Idream media
Idream media
నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు.. అని తెలుగు సామెత. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష టీడీపీ తీరునకు అతికినట్లు సరిపోతుందంటున్నారు విమర్శకులు. మహిళలపై అఘాయిత్యాలు, మద్యపాన నిషేధంపై మాటతప్పడం, నిత్యావసర ధరల పెరుగుదల, డ్వాక్రా సంఘాల నిర్వీర్యం చేశారంటూ, అందుకు నిరసనగా టీడీపీ మహిళా విభాగం ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నారీ సంకల్ప దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉంది. వారం రోజుల క్రితం అదే టీడీపీ కార్యాలయం ముందు.. మంగళగిరికి చెందిన టీడీపీ మహిళా నేత.. నారా లోకేష్ పీఏ సాంబశివరావు మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. తాజాగా విజయవాడలో టీడీపీ నేత వినోద్‌జైన్ వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ఘటనల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ తన మహిళా విభాగం నేతలతో నారీ సంకల్పదీక్ష చేపట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. దీక్షలో కూర్చుని ప్రభుత్వంపై చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. బాలికను వేధించి, చనిపోయేందుకు కారణమైన వినోద్ జైన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ.. అతను టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్ట్ అని, గతంలో బీజేపీలో ఉన్నప్పుడు మంత్రి వెల్లంపల్లికి అనుచరుడంటూ.. తమ పార్టీ నేత చేసిన దారుణాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తూ.. విషయాన్ని పక్కదారి పట్టిస్తోంది.
Also Read : టీడీపీ నేత వేధింపులు బాలిక ఆత్మహత్య
నారీ సంకల్ప దీక్ష పేరుతో టీడీపీ చేస్తున్న పక్కదారి పట్టించే రాజకీయం అందరికీ తెలిసిన విషయమే. 2019కి ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలపై టీడీపీ నేతలు సాగించిన దుశ్చర్యలను పక్కదారి పట్టించే చర్యలకు పూనుకుంది. విజయవాడలో అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి.. అవి కట్టలేని మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ దుర్మార్గంలో టీడీపీ నేతలు ఉండడంతో.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కాల్‌మనీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించింది. చిరు వ్యాపారులకు, ఇతరులకు సాధారణ వడ్డీరేటుకు రుణాలు ఇచ్చే తంతు ఏళ్ల తరబడి సాగుతున్నా.. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ చర్యలను అందరి మెడకు చుట్టింది. మొత్తం మీద ఆ ఘటన మరుగున పడేలా మసిపూసి మారేడు కాయ చేసింది. ఇక గుంటూరు నాగార్జున వర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, తహసీల్దార్ వనజాక్షి ఘటన సహా టీడీపీ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. ఏ ఘటనలోనూ నిందితులకు శిక్ష పడకపోవడం టీడీపీ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసింది. రాష్ట్రంలో నిత్యావసర ధరలు సాధారణంగానే ఉన్నాయనే విషయం టీడీపీకి తెలియనట్లుంది. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం ఎవరు చేశారో.. మహిళలను అడిగితే తెలుస్తుంది. 2014 ఎన్నికలకు ఆరు నెలల ముందే.. డ్వాక్రా రుణాలు కట్టవద్దు.. తాను రాగానే మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. ఆ తర్వాత ఏం చేసింది ప్రతి డ్వాక్రా మహిళకు తెలుసు. బ్యాంకుల నుంచి నోటీసులు అందుకుని, అపరాధ వడ్డీతో రుణం చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన మోసం ఎలాంటిదో బాగా తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం.. 2019 ఏప్రిల్ 11 పోలింగ్ జరిగిన నాటికి ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలు దాదాపు 25 వేల కోట్ల రూపాయలను తిరిగి నాలుగు విడతల్లో వారికే ఇచ్చేందుకు జగన్.. వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించారు. ఇప్పటికే రెండు విడతల సొమ్ము దాదాపు 12,500 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల చేతికి ఇచ్చారు. అంతేకాకుండా వడ్డీలేకుండా డ్వాక్రా సంఘాలకు రుణాలు అందిస్తున్నారు. ఈ విషయం తెలియకుండా.. టీడీపీ నారీ సంకల్ప దీక్షలు చేస్తే.. నవ్వులపాలు కావడం తప్పా.. వచ్చే లాభం ఏమీ లేదు.
Also Read : బాలిక ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత కోవర్ట్ అంట.. వర్ల వింత వాదన