Idream media
Idream media
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు పెరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ లో కళ పెరుగుతోంది. కొంత కాలంగా కనిపించని నేతలందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా రెండు రోజుల క్రితం ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలందరూ ప్రత్యక్ష్యమయ్యారు. మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. పాత కాపులు కూడా కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.ఇటువంటి తరుణంలో రాజకీయ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అద్యక్షుడిగా చక్రం తిప్పిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) చేసిన వ్యాఖ్యల వెనుక పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకూ టీఆర్ఎస్ లో ఉన్న డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇంకో కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. డీఎస్ టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబంలో మూడు పార్టీలు అన్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం పొందాయి. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత డీఎస్ మీడియా ముందుకు వచ్చారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలు.. అన్న అంశంపై ఆయన స్పందించారు. ఒకే ఇంట్లో మూడూ పార్టీలు.. అని తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చాలామంది ఎంపీల ఇళ్లల్లో భార్య ఒక పార్టీలో భర్త ఇంకో పార్టీలో ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘నేను ఏ పార్టీలో ఉన్నానో అన్న విషయం నాకే తెలియడం లేదు. టీఆర్ఎస్ నుంచి నాకు ఆహ్వానాలు రావడం లేదు. నేను టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీనేనా? అన్న విషయాన్ని సీఎం కేసీఆర్నే అడగాలి’ అని అన్నారు.
కొంత కాలంగా డీఎస్ రాజకీయంగా నిశ్శబ్దాన్ని మెయింటెన్ చేస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ ను వీడనున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. జీహెచ్ ఎంసీలో ఎక్స్ అఫీషియో గా ఉన్న ఆయన మేయర్ ఎన్నికకు హాజరు కాకపోవడంతో పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ గా తాను కూర్చునే చక్రం తిప్పానని మాట్లాడడం వెనుక మళ్లీ కాంగ్రెస్ ను గుర్తు చేయడమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకులిద్దరూ తనకు రెండు కళ్లలాంటి వారని భవిష్యత్ను నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికుందని స్పష్టం చేశారు. పెద్ద కుమారుడు సంజయ్ సైతం రాజకీయాల్లో ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనతో టీఆర్ఎస్లోకి వచ్చిన సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నట్లు చెప్పాడని డీఎస్ తెలిపారు. అయితే.. డీఎస్ నిర్వేదం వెనుక వ్యూహం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.
డీఎస్ తాజా వ్యాఖ్యలు పైకి టీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయకుండానే ఆయన ఆపార్టీని ఇరకాటంలోకి నెట్టారని అంటున్నారు పరిశీలకులు. తమను తమ కుటుంబాన్ని టీఆర్ ఎస్ పట్టించుకోవడంలేదని.. కనీసం తనకు ఆరోగ్యం బాగోనప్పుడు కూడా టీఆర్ ఎస్ అధినేత తనను పలకరించలేదని.. అలాంటప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉండాలనేది ఒక అంశమైతే.. మరోవైపు.. టీఆర్ ఎస్ మునిగిపోతున్న నావగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పరోక్షంగా డీఎస్ కూడా చెప్పినట్టు అయిందని.. పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్ ఎస్లో ఉంటే ఫ్యూచర్ లేదని.. అందుకే తన పెద్ద కుమారుడు పార్టీ మారారని.. డీఎస్ పరోక్షంగా అంగీకరించినట్టు అయింది. మరి డీఎస్ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.