iDreamPost
android-app
ios-app

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్.. ఎవరెవరు ఏమన్నారంటే..?

అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ తీవ్రంగా ఖండిస్తున్నారు. స్టార్స్ అంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ తీవ్రంగా ఖండిస్తున్నారు. స్టార్స్ అంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్.. ఎవరెవరు ఏమన్నారంటే..?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సినిమా వాళ్ల జీవితాలతో ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. రేవ్ పార్టీలు నిర్వహించి, వాళ్లను డ్రగ్ కేసులో ఇరికించి, ఆయన మాత్రం తప్పుకున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంత మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుండి తప్పుకోవడానికి కేటీఆరే కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. రాజకీయాల్లోకి సినిమా వాళ్లను లాగొద్దని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దం, అసంబద్దం, ఈ కామెంట్స్ వెనక్కు తీసుకోవాలని అక్కినేని నాగార్జున, నాగచైతన్యతో పాటు సమంత కూడా డిమాండ్ చేశారు.

కేవలం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడుతోంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, నాని, అల్లుఅర్జున్ ప్రకాష్ రాజ్, రామ్ గోపాల్ వర్మ, రోజా ఇలా సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కినేని ఫ్యామిలీకి మద్దతుగా నిలుస్తుంది. ‘సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలపై మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి మాటల దాడులను చిత్ర పరిశ్రమ ఏకతాటిపై వ్యతిరేకిస్తుంది. సంబంధం లేని వ్యక్తులను, అంతకు మించి మహిళలను రాజకీయాల్లోకి తీసుకు రావడం సరైన చర్య కాదు. మెరుగైన సమాజం కోసం నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. కానీ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి కలుషితం చేయొద్దు’ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ లబ్ది కోసం పర్సనల్ విషయాలను ఆయుధంగా మార్చడం బాధాకరం.. దురదృష్టకరం. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలని కోరుతున్నా’ అంటూ వెంకటేశ్ పోస్టును పంచుకున్నారు.

కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తారక్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. పబ్లిక్ ఫిగర్స్, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు తప్పనిసరిగా గోపత్యను గౌరవించాలి. ఇతరులు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా కూర్చోలేం’ అంటూ తారక్ ట్వీట్ చేశారు. న్యాచురల్ స్టార్ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు ‘రాజకీయ నాయకులు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చునని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుంది. మీ మాటలు చాలా బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పుడు.. ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకోవడం మా తెలివి తక్కువ పని. గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా బేస్ లెస్ మాటలు మాట్లాడటం సరైంది కాదు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు న్యాచురల్ స్టార్.

‘సినీ ప్రముఖులు, కుటుంబాలపై నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా మరియు మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను యాక్సెస్ట్ చేయకూడదు. మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వ్యక్తిగత గోప్యత గౌరవించాలని కోరుకుంటున్నా’ అంటూ అల్లు అర్జున్ నోట్ పంచుకున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో మండిపడ్డారు. ‘నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్‌గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి’ అంటూ ట్వీట్స్ చేశారు.

అక్కినేని కుటుంబం, సమంతపై చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అన్నారు రోజా. తోటి మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మనస్సు ఎలా అంగీకరించిందని, మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గమని, ఆ పని మహిళే చేయటం మరింత బాధిస్తోందన్నారు. ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు అంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.