Idream media
Idream media
ఎక్కడ ఎలా మట్లాడాలో.. ఎప్పుడు ఎలాంటి వరాలు ఇవ్వాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయాల్లో వంతబట్టిన విద్య. ఉద్యమ సమయంలో నరాలు ఉప్పొంగేలా ఆవేశపూరితంగా ప్రసంగాలు చేసినా, చతుర్లు వేస్తూ కూడా విపక్షాలకు చుక్కలు చూపెట్టాలన్నా, పార్టీలో చెలరేగుతున్న అసంతృప్తిని కంటిచూపుతో చల్లార్చాలన్నా అది కేసీఆర్ కే చెల్లుతుంది. దీనికితోడు గత నాలుగు నెలలుగా ఆయన చేస్తున్న రాజకీయాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రగతిభవన్ నుంచి నేరుగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం వ్యూహాలకు మరింత పదును పెట్టారు. హుజూరాబాద్ లో జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించి.. తన సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధానంగా ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న దళితులను దృష్టిలో పెట్టుకునే సాగుతున్నాయి. దళిత బంధు పేరుతో భారీ పథకానికి శ్రీకారం చుట్టి కేసీఆర్ సంచలనం రేపారు. దీనిపై విమర్శలకు విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రకటించినట్లు చెప్పి కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఈ పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హుజూరాబాద్ లో సోమవారం నిర్వహించిన సభలో ‘జై భీమ్’ అంటూ ప్రసంగం మొదలుపెట్టడం కేసీఆర్ చాతుర్యతకు అద్దం పడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు తాజాగా బీఎస్సీ లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆయనపై దళిత వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ దొర అహంకారం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి కుట్రలను తిప్పికొట్టడంలో భాగంగానే ఈ సభ ద్వారా జై భీమ్ నినాదాన్ని కేసీఆర్ ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.
నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో నిర్వహించిన ఈ సభలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇతర వర్గాలను కూడా ఆకట్టుకునేలా వ్యవహరించారు. గతంలో ఈ జిల్లాలో ప్రారంభిచిన పథకాలను కూడా గుర్తు చేశారు. రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ సాధనలో తొలి నుంచి కరీంనగర్ జిల్లా ముందుందన్న కేసీఆర్ దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని ఆశిస్తున్నానంటూ ఆకట్టుకున్నారు.
‘దళితబంధుకు మొత్తం 22 వేల కోట్లు ఇస్తాం. నేను హుజురాబాద్‌లో స్వయంగా తిరిగి దళితబంధు అమలును పరిశీలిస్తా. దళిత బంధుకు కిస్తీలు కట్టే కిరికిరి అవసరం లేదు.దళితులు కూడా ధనవంతులుగా మారి చూపించాలి.
హుజురాబాద్‌లో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లుసమగ్ర సర్వేలో తేలింది. ఏ పథకం ప్రారంభించినా విపక్షాలకు అనమానులు, అపోహలే. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుంది. రాబోయే 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు విడుదల చేస్తాం: అంటూ ఈ పథకం అమలుపై తనకున్న చిత్తశుద్ధిని చాటారు. తానే స్వయంగా తిరిగి పథకం అమలు పరుస్తానని చెప్పడం ద్వారా సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు. అంతేకాదు.. దళితబంధు వచ్చినా రేషన్, పెన్షన్లు కొనసాగుతాయంటూ, ప్రభుత్వ పథకాల్లో, కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ దానిపై ఉన్న అపోహలను, ఇంకా కలిగే ప్రయోజనాలను కూడా తానే చెప్పేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ పని 75 ఏళ్ల కిందే మొదలు పెట్టి ఉంటే ఈ దుస్థితి ఉండేదా? అంటూ గత పాలకులకు కూడా చురకలు అంటించారు.