Idream media
Idream media
కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, వినియోగం విషయంలో నెలకొన్న వివాదం నుంచి తెలంగాణ సర్కార్ ఏం ఆశిస్తోంది..? వివాదం పరిష్కారం దిశగా ఆ రాష్ట్రం చర్యలు చేపడుతోందా..? లేదా..?.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏడేళ్లకు ఇటీవల రెండు నదుల యాజమాన్య మండళ్ల పరిధులను నిర్ణయిస్తూ కేంద్రం గత నెల 15వ తేదీన గెజిట్ జారీ చేసింది. మూడు నెలల్లోపు Vð జిట్లు అమల్లోకి రావాలి.
ఈ నేపథ్యంలో గెజిట్ల అమలుపై ఈ నెల 3వ తేదీన ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల సమావేశానికి తెలంగాణ హాజరుకాలేదు. గెజిట్ నోటిఫికేషన్లలోని అంశాల అమలుపై చర్చించేందుకు ఈ రోజు నిర్వహించతలపెట్టిన బోర్డుల సమావేశానికి తెలంగాణ హాజరుకాబోమని తెలిపింది. ఈ రోజు కృష్ణా జలాల వివాదంపై సుప్రిం కోర్టులో విచారణ ఉందని, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కోర్టు ధికార్కం కింద ఎన్టీటీలో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వస్తోన్న కారణంగా హాజరుకాలేకపోతున్నామని తెలిపింది. మరో రోజు సమావేశం ఏర్పాటు చేస్తే హాజరవుతామని పేర్కొంది. ఈ తరహాలో బోర్డుల భేటీకి తెలంగాణ డుమ్మా కొడుతుండడంతోనే కేసీఆర్ సర్కార్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివాదం కావాలనుకుంటుందా..?
తెలంగాణ తీరు చూస్తుంటే ఏపీతో వివాదం కావాలని కోరుకుంటున్నట్లుగా ఉందనే అనుమానాలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజీలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ వివాదాన్ని రేపింది. ఏపీ వినతిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా.. శ్రీశైలంతోపాటు, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోనూ విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువకు నీరు వదిలిపెట్టింది. ఆ జలాలు వృథాగా సముద్రంలో కలిసాయి. నిబంధనలకు విరుద్ధమని చెబుతూ.. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని కేంద్ర జలశక్తి ఆదేశించినా.. పెడచెవిన పెడుతోంది. పైగా విద్యుత్ ఉత్పత్తి చేయడం తెలంగాణ హక్కు అంటూ వాదిస్తోంది. తద్వారా తెలంగాణ ప్రజల అటెన్షన్‌ను అధికార పార్టీ తనవైపునకు తిప్పుకుంటోంది.
అనధికారిక ప్రాజెక్టుల వివాదం…
గోదావరి, కృష్ణా నదులపై రెండు తెలుగు రాష్ట్రాలు అనధికారికంగా అనేక ప్రాజెక్టులు నిర్మించాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా ప్రాజెక్టులు ఏవి అనే విషయం గెజిట్ నోటిఫికేషన్లలో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఆ జాబితాలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాలమూరు – రంగారెడ్డి సహా దిండి ఎత్తిపోతల పథకాలు, తెలంగాణ ఫిర్యాదు చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది. అనుమతిలేకుండా నిర్మించిన, నిర్మిస్తోన్న, ప్రతిపాదన దశలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు గెజిట్ నోటిపికేషన్ విడుదల చేసిన ఆరు నెలల్లోపు అనుమతులు తీసుకోవాలని కేంద్రం గెజిట్లలో స్పష్టం చేసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)లకే అన్ని పత్రాలు అందించి అనుమతులు పొందాలని పేర్కొంది. కృష్ణా, గోదావరి జలాలు ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు అనేది ఆది నుంచి ఉన్న దామాషా పద్ధతిన గెజిట్లలో పొందుపరిచింది.
ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తాము అనధికారికంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవడం, ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించుకునే అవకాశం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ జారీ చేసిన గెజిట్ల ద్వారా అందుబాటులోకి వచ్చింది. జనవరి 16వ తేదీ లోపు అనధికారిక ప్రాజెక్టులకు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకుంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరికి కేటాయించిన జలాలను వారు వినియోగించుకోవచ్చు. రెండు బోర్డులు అన్ని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ చేస్తాయి కాబట్టి వివాదమే రాదు.
కానీ తెలంగాణ మాత్రం ఈ దిశగా ఆలోచన చేయడం లేదు. పూర్వం నుంచి కోస్తా, సీమ, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉన్న కృష్ణా నదీ జలాల పంపిణీ వాటాను కాదని, తమకు సగం వాటాను కేటాయించాలని తెలంగాణ అడ్డగోలుగా వాదిస్తోంది. పైగా ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేస్తోంది. వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఈ తరహాలో తెలంగాణ వ్యవహరిస్తుండడంతోనే కేసీఆర్ సర్కార్ తెరవెనుక లక్ష్యాలతో పని చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఉద్యోగ నోటిపికేషన్లు విడుదల చేయకపోవడం సహా అనేక అంశాలు కేసీఆర్ సర్కార్‌ను ఇరుకునపెడుతున్నాయి. ప్రతిపక్షాలు దూకుడుగా రాజకీయాలు చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన పార్టీలు టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తమను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు గులాబీ దళం జల వివాదాన్ని వాడుకుంటోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : జగన్ విషయంలో విపక్షాల సందిగ్ధతకు అసలు కారణమదే