iDreamPost
android-app
ios-app

ఇప్పుడేమంటారో నిమ్మగడ్డ, కరోనా వైరస్ కొత్తరూపుతో కలకలం రేపుతున్న తీరు కనిపిస్తోందా

  • Published Dec 22, 2020 | 3:17 PM Updated Updated Dec 22, 2020 | 3:17 PM
ఇప్పుడేమంటారో నిమ్మగడ్డ, కరోనా వైరస్ కొత్తరూపుతో కలకలం రేపుతున్న తీరు కనిపిస్తోందా

ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో ఈ ఏడాది మార్చిలోనే నిర్వహించాలని ప్రభుత్వం పట్టుబట్టింది. కరోనా సమస్య దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి అప్పటి వరకూ ఎన్నికలు వాయిదా వేయడం శ్రేయస్కరం కాదని ఆరోజే సీఎం స్పష్టంగా చెప్పారు కేసులు లేని సమయంలో కరోనా పేరు చెప్పి కాలయాపన సరికాదని సూటిగా చెప్పారు. అయినా గానీ నాడు ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల సంఘం ఇటీవల తయారుకావడం విశేషంగానే చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ గురించి ప్రపంచమంతా కలత చెందుతున్న సమయంలో ఎన్నికల కోసం ఉత్సాహం చూపుతున్న తీరుని ప్రభుత్వం తప్పుబట్టింది. తాము ఎన్నికలు నిర్వహించాలన్న నాడు సమాచారం కూడా లేకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసి, ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి భద్రత లేని సమయంలో ఎన్నికలకు సిద్ధంకావడం సరికాదని తేల్చేసింది. దానికి తగ్గట్టుగా ఏపీ అసెంబ్లీలో కూడా తీర్మానం ఆమోదించింది.

అయినప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హయంలోనే ఎన్నికలు జరపాలనే పట్టుదలతో సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా స్థానిక ఎన్నికలు జరిపి తీరుతామంటున్నారు. దానికి తగ్గట్టుగా పదే పదే కోర్టుల్లో కేసులు వేసేందుకు సైతం వెనకాడడం లేదు. ప్రతీసారి ప్రభుత్వాన్ని సవాల్ చేయడమే తప్ప సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. సామాన్యుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే దానిని కూడా ధిక్కరించాలనే సంకల్పంతో ఆయన ఉన్నట్టుగా స్పష్టమవుతోంది.

తాజాగా ప్రపంచం మరోసారి కరోనాతో వణికిపోతోంది. కొరొనా కొత్తరకం వైరస్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అనేక చోట్ల మళ్లీ లాక్ డౌన్ అనివార్యం అవుతోంది. మనదేశంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చింది. తాజాగా యూకే నుంచి చెన్నై వచ్చిన ఓ వ్యక్తిలో కొత్త కరోనా స్ట్రెయిన్ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో అంతా అప్రమత్తమయ్యారు. కొత్తరకం వైరస్ పై కేంద్రవైద్య శాఖ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఎయిర్ పోర్ట్ లలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గడిచిన నెల రోజుల్లో యూకే, యూరప్ నుంచి వచ్చిన ప్రయాణీలకుల వివరాలు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ అప్రమత్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రెగులర్ వైరస్ 30శాతం ఉంటే కొత్త వైరస్ 70శాతం తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అది యూరప్, ఆస్ట్రేలియా, సౌదీ లో వ్యాపించి ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. .న్యూ వేరియంట్ వైరస్ కేసులు ఇప్పటి వరకూ తెలుగు నేల మీద నమోదుకానప్పటికీ ఓ వైపు చలి తీవ్రత, మరోవైపు వరుస పండుగల నేపథ్యంలో అంతా జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం దానికి అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు పెరుగుతన్న ప్రమాదానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన నిమ్మగడ్డ తద్విరుద్ధంగా తన రాజకీయ లక్ష్యాల సాధనలో ఏకపక్షంగా సాగుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఏడాది మార్చితో తన పదవీకాలం ముగుస్తున్న తరుణంలో తన మాటే చెల్లుబాటు కావాలనే పట్టుదలతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఆలోచన సరికాదని పలువురు సూచిస్తున్నారు. కరోనా అనేది ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ ఏక్షణంలోనయినా దాని ప్రభావం చూపే ఆస్కారం ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుచేయాల్సిన అవసరముందునే వాదన బలపడుతోంది.