iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ రాజీనామా చేస్తారా..?

నిమ్మగడ్డ రాజీనామా చేస్తారా..?

ఒంటెద్దు పోకడలు ప్రజా స్వామ్యానికి శ్రేయష్కరం కాదు. అలాంటి పోకడలను పాలకులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే కొంత మంది గతంలో వ్యవహారించినా.. అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలిచింది. చరిత్ర ఇంత స్పష్లంగా ఉన్నా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లాంటి కొంత మంది అధికారులు అదే దారిలో నడుస్తుంటారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత మేలుకున్నా.. అప్పడు చేసేదేమీ ఉండదు. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పరిస్థితి కూడా ఇలానే ఉందంటున్నారు ఆయన వ్యవహార శైలిని గమనించిన వారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన అధికారాలను ప్రజల కోసం ఉపయోగించాలి. కానీ ఒక వ్యక్తికో, పార్టీకో, వర్గానికో లబ్ధి చేకూర్చేందుకు యత్నిస్తే బొక్కబోర్లాపడడం ఖాయమని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్పష్టమవుతోంది.

వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టి..

పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయడంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరించిన తీరు సహేతుకంగా లేదంటూ ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్య ఆయన ఇప్పటి వరకూ ఏ విధంగా వ్యవహరించిందీ తేటతెల్లం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన విభాగమైనా.. అది కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనన్న విషయం నిమ్మగడ్డ మరిచిపోయారు. అధికారం ఉందని ఒంటెద్దు పోకడలతో వెళ్లి.. శాసన వ్యవస్థను ఢీకొట్టారు. రాజకీయ నేతలతో చేతులు కలిపి ఆయన సాగించిన వ్యవహారంతోఅంతిమంగా ప్రజలకే నష్టం కలిగింది. గత ఏడాది మార్చిలోనే ఎన్నికలు పూర్తయి ఉంటే.. పాలన సజావుగా సాగేది. కానీ తన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్నే ఫణంగా పెట్టి రాజకీయ ఉద్దేశాలతో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

నష్టం ఎవరు భరించాలి..?

రాజకీయ లక్ష్యాలతో పని చేసిన నిమ్మగడ్డ.. చివరకు ఏమి సాధించారంటే ఆయన కూడా చెప్పలేని పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేసిన నిమ్మగడ్డ.. ఆ తర్వాత కూడా ప్రభుత్వంతో ఘర్షణ కోరుకున్నారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిళ్లింది. గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే లాయర్లను పెట్టుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వారికి కోట్ల రూపాయలు ఫీజులు ఎక్కడ నుంచి చెల్లించారు..? ప్రారంభంలో ఎన్నికలు జరగకుండా ఉండేందుకు, ఆ తర్వాత పదవి కాపాడుకునేందుకు, మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు.. ఇలా దాదాపు పది నెలలుగా ఆయన పోరాటం అంతా న్యాయస్థానాల్లోనే సాగింది. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని లాయర్లకు ఫీజులు రూపంలో చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. చివరకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన స్థితిని తెచ్చుకున్నారు.

అదొక్కటే మార్గం…

కోర్టు మొట్టికాయలు వేసినా కూడా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన వైఖరిని మాత్రం మార్చుకోకపోవడం ఆయన వ్యవహార శైలి ఏమిటో తెలుపుతోంది. హైకోర్టు తీర్పుపై డివిజనల్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తామని నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ఆయన లక్ష్యాలను చెప్పకనే చెబుతోంది. మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ.. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే శేషజీవితం ప్రశాంతంగా గడపొచ్చు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో చేసిన పొరపాట్లను దిద్దుకునే అవకాశం ఆయనకు లభించింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని.. ప్రజా స్వామ్యానికి, ప్రజలకు జరిగిన నష్టానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడం ద్వారా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు తాను మొదలు పెట్టిన వివాదానికి తానే ముగింపు పలికాననే సంతృపై్తనా దక్కుతుందని చెప్పవచ్చు.