iDreamPost
iDreamPost
సినిమా నటులకు రాజకీయాలపై కాస్త మక్కువ ఎక్కువే. దక్షిణాదిన ఆ మక్కువ ఇంకా ఎక్కువ అనే చెప్పాలి. ఈ మోజుతోనే సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం ప్రణాళిక సిద్ధం చేశారు. వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలని ఆయనకు ఉందో లేక అభిమానులు వత్తిడి చేశారో తెలియదు కానీ, ఈ నెలాఖరున అధికారికంగా ప్రకటన చేయాలనీ, జనవరిలో పార్టీ పేరు ప్రకటించాలని అనుకున్నారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ మరియు ఎన్నికల గుర్తు వంటి విషయాలతో ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా ఈ వారంలో హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురికావడం, ఆస్పత్రిలో చేరడంతో ప్రణాళిక రివర్స్ అయింది. తన రాజకీయ ప్రవేశం లేదు అంటూ అయన ఓ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సినిమారంగం రాజకీయ రంగం ఎలా ఉన్నాయో అవలోకనం చేసుకోవడం అవసరం.
తమిళనాడులో అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే ప్రయోగం ఈ మోజుకు కారణం కావచ్చు. స్వతహాగా రచయిత అయిన అన్నాదురై, సోషలిస్టు భావాలు కలిగిన పెరియార్ ఇ వి రామస్వామి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన పార్టీ డీఎంకే. అన్నాదురై నేతృత్వంలో ఆ పార్టీ తమిళనాడులో 1960వ దశాబ్దంలోనే అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత సినిమా రంగంనుండే వచ్చిన కరుణానిధి, ఎంజిఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఇద్దరూ విడిపోయిన తర్వాత ఎంజీఆర్ సొంతగా ఏఐఏడీఎంకే పేరుతో కొత్తపార్టీ పెట్టుకున్నా తమిళ ప్రజలు ఇద్దర్నీ ఆదరించారు. ఎంజీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత కూడా ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే ఈ ప్రయోగం ఆ తర్వాత మిగతా సినీరంగ ప్రముఖులు చేసిన ప్రయత్నాలకు విజయం అందించలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ 1980 దశకంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో సంచలన విజయం సాధించారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే పార్టీని అధికారంలోకి తెచ్చారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్సేతర పార్టీలను ఏకం చేసి కేంద్రంలో కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో కీలకపాత్రపోషించిన నేషనల్ ఫ్రంట్ కు చైర్మన్ గా పనిచేశారు. అయితే దశాబ్దం తిరక్కముందే రాజకీయ చదరంగంలో తన పార్టీని, పదవిని కోల్పోయారు.
ఇక ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమా రంగంలో అంత ప్రజాదరణ కలిగిన మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేస్తున్నామన్న భావన తన అభిమానుల్లో కల్పించారు. చిరంజీవితో పాటు ఆయన సోదరులిద్దరూ, బావ అల్లు అరవింద్, ఇతర సినిమా రంగ ప్రముఖులు తీవ్రంగా కృషి చేశారు. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. చిరంజీవి పార్టీ 18 అసెంబ్లీ స్థానాల్లో గెలవగా, రెండు స్థానాల్లో పోటీచేసిన చిరంజీవి ఒక్కచోటే గెలిచి రెండో స్థానంలో ఓటమి చెందారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, తాను కేంద్రంలో మంత్రి అయ్యారు. పదవీకాలం పూర్తికాగానే ఇంచుమించుగా రాజకీయాలనుండి విరమించుకున్నారు.
కాగా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ముందు జనసేన పేరుతో మరో కొత్త రాజకీయపార్టీ స్థాపించారు. అయితే ఆయన కానీ, ఆయన పార్టీ కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేంద్రంలో మోడీ నాయకత్వాన్ని, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చి వారి విజయానికి దోహదపడ్డారు. ఆ తర్వాత మోడీ, చంద్రబాబు నాయకత్వాలు కాస్త దూరం జరిగి 2019 ఎన్నికల్లో వామపక్షాలతో, బీఎస్పీ తో కలిసి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో జనసేన ఒక స్థానం గెలుచుకోగా, వామపక్షాలు కానీ, బీఎస్పీ కానీ ఎక్కడా విజయం సాధించలేదు. రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పొందారు.
