iDreamPost
android-app
ios-app

క‌రోనా వేళ‌.. వీర్రాజు ప‌ర్య‌ట‌న వెనుక అస‌లు ల‌క్ష్యం ఏంటి?

క‌రోనా వేళ‌.. వీర్రాజు ప‌ర్య‌ట‌న వెనుక అస‌లు ల‌క్ష్యం ఏంటి?

ఏపీలో బీజేపీ తీవ్ర క‌ష్టాల్లో ఉంది. ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో పార్టీ జోరు మీద ఉండ‌డం ఏపీ నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారుతోంది. ఏదో ఒక‌టి చేసి ఇక్క‌డ కూడా పార్టీని వార్త‌ల్లో నిలిపేందుకు నేత‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల క్రితం నిర్వ‌హించిన జ‌నాగ్ర‌హ స‌భ రివ‌ర్స్ అయింది. ఏపీ చీఫ్‌ సోము వ్యాఖ్య‌లు విప‌రీతంగా వైర‌ల్ అయ్యాయి. విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అనంత‌రం.. య‌థావిధిగా మ‌ళ్లీ ఆల‌యాల‌పై రాజ‌కీయాలు మొద‌లుపెట్టారు. ఇలా ర‌క‌ర‌కాలుగా వ్యూహాలు ప‌న్నుతున్నా ఏపీలో కాషాయ పార్టీ ఆద‌ర‌ణ ఇసుమంతైనా పెర‌గ‌డం లేదు. దీంతో సోము వీర్రాజు ఓ సంద‌ర్భంలో విర‌క్తి కూడా చెందారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌కున్న రాజ‌కీయ అనుభ‌వంతో హుందాగా పార్టీని ముందుకు న‌డిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టారు.

గ‌తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ దేవాల‌యాలను సంద‌ర్శించారు. ఆ సంద‌ర్భంగా హిందూత్వ వాదాన్ని ఎజెండాగా మార్చుకుని ఎదిగే ప్ర‌య‌త్నం చేసినా.. రాష్ట్రంలో ఆ ప‌ర్య‌ట‌నపై ఎవ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. ఇప్పుడు తాజాగా సోము వీర్రాజు నాలుగు రోజుల పాటు రాయలసీమ పర్యటన మొద‌లుపెట్టారు. ఇప్పటికే సోము వీర్రాజు కర్నూలు చేరుకున్నారు. ఇక్క‌డ జ‌రిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బనగానపల్లెలోను సోమూవీర్రాజు పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. నంద్యాలలో పోలీసులు అరెస్ట్‌ చేసిన బీజేపీ కార్యకర్త సుజన్‌ పురోహిత్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ త‌ర్వాత అనంతపురంలో కూడా ప‌ర్య‌టించ‌నున్నారు. 21న గూడూరులో పోలీసులు అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. 22న ఆత్మకూరు ఘటనపై కర్నూలులో బీజేపీ బహిరంగ సభలో సోము వీర్రాజు పాల్గొంటారు.

రాష్ట్రంలో క‌రోనా ఉధృతంగా విజృంభిస్తున్న వేళ‌.. సోము ప‌ర్య‌ట‌న‌లు మొద‌లుపెట్ట‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. అమిత్ షా తిరుప‌తిలో మీటింగ్ పెట్టిన నాటి నుంచీ ఏపీ బీజేపీ నేత‌లు జ‌నాల్లో ఉండే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు సోము తాజా ప‌ర్య‌ట‌న ద్వారా ఇత‌ర పార్టీల్లోని అసంతృప్తుల‌తో భేటీకి ప్లాన్ చేసుకున్న‌ట్లుగా పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బ‌ల‌ప‌డాలంటే ముందుగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌గ‌ల నేత‌ల అవ‌స‌రం ఉంద‌ని సోము గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ముందుగా రాయ‌ల‌సీమ‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.