Idream media
Idream media
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఓ పట్టాన ఎవరికీ అంతుపట్టవు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేయడంలో దిట్ట. రాష్ట్ర సిద్ధిలో కీలక పాత్ర పోషించి తెలంగాణ పితా గా గుర్తింపు పొందిన ఆయనకు ప్రజలు రెండోసారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారు. దీంతో ఆయనకు తిరుగులేదనుకుంటున్న క్రమంలో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. తాజాగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కూడా ఆ పార్టీయే విజయం సాధించినప్పటి నుంచీ కేసీఆర్ వ్యూహాలు మారినట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీని కాకుండా వడ్ల కొనుగోలును ప్రధాన అంశంగా చేసుకుని ఏకంగా కేంద్రాన్ని టార్గెట్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా స్వయంగా ధర్నాలో పాల్గొని సంచలనం సృష్టించారు. ఇప్పుడు రైతు చట్టాల రద్దును అవకాశంగా మార్చుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 3 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
ఆందోళన వెనుక లక్ష్యం ఏంటి?
కేసీఆర్ నయా విధానాలు ఎవరికీ అర్థం కావడం లేదు. సమకాలిన పరిస్థితులను, సంక్షోభాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో కేసీఆర్‌ను మించిన రాజకీయ దురందరుడు తెలుగు నేలపై మరొకరు లేరని ప్రసిద్ధి. తాజా సమీకరణాలు దాన్ని మరోమారు రుజువు చేస్తున్నాయి. ఇక రోజూ మీడియా ముందుకు వస్తానని ప్రకటించిన కేసీఆర్ చెప్పినట్లుగా వరుసగా సమావేశాలు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వేదికగా చేస్తున్న రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా.. అంతకు మించిన లక్ష్యాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. వరి కొనుగోలు విషయంపై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీతో ఢీ
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు. ఈసారి ఒక్కరే కాకుండా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో హస్తినకు పయనం అవుతున్నారు. ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండానే నేరుగా చర్చలకు సిద్ధమవుతున్న కేసీఆర్ లక్ష్యం ఆలోచించాల్సిందే. ఒకవేళ కేంద్ర పెద్దలు అందుబాటులో లేని పక్షంలో దానిపై మరో ఉద్యమం ఆరంభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
నూతన రైతు చట్టాల రద్దును కూడా కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని , అయితే.. చట్టాలు రద్దు చేసినట్లుగానే.. రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రైతు పోరాటంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే పేర్లు ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు సూచించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదని.. ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని.. కేసీఆర్ ప్రధాని మోదీని డిమాండ్ చేయడం కొత్త తరహా రాజకీయాలను తెరపైకి తెస్తోంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, జల్ శక్తి మంత్రిని కలవనున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ఆ పర్యటన అనంతరం మారబోయే పరిణామాలపై ఆసక్తి ఏర్పడింది.