ఇక తమిళనాడు రాజకీయాల విషయానికొస్తే 2005లో విజయకాంత్ దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన పెద్దగా విజయం సాధించలేకపోయారు. ఇటీవలే రాజకీయ పార్టీ స్థాపించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా గొప్ప విజయం సాధించే అవకాశాలు కనిపించడం లేదు. నటులుగా వారికున్న పేరు ప్రఖ్యాతులు, అభిమానులు వారి రాజకీయ నాయకత్వానికి ఉపయోగపడడం లేదు.
సినిమాల్లో విజయం సాధించి కోట్లాదిమంది అభిమానుల్ని గెలుచుకున్న హీరోలు రాజకీయాల్లో జీరోలుగా మిగిలిపోతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. సినిమాల్లో లాగా రాజకీయాల్లో స్క్రిప్ట్ ఉండదు. డాన్స్ స్టెప్పులు దశలవారీగా నేర్పించే మాస్టర్లు ఉండరు. చప్పట్లు కొట్టి, ఈలలు వేయించే డైలాగులు ఉండవు. ఉపన్యాసాలు రాయించుకున్నా సినిమాల్లో డైలాగుల్లా చప్పట్లు కొట్టించుకునే డైలాగులు రోజువారీ రాజకీయ వేదికపై కుదరదు. వీటన్నిటికీ తోడు రాజకీయాల్లో ప్రజల అవసరాలు, ఆశలు, అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. సినిమాల్లో హీరోదే అగ్రస్థానం. హీరో మాటకు అడ్డుచెప్పేవారు ఉండరు. కానీ రాజకీయాల్లో అలా కాదు. ప్రత్యర్థులతో పాటు సహచరుల ఎత్తులు, జిత్తులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇందుకు ముందుగానే సిద్ధం చేసుకున్న స్క్రిప్టు ఉండదు.
సినిమాల్లో కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో, ప్రత్యర్ధులు ఎలాంటి ఎత్తులు వేస్తారో, తాను ఎలాంటి పైఎత్తులు వేయాలో ముందుగానే స్క్రిప్టు సిద్ధంగా ఉంటుంది. పైగా ఎప్పటికప్పుడు హావభావాలతో సహా ఎలా స్పందించాలో నేర్పించేందుకు దర్శకుడు ఉంటాడు. రాజకీయంలో ఇవేవి ఉండవు. కథ, కథనం స్థిరంగా ఉండవు. నిరంతరం మారుతూ ఉంటాయి. అలాగే పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. పరిస్థితులు, ప్రభావిత అంశాలు, ప్రత్యర్ధులు, సహచరులు, కార్యకర్తలు, ప్రజలు… ఇలా అనేక అంశాలు రాజకీయంలో నేతకు ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తాయి. వాటిని తట్టుకోగలిగితే సినిమాల్లాగే రాజకీయాల్లో కూడా విజయం సాధించవచ్చు. ఈ కిటుకు తెలుసు కనుకే అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత రాజకీయాల్లో విజయం సాధించారు. ఈ కిటుకు తెలియకే ఎన్టీఆర్ వెన్నుపోటుకు బలయ్యారు. చిరంజీవి విఫలం అయ్యారు. ఇతరులు విజయం సాధించలేకపోయారు. బహుశా ఇవన్నీ బేరీజు వేసుకోవడం వల్లనో లేక ఆరోగ్యపరిస్థితుల కారణంగానో రజనీకాంత్ ముందస్తుగానే అపప్రమత్తం అయ్యారు. రాజకీయ ప్రవేశం విరమించుకున్నారు