iDreamPost
iDreamPost
భారీ అంచనాలు మోసుకొచ్చిన సంక్రాంతి బాక్సాఫీస్ పండగ కొలిక్కి వస్తోంది. సెలవులు పూర్తవుతున్నాయి కాబట్టి జనాలు ఇక రొటీన్ లైఫ్ లోకి వెళ్లిపోతున్నారు. విపరీతమైన పోటీ, పలు ఆసక్తికరమైన పరిణామాల మధ్య జనవరి టాలీవుడ్ విన్నర్ గా వాల్తేరు వీరయ్య సగర్వంగా జెండా ఎగరేసింది. వసూళ్లు ఇప్పటికే నూటా ఇరవై కోట్లకు దగ్గరగా ఉండగా యుఎస్ లో మొదటి వారం పూర్తి కాకుండా 2 మిలియన్ మార్క్ ఘనత స్వంతం చేసుకోనుంది. హంగామాతో వచ్చిన వీరసింహారెడ్డి ఎంత ప్రయత్నించినా అగ్ర స్థానాన్ని దక్కించుకోలేదు. వంద కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్లు వేశారు కానీ ఆ ఫిగర్ల మీద ట్రేడ్ లోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
ఈ సందర్భంగా పండగ నేర్పించిన కొన్ని విలువైన పాఠాలు చూద్దాం. మొదటిది ఏ కాలంలో అయినా జనవరి నెలలో మాస్ సినిమాలకు దక్కే ఆదరణ మిగిలినవాటికి ఉండదు. అందులోనూ స్టార్ హీరోలు ఉండి కంటెంట్ ని యావరేజ్ అయినా సరే టార్గెట్ చేసిన వర్గాలకు నచ్చేలా తీస్తే చాలు కనక వర్షం ఖాయం. మెగా మూవీ ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతి ఏడాది ఇది ఋజువవుతూనే ఉంది. రెండోది క్లాస్ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో దించకూడదు. అవుట్ ఫుట్ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తే ముందుగా దెబ్బ తినేది హీరో దర్శకుడే. కళ్యాణం కమనీయం విషయంలో జరిగింది ఇదే. లో బడ్జెట్ వల్ల నిర్మాతలు మాత్రమే సేఫ్ అయ్యారు
మూడోది బజ్ లేని డబ్బింగ్ సినిమాలను ముందుగా తీసుకొస్తే కమర్షియల్ ఎడ్జ్ తీసుకుని తెగింపు లాగా బయట పడొచ్చు. చాలా తక్కువ బిజినెస్ ప్లస్ అయ్యింది. నాలుగోది అతి పబ్లిసిటీతో లేని హైప్ ని సృష్టించినంత మాత్రాన ఆడియన్స్ అంత అమాయకంగా ఎగబడి చూడరు. వీరసింహారెడ్డి ఓపెనింగ్స్ కోసం జరిగిన హడావిడి అందరూ గమనించారు. అయిదోది ఎంత అనువాద చిత్రమైనా సరే రిస్క్ తీసుకుని పోటీకి ఎదురీదితే రొటీన్ బొమ్మ అయినా సరే ఎంతో కొంత డీసెంట్ గా వర్కౌట్ చేసుకోవచ్చని వారసుడు కలెక్షన్లు చెప్పాయి. మొత్తానికి అన్ని రకాల మిశ్రమాలతో వచ్చిన 2023 సంక్రాంతి సినిమా కొత్త సంవత్సరాన్ని చక్కగా ప్రారంభించడం శుభ పరిణామం