iDreamPost
iDreamPost
ఆచార్య డిజాస్టర్ ని పూర్తిగా మర్చిపోయే స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యిందని గాడ్ ఫాదర్ గురించి సంబరపడుతున్న అభిమానులకు సోమవారం నుంచి డ్రాప్ అయిన కలెక్షన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ముందు నుంచి ప్రచారమైన నేపథ్యంలో ఇప్పటిదాకా వచ్చింది అరవై కోట్లలోపే కావడంతో బ్రేక్ ఈవెన్ ఇంకా చాలా దూరంలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎన్వి ప్రసాద్ చెప్పిన విషయాలు కొత్త చర్చకు దారి తీశాయి. తాము ఎవరికీ అమ్మలేదని, స్వంతంగా రిలీజ్ చేసుకున్నామని, వసూళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని, యుఎస్ లోనూ రెండు మిలియన్ వైపు పరుగులు పెడుతోందని చెప్పారు.
నిజానికీ మాట విడుదలకు ముందే చెప్పి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఆయనన్న మాట అబద్దం కాదు కానీ వసూళ్లు తగ్గాకే ఈ క్లారిటీ ఇవ్వడంతో కొత్త చర్చకు ఆస్కారం ఇచ్చినట్టు అయ్యింది. బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోయినా ఆక్యుపెన్సీ తగ్గిపోవడం ఆలోచించాల్సిన విషయమే. దీనికి బూస్ట్ ఇచ్చే ఉద్దేశంతోనే చాలా కీలకమైన తార్ మార్ తక్కర్ మార్ వీడియో సాంగ్ వారం తిరక్కుండానే యుట్యూబ్ లో పెట్టేశారు. హిందీ వెర్షన్ కూడా నెమ్మదిగా ఉండటంతో ఈ తరహా స్ట్రాటజీలు తప్పడం లేదు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ క్యామియో మరీ ఆశించిన స్థాయిలో నార్త్ ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ కలిగించలేదన్నది వాస్తవం.
మొత్తానికి గాడ్ ఫాదర్ కమర్షియల్ హిట్టా కాదా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. వాస్తవానికి 50 కోట్ల షేర్ అంటే చిన్న మొత్తం కాదు. కొందరు హీరోలకు అది కెరీర్ హయ్యెస్ట్ ఫిగర్. అయినప్పటికీ ఇంత సందిగ్దత నెలకొనడానికి కారణం ప్రీ రిలీజ్ ముందు టైంలో బయటికి వచ్చిన బిజినెస్ ఫిగర్స్. ఇంకో నలభై కోట్లు రావడమంటే మాటలు కాదు. కెజిఎఫ్ రేంజ్ లో టాక్ ఉండాలి, రెండు వారాలు కనీసం ఆ స్థాయిలో రన్ సాగించాలి. కానీ గాడ్ ఫాదర్ అంత స్థాయికి వెళ్లే అవకాశం లేదు. ప్రసాద్ గారేమో బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు కానీ ఇంకో రెండు వారాలు ఆగితే ఫైనల్ రన్ కు వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఈ ఇష్యూ కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.