Idream media
Idream media
రాయలసీమలోని కర్నూలు మినహా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పలు గ్రామాలు వరద తీవ్రతకు భారీగా దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వర్షం తగ్గినా.. వరద ఉధృతి తగ్గకపోవడంతో ప్రభావిత ప్రాంత ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటూ గడుపుతూనే ఉన్నారు. భారీ వర్షాల దెబ్బకు ప్రాజెక్టులు, చెరువులు తెగిపోయాయి. ప్రస్తుతం అందరి దృష్టి చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువుపైనే ఉంది.
రెండు కొండల మధ్య నిర్మాణం..
భారీ వర్షాలతో ఈ చెరువుకు వరద పోటెత్తింది. దీంతో దశాబ్దాల తర్వాత రాయలచెరువు నిండింది. ఈ తరం వారు మునుపెన్నడూ చూడని స్థాయిలో చెరువులో నీరు చేరింది. 15వ శతాబ్దంలో రెండు కొండల మధ్య ఈ చెరువును నిర్మించారు. బోదగుట్ట, ఉత్తరదరి అడవి అనే కొండల మధ్య 40 మీటర్ల వెడల్పుతో మట్టికట్టను నిర్మించారు. దాదాపు వెయ్యి ఎకరాలలో ఈ చెరువు విస్తరించి ఉంది. చెరువు నీరు దిగువన పంట పొలాలకు మళ్లించేందుకు కుక్కల గండి, నక్కల గండి అనే రెండు తూములు మాత్రమే ఉండడంతో.. ప్రస్తుతం చెరువు నుంచి నీరు వేగంగా బయటకు వెళ్లేందుకు అవరోధాలు తలెత్తుతున్నాయి.
17 గ్రామాలకు ముంపు ప్రమాదం..
చెరువుకు ఉత్తర భాగాన ఆంజనేయ స్వామి గుడి సమీపంలో కట్ట బలహీనంగా తయారైంది. నీరు లీకవడంతో చెరువు దిగువ ప్రాంత గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. చెరువు తెగితే.. దిగువ ప్రాంతంలోని దాదాపు 17 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెరువులో ప్రస్తుతం ఒక టీఎంసీ జలాలు ఉన్నాయి. నీరు లీకు కాకుండా అధికారులు తాత్కాలికంగా చర్యలు చేపట్టారు. ఇసుక బస్తాలు.. చెరువులోపలి వైపున భారీగా వేశారు. ఇరిగేషన్ అధికారులు, సివిల్ ఇంజనీర్లు చెరువ కట్ట పటిష్ఠతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెరువుకట్టపైనే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు.
గండికొట్టి నీరు విడుదల..
ఎగువన కొండల్లో కురిసిన వర్షాల వల్ల భారీగా నీరు చెరువులో చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కుప్పం బాదూరు గ్రామం వైపున చెరువు కట్టకు గండి కొట్టి.. నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో కన్నా.. అవుట్ ఫ్లోనే ఎక్కువగా ఉంది. చెరువు కట్ట తెగే పరిస్థితి లేదని.. అయితే యుద్ధ ప్రాతిపదికన పలు చోట్ల చెరువు కట్టను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. చివరగా 1991లో ఈ చెరువుకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీళ్లు వచ్చాయి. ప్రస్తుతం చెరువు నిండడంతో.. ఎగువున ఉన్న రాయలచెరువు, చిత్తత్తూరు, శ్రీకాలేపల్లి, గొల్లపల్లి, సూరావారి పల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దురదృష్టవశాత్తూ చెరువుకట్ట తెగితే.. కింద ఉన్న 17 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. నీళ్లు 50 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిలో కలుస్తాయి.
Also Read : పెన్నా ఉగ్ర రూపం.. కూలిన జమ్మలమడుగు బ్రిడ్జి