‌ ఉప ఎన్నికలపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని కూడా ప్రకటించిన టీడీపీ ఆ తర్వాత మిడిల్‌ డ్రాప్‌ అవడంతో.. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుందన్న విషయం తప్పా మరే ఇతర ఆసక్తికరమైన అంశాలు లేవు. అయితే హుజురాబాద్‌ ఉప ఎన్నిక మాత్రం ఆది నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌ పోటీ చేస్తుండడం, ఈటలను ఎలాగైనా ఓడించాలని టీఆర్‌ఎస్‌ శక్తియుక్తులను ఉపయోగిస్తుండడంతో ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ ఈటల అనేలా జరుగుతున్న ఈ పోరులో కాంగ్రెస్‌పార్టీ కూడా తన సత్తాను చాటేందుకు విద్యార్ధి నేతలకు టిక్కెట్‌ ఇచ్చింది. మరో వైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న వివిధ వర్గాల వారు హుజురాబాద్‌లో భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ ఉద్యోగాలకు ఎసరుపెట్టేలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ తీరుకు నిరసనగా.. 1000 మంది నామినేషన్లు వేస్తామని ఫీల్ట్‌ అసిస్టెంట్లు తాజాగా పునరుద్ఘాటించారు. గతంలో వీరి తరఫున బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ఈప్రకటన చేశారు.

నిరుద్యోగులకు మద్ధతుగా, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనందుకు నిరసనగా.. వైఎస్సార్‌టీపీ 200 మందితో నామినేషన్లు వేయిస్తామని ప్రకటించింది. తాజాగా తెలంగాణ 61 రిటైర్ట్‌ ప్రభుత్వ ఉద్యోగులు తమ నిరసనను హుజురాబాద్‌ వేదికగా తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. పీఆర్సీ ఆమలులో తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రిటైర్ట్‌ ఉద్యోగులు హుజురాబాద్‌ బైపోల్‌లో 200 నామినేషన్లు దాఖలు చేస్తామని ప్రకటించారు.

Also Read : ఆ జిల్లా అధికార పార్టీలో బ్రాండ్‌వార్‌

ఈటలపై గెలవాలనే లక్ష్యంతో కేసీఆర్‌ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే వివిధ వర్గాల వారు ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేసేందుకు హుజురాబాద్‌ ఉప ఎన్నికను వేదికగా చేసుకోవడంతో ఇప్పుడు కేసీఆర్‌లో కొత్త గుబులు మొదలైంది. ఆయా వర్గాలు చేసిన ప్రకటనలు ఆచరణలోకి వస్తే.. అది టీఆర్‌ఎస్‌కు శరాఘాతమే అవుతుంది. మొత్తం 1400 నామినేషన్లు దాఖలు చేస్తామని వివిధ వర్గాల వారు చెప్పగా.. అందులో కనీసం 200 నామినేషన్లు నిలబడేలా దాఖలు చేసినా టీఆర్‌ఎస్‌కు చిక్కులు ఎదురైనట్లే. ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఒక్క ఓటు కూడా ముఖ్యమైనదే.

భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైతే ఏం చేయాలన్న దానిపై టీఆర్‌ఎస్‌ కుస్తీలు పడుతోంది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ తరహాలోనే టీఆర్‌ఎస్‌కు చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పసుపు రైతులు దాదాపు 200 నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన రైతులకు ఒక్కొక్కరికి కనిష్టంగా 100 నుంచి గరీష్టంగా ఆరు వేల ఓట్లకు పైగా నమోదయ్యాయి.

పసుపు రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా దాఖలైన ఈ నామినేషన్ల కారణంగా.. సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత అక్కడ ఓటమిపాలయ్యారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ నేతలు.. హుజురాబాద్‌లో భారీగా నామినేషన్లు దాఖలు కాకుడదని కోరుకుంటున్నారు. నిజామాబాద్‌ తరహాలోనే హుజురాబాద్‌లోనూ భారీగా నామినేషన్లు దాఖలవుతాయా..? లేదా..? ఈ నెల 8వ తేదీన తేలిపోతుంది.

Also Read : బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జ‌న‌సేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కార‌ణాలున్నాయా?