iDreamPost
android-app
ios-app

టమోటాలను రోడ్డు పక్కన పడేసే పరిస్థితులు ఎన్నాళ్లు..? పరిష్కారం లేదా..?

టమోటాలను రోడ్డు పక్కన పడేసే పరిస్థితులు ఎన్నాళ్లు..? పరిష్కారం లేదా..?

కూలి ఖర్చులు కూడా రావని టమోటాను తోటల్లోనే వదిలేసిన రైతు.. రవాణా ఖర్చులుకు కూడా రాక పంటను రోడ్డు పక్కన పడేసిన రైతు.. పతనమైన టమోటా ధరలు.. కిలో 50 పైసలు పలికిన కిలో టమోటా.. ఇవీ ప్రతి ఏడాది కొన్ని రోజులపాటు వినిపించే మాటలు. టమోటా పంటను పండించే రైతు దుస్థితికి ఇవి అద్దం పడుతున్నాయి. రైతు పరిస్థితి ఇలా ఉంటే.. అదే సమయంలో వినియోగదారుడు కిలో టమోటా 15 నుంచి 25 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అసలు టమోటా రైతుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లేదా..?

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టమోటా పండినా అధికంగా పండేది మాత్రం రాయలసీమ ప్రాంతంలోనే. చిత్తూరు జిల్లా మదనపల్లె, అనంతపురం జిల్లా కదిరి, పుట్టపర్తి, కర్నూలు జిల్లా ఆదోని, ఎమ్మిగనూరు, కడప జిల్లా రాయచోటి, పులివెందుల ప్రాంతాల్లో టమోటాను వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ చేయలేనిది, పచ్చి సరుకు అయినా రైతులు ఈ పంటను సాగు చేయడానికి మొగ్గు చూపడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. 90 రోజుల్లోనే పంట చేతికి రావడం, విత్తనాలు, డ్రిప్, కూలీలు ఖర్చు అంతా ఎకరానికి 50 వేల రూపాయిలు ఉండడం, టైం బాగుండి మార్కెట్‌లో ధర ఉంటే కాసులు కురిపిస్తుందనే ఆశ.. ఇవన్నీ రైతలను టమోటా సాగు వైపు నడిపిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో టమోటా ధర పది రూపాయలు ఉంటే.. ఎకరాలకు ఖర్చులు పోను దాదాపు రెండు లక్షల రూపాయల ఆదాయం మూడు నెలల్లోనే వస్తుంది. పంట దండిగా ఉన్నప్పుడు ధర ఉండదు.. పంట లేనప్పుడు ధర ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది షేర్‌మార్కెట్‌ లాంటిదే.

Also Read : సంక్షేమ పథకాలతో లక్ష కోట్లు.. అదే వారయ్యుంటే 30 వేల కోట్లు కమీషన్లకే.. సజ్జల పోలిక అదిరింది

ఇతర కూరగాయలదో టమోటాను పోల్చలేం. ఇది ప్రత్యేకమైనది. పేద, ధనిక బేధం లేకుండా ప్రతి ఒక్కరూ వినియోగిస్తారు. మార్కెట్‌కు వెళ్లిన వారు టమోటాల ఒక ఎత్తు అయితే.. టమోటాది మరో ఎత్తు. దీని వినియోగం ఎక్కువే. ప్రతి వంటింట్లోనూ టమోటా ఉండాల్సిందే. ఇంతటి నిత్యవసరమైన టమోటాకు ఎందుకు అర్థ, రూపాయి ధర పలుకుతుంది..? రైతులు ఎందుకు ఇలాంటి పరిస్థితి ప్రతి ఏడాది ఎదురవుతోంది..?

సమస్యకు ఇవీ కారణాలు..

ఏపీలో పండించే టమోటా పంట దక్షిణ భారత రాష్ట్రాలన్నింటికీ ఎగుమతి అవుతుంది. ఆయా రాష్ట్రాలలోని మహానగరాల్లో ఉండే మండీల యజమానులు, దళారులు రైతుల వద్ద పంటను కొనుగోలు చేస్తారు. అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు పంపుతారు. పంటను రైతులు స్థానికంగా విక్రయించుకునే అవకాశాలు చాలా తక్కువ. పంట కోతకు వచ్చిన తర్వాత కోయకపోతే చెడిపోతుంది. పచ్చి సరుకు కావడంతో కోసిన వెంటనే అమ్ముకోవాలి. లేదంటే మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను యజమానులు, దళారీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వ్యాపారులు సిండికేట్‌ అవుతున్నారు. వారు చెప్పిందే« ధర. వారు చెప్పిన ధర గిట్టుబాటు కాలేదని పంటను వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే వచ్చినకాడికి పంటను రైతులు తెగనమ్ముకుంటున్నారు.

మార్కెట్‌లో ధర ఫర్వాలేదని కోత కోపిస్తే.. మరుసటి రోజుకు ఆ ధర పతనమవుతుంది. అందుకే కోసిన పంటను తోటలో ఉంచలేక.. రోడ్డుపక్కన పడేస్తున్న దయనీయ పరిస్థితులు ప్రతి ఏడాది కనిపిస్తున్నాయి. గత ఏడాది కరోనా మొదటి వేవ్‌లో పంటను అమ్ముకునే పరిస్థితులు లేని సమయంలో పుట్టపర్తి, కదిరి, మదనపల్లి ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని పంటను.. బెంగుళూరుకు తరలించి రైతులకు అండగా నిలిచారు.

Also Read : పాపపుణ్యాలపై లోకేష్‌ చెప్పింది నిజమే.. అందుకు సాక్ష్యం టీడీపీనే

పరిష్కారం ఏంటి..?

టమోటా రైతుకు తన పంటను రోడ్డు పక్కనపారబోసే పరిస్థితిని తప్పించడం సాధ్యమే. అయితే ఇందుకు ప్రభుత్వ చొరవ, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖల మధ్య సమన్వయం కావాలి. ఇంతకన్నా ముఖ్యమైనది రైతుల మధ్య సమన్వయం. పంట సాగుచేయడంలో ఒక విధానాన్ని పాటించాలి. రైతులు ఒక సంఘంగా ఏర్పడాలి, పంట వేయడం నుంచి విక్రయించడం వరకూ సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మార్కెట్‌లో డిమాండ్‌కు తగినట్లు సరుకును సరఫరా చేయొచ్చు.

మార్కెట్‌లో ధర పతనమైనప్పుడు పంటను నిల్వచేసుకునేలా శీతలగిడ్డంగులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. జగన్‌ సర్కార్‌ ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకోవడంతో అవసరమైన ప్రతి మండలంలో రాబోయే ఒకట్రెండు ఏడాదుల్లో శీతలగిడ్డంగులు ఏర్పాటు కాబోతున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేయాలి. టమెటా సాస్, జ్యూస్, పల్ప్‌ పరిశ్రమలు స్థానికంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. డ్వాక్రా సంఘాల మహిళలకు, రైతుల సంఘాల వారికి టమోటా సాస్, జ్యూస్‌ యూనిట్లు పెట్టేందుకు తగిన శిక్షణ, సహకారం అందించాలి. వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి.

Written By
Ashok Yeddula