iDreamPost
android-app
ios-app

కోవిడ్‌పై టీడీపీకి క్లారిటీ లేదా..?

కోవిడ్‌పై టీడీపీకి క్లారిటీ లేదా..?

దేశంలోనే తానే సీనియర్‌ నాయకుడునని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. ఒక రాష్ట్రంలో తన పార్టీని నడిపించలేని స్థితికి చంద్రబాబు దిగజారిపోయారనే భావన ఇటీవల కాలంలో ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది. నేతలకు, క్యాడర్‌కు సరైన దిశా నిర్ధేశం లేకపోడం, ఒకే అంశంపై అధినేత ఒకలా.. నేతలు మరోలా ప్రకటనలు చేయడంతోనే చంద్రబాబు నాయకత్వంపై అనేక సందేహాలు వస్తున్నాయి.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా. కరోనా వైరస్‌ కట్టడికి అభివృద్ధి చెందిన దేశాలు, తక్కువ జనాభా గలిగిన అభివృద్ధి చెందిన దేశాలైన ఇటలీ, జర్మనీ వంటి దేశాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఇలాంటి మహమ్మారితో మానవాళి పోరాడుతోంది. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి మందు కనుగొనలేదు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. భారత్‌ వంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో అందరికీ వ్యాక్సిన్‌ ఎప్పటికి అందుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు వైరస్‌ కట్టడికి శాయశక్తులా పని చేస్తున్నాయి. ప్రజలకు ప్రభుత్వ అధినేతలు భరోసా కల్పించేలా ప్రకటనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ సర్కార్‌.. కోవిడ్‌ సహాయక చర్యల్లో ముందుంది. దేశం మొత్తం మీద కరోనాకు ఉత్తమమైన చికిత్స, ప్రజలకు భరోసా కల్పిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఏపీలో ఉంటే సేఫ్‌గా ఉంటాం.. చికిత్స అందుతుంది.. అనే భావన దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉద్యోగ, వ్యాపార రీత్యా ఉంటున్న ఏపీ వాసుల్లో నెలకొంది.

అయితే ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు కోవిడ్‌ అంశంపై భిన్న ప్రకటనలు చేస్తూ తమలో తామే గందరగోళానికి గురవుతున్నారు. స్పష్టమైన విధానంతో కాకుండా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు తమకు తోచిన విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు లక్షల రూపాయల బిల్లులు వేస్తూ సామాన్యులను దోచుకోవడాన్ని ప్రభుత్వం నిలువరించాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని చంద్రబాబు వ్యతిరేకించారనుకోవాలి.

Also Read : లోకేష్ ఇక పరామర్శలకే పరిమితమా?

అదే సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులు మాత్రం కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు ఇవ్వాలంటూ మాట్లాడుతున్నారు. పైగా పైవేటు ఆస్పత్రులకు ఇస్తే.. జగన్‌కు ఎందుకు ఏడుపు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ ఇస్తే.. బ్లాక్‌ మార్కెట్‌ పెరుగుతుందని, ధరలు భారీగా ఉంటాయని సీఎం జగన్‌ ప్రధానికి రాసిన లేఖపై టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ విమర్శలను ఎక్కుపెట్టారు. వీరి ప్రకటనలు చూస్తే.. ప్రైవేటు ఆస్పత్రులను ప్రొత్సహిస్తున్నట్లుంది.

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ అనే విధానంతో జగన్‌ సర్కార్‌ కోవిడ్‌పై పోరాటం చేస్తోంది. గరీష్టంగా పరీక్షలు చేస్తూ.. ఉచితంగా వైద్యం అదిస్తోంది. ఆరోగ్యశ్రీలోనూ కోవిడ్‌కు చేర్చింది. ప్రతి రోజు లక్షకు పైగా పరీక్షలు జరుపుతూ.. పాజిటివ్‌ వచ్చిన వారిని ఆస్పత్రులకు తరలించడం, హోం ఐసోలేషన్‌లో ఉంటే అవసరమైన మందులు, వైద్యుల సలహాలు, నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. అందుకే ఏపీలో మరణాలు తక్కువగా ఉన్నాయి. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్పిత్తిలో 50 శాతం వ్యాక్సిన్‌లు ప్రైవేటు ఇచ్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదని, పునరాలోచన చేయాలని దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా.. ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు.

జగన్‌ ఆందళన వ్యక్తం చేసిన విధంగానే.. వ్యాక్సిన్‌ బ్లాక్‌ మార్కెట్‌ మొదలైంది. అనంతపురం, గుంటూరు, నరసారావుపేట తదితర ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న వ్యక్తులను అధికారులు అరెస్ట్‌ చేశారు. వారందరూ ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, ఫార్మాసిస్టులు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు ఇవ్వాలనేలా ప్రకటనలు చేస్తున్నారు. మరి వీరందరూ తమ పార్టీ అధినేతకు చెప్పే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా..? అంటే చంద్రబాబే ఈ విషయం గురించి చెప్పాలి.

Also Read : హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి భార్య భూ బాగోతం