iDreamPost
android-app
ios-app

ఈటల.. తెగే దాకా లాగారా..?

  • Published May 01, 2021 | 9:37 AM Updated Updated May 01, 2021 | 9:37 AM
ఈటల.. తెగే దాకా లాగారా..?

ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ లో కొన్ని నెలలుగా అసమ్మతి స్వరం పెంచుతున్న నేత. మంత్రిగా ఉంటూ ప్రభుత్వంపైనే పరక్షోంగా విమర్శలు చేశారు. ఇప్పుడు టాక్ ఆఫ్ తెలంగాణ అయ్యారు. ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలే ఇందుకు కారణం.

నిజానికి టీఆర్ఎస్ లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు ఈటల. కానీ కొన్నాళ్లుగా మాటల తూటాలు పేల్చుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారాయన. అయితే దేన్నయినా తెగేదాకా లాగకూడదు అంటారు. కానీ ఇక్కడ అదే జరిగింది. పార్టీ పెద్దలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఈటల దూకుడుగానే ముందుకు వెళ్లారనే విమర్శలు ఉన్నాయి. దీంతో అధిష్టానం కన్నెర్ర చేసిందని, అదను చూసి దెబ్బకొట్టిందని కొందరు లీడర్లు చర్చించుకుంటున్నారు. పక్కాగా ఇరికించారని, సాగనంపేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.

ఉండలేక.. వెళ్ల లేక..

టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలకు కొదవ లేదు. ఇలా జిల్లాకో పది మంది లీడర్లు ఉంటారు. కానీ ఎవ్వరూ నోరు మెదపరు. ఇందులో ముందు నుంచీ పార్టీలో ఉన్న వాళ్లు.. పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లూ ఉన్నారు. కానీ దాదాపు అందరూ సైలెంట్ గా ఉంటారు. టీఆర్ఎస్ ను వీడి వెళ్లాలనుకునే వారు మాత్రమే.. నాలుగు విమర్శలు చేసి పక్క పార్టీలోకి వెళ్లిపోయారు. కొండా సురేఖ దంపతులు, రాములు నాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, బాబూ మోహన్, స్వామి గౌడ్, వివేక్.. వంటి కొద్ది మంది మాత్రమే గత మూడేళ్లలో టీఆర్ఎస్ ను వీడారు.

Also Read : టీఆర్ఎస్ లో భూ కంపం ఎటు దారి తీయ‌నుంది..?

జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, పద్మారావు, దివంగత నాయిని నర్సింహారెడ్డి వంటి వారికి సెకండ్ క్యాబినెట్ లో చోటు దక్కలేదు. జూపల్లి ఓడిపోవడంతో ఆయన్ను పక్కన పెట్టేశారు. మిగిలిన వారు గెలిచినా వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. నర్సింహారెడ్డి ధిక్కారం వినిపించారని దూరంపెట్టారు. శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్పప్పటికీ.. కేసీఆర్ అండదండలు ఉన్న వ్యక్తి. అయినా వీళ్లెవ్వరూ పార్టీ గీత దాటలేదు. వరుసగా రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న ఈటల మాత్రం.. పరోక్ష విమర్శలతో టీఆర్ఎస్ లో కాకపుట్టించారు. అయితే ఇందుకు కారణమేంటన్నది ఎక్కడా బయటపడలేదు. ఆయన చెప్పలేదు.. ఇంకొకళ్లతో చెప్పించలేదు. మిగతా మంత్రులు కూడా ఆయన మాటలపై రియాక్ట్ అయిన సందర్భాలు అరుదు. నిజంగా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటే వెళ్లిపోవచ్చు.. ఉండలేక.. వెళ్లలేక ఇలా ఎందుకు చేస్తున్నారనేది మాత్రం చిదంబర రహస్యం.

సాగనంపుతారా?

తెలంగాణ క్యాబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను సాగనంపడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఆయనే రాజీనామా చేస్తారా? సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేస్తారా? అనేదే తేలాల్సి ఉందని చెబుతున్నారు. ఈటల రాజేందర్పై భారీ అవినీతి ఆరోపణలు చేయడం.. వరుసగా అనుకూలమైన అన్ని టీవీ చానల్స్ లో ప్రసారం చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రైతులు ఫిర్యాదు చేయడం, అధికారులతో కూడా ఈటలకు వ్యతిరేకంగా చెప్పించడం, ఆరోపణలు రాగానే కేసీఆర్ స్పందించడం, పూర్తిస్థాయి విచారణ జరపాలని సీఎస్ను సీఎం ఆదేశించడం, విచారణ మొదలుకావడం చూస్తే త్వరలో వేటు తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బీజేపీలోకి వెళ్తారా?

ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని, త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేయాలని ఈటల నిర్ణయించుకున్నారని, అందుకు అనుగుణంగా తన రాజకీయ భవిష్యత్పై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చాలా రోజులుగా ఆయన బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

Also Read : ఈటెల మాజీ మంత్రి కాబోతున్నారా..?