Idream media
Idream media
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాజీనామా విషయంలో యడ్యూరప్ప ప్రకటన, ఆయన అనుచరులు వాదన భిన్నంగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను స్వఛ్చందంగానే రాజీనామా చేస్తున్నట్లు యడ్యూరప్ప చెప్పగా.. ఆయన అనుచరులు మాత్రం బలవంతంగా రాజీనామా చేయించారని అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు. కర్ణాటక బీజేపీలో రాబోయే రోజుల్లో యడ్డీ ఎలాంటి ప్రాత పోషిస్తారో ఈ పరిణామాలు ద్వారా తేటతెల్లం అవుతోంది.
ధన్యవాదాలు చెప్పిన యడ్డీ..
బీజేపీలో ఎవరికి దక్కని అదృష్టం తనకు దక్కిందని యడ్డీ చెప్పుకొచ్చారు. 75 ఏళ్లు దాటిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరాదనే నియమం మోదీ–అమిత్‌షా ద్వయం వచ్చాక తెచ్చారు. యడ్డీ వయస్సు 76 ఏళ్లు అయినా ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన యడ్డీ.. మోదీ, అమిత్‌షాలకు ధన్యావాదాలు చెప్పారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే తాను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
Also Read : యడ్డీ వారసుడు ఎవరో? బీజేపీ పరిశీలనలో 8 పేర్లు
బలవంతంగా తప్పించారంటున్న అనుచరులు..
తనపై ఎవరి ఒత్తిడి లేదని యడ్డీ చెబుతుంటే.. ఆయన అనుచరులు మాత్రం బలవంతంగా దించేశారని ఫైర్ అవుతున్నారు. బలమైన లింగాయత్ నాయకుడు చేత రాజీనామా చేయించారని యడ్డీ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. దుకాణాలు మూయించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యడ్డీకి అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
యడ్డీకి తెలియకుండానే అనుచరులు ఇలా పార్టీకి, పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారా..? అనేది ప్రధాన్న ప్రశ్న. అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తాను ఆ పని చేస్తానని యడ్డీ ఈ నెల 21వ తేదీన ట్విట్ చేశారు. తన అభిమానులు, అనుచరులు కూడా క్రమశిక్షణతో ఉండాలని చెబుతూ.. ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదని హితబోద చేశారు. అయినా యడ్డీ అనుచరులు షికారిపుర నియోజకవర్గంలో దుకాణాలు మూయించి, పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విశేషం.
ఇకపై కూడా తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉత్సాహంగా పని చేస్తానని, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తానని రాజీనామా చేసిన తర్వాత యడ్డీ చెప్పారు. గవర్నర్‌పదవిపై ఆసక్తిలేదని, ఆ పదవి ఇస్తానన్నా తీసుకోబోనని యడ్డీ తేల్చిచెప్పడంతో.. ఆయన కర్ణాకట రాజకీయాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని అర్థమైంది. గతంలో సీఎం పదవి నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన యడ్డీ.. పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఈ సారి అలాంటి పరిణామాలు ఏమీ లేకపోయినా.. అయన అనుచరులు మాత్రం భగ్గుమనడం రాబోయే రోజుల్లో యడ్డీ ఎలాంటి రాజకీయాలు చేస్తారనే ఆసక్తి నెలకొంది.
Also Read : అప్పుడు, ఇప్పుడు మధ్యలోనే ఇన్నింగ్స్‌ను ముగించిన యడ్యూరప్ప..!