iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సమస్యలు పెండింగులో ఉన్న మాటను ప్రభుత్వం అంగీకరించింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా కారణంగా ఏర్పడిన సమస్యలతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యిందనేది ప్రభుత్వ వివరణ. ఇటీవల సమావేశాల సందర్భంగా శాసనమండలిలో చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అదే సమాధానమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా అంతో ఇంతో ధీమా ఉన్న వర్గాలను కాకుండా నూటికి 90 శాతంగా ఉన్న పేదల సంక్షేమం కోసం దృష్టి పెట్టామని, ఉద్యోగుల సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. అదే సమయంలో వేతనాలు, పెన్షన్లు బకాయిలు లేకుండా అందిస్తున్నట్టు వివరించారు. సీఎఫ్ఎంఎస్ కి సంబంధించిన సాంకేతిక సమస్యలన్నింటినీ పరిష్కరించి ఆర్థికేతర డిమాండ్లన్నీ తీరుస్తామని అన్నారు. సీపీఎస్ మాత్రం కమిటీ పరిశీలనలో ఉందని వివరించారు. ఇదంతా జరిగి వారం రోజులు దాటింది.
ఈలోగా ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు కార్యాచరణకు పిలుపునిచ్చారు. నిరసనలు మొదలెట్టారు. అదే సమయంలో ఎన్జీవో సంఘ నేత శ్రీనివాసరావు, విద్యాసాగర్ వంటి వారి వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జిల్లా ఎన్జీవో నేత విద్యాసాగర్ అంతా తానై వ్యవహరించారు. అశోక్ బాబు తర్వాత తానే నాయకుడని కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ తీరా ఆయన స్థానంలో తొలుత చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు శ్రీనివాసరావు బాధ్యతల్లోకి వచ్చారు. దాంతో ఎన్జీవో అసోసియేషన్ రాజకీయాల్లో పాగా వేయాలని ఆశిస్తున్న విద్యాసాగర్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరావుని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పే పని ప్రారంభించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీలో చంద్రబాబు హవాకి చెక్ పెట్టేసిన నేతగా జగన్ కి చికాకు కల్పించాలనే లక్ష్యానికి అనుగుణంగా విద్యాసాగర్ పనిచేస్తున్నారా అనే అభిప్రాయం ఉద్యోగుల్లో కనిపిస్తోంది. తమ కులస్తుడు అధికారంలో లేనందున అన్ని రకాలుగానూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టాలనే రాజకీయ లక్ష్యాలకు ప్రస్తుత పరిణామాలను వాడుకోవాలనే యత్నంలో విద్యాసాగర్ ఉన్నట్టు భావిస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం పీఆర్సీ అంతా సిద్ధం చేస్తోంది. తిరుపతి పర్యటనలో ముఖ్యమంత్రి కూడా స్పష్టతనిచ్చారు. తనను కలిసిన జేఏసీ నేతలతో పది రోజుల్లోగా పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు. కనీసం 20 రోజుల్లోగా అది ఖాయమని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రకటన తర్వాత అమలులోకి రావడానికి మరి కొంతకాలం పడుతుంది కాబట్టి రాబోయే ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకోసం అంతా ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిజంగా ప్రకటన చేస్తే అది తమవల్లనేనని చెప్పుకోవడానికి ఎన్జీవో నేతలు కొందరు ప్రయత్నిస్తున్నట్టు ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. ఇంతకాలం ఉద్యోగుల సమస్యల మీద కదలని నేతలు ఇప్పుడు హడావిడి చేయడం వెనుక వారి ఉనికి కోసం జరుగుతున్న పాట్లుగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో విద్యాసాగర్ వంటి టీడీపీ ఏజెంట్ల సహాయంతో ఎన్జీవో నేతలు నేరుగా ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నానికి దిగడం ఆశ్చర్యంగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది
సహజంగా ట్రేడ్ యూనియన్ వ్యవహారాల్లో సభ్యులను ఉత్సాహపరిచేందుకు తమ బలాన్ని ఎక్కువ చేసి చూపడం చాలా సహజం, ఉద్యోగ సంఘాలు కూడా అలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. కానీ నేరుగా సీఎం ని బెదిరించగలమని ఎన్జీవో నేతలు కొందరు ఆశించడమే ఆసక్తిగా కనిపిస్తోంది. ఏపీలో జగన్ తన పని తాను చేసుకుపోతూ, అన్ని విమర్శలకు చేతలతో సమాధానం ఇచ్చే నాయకుడిలా ఉన్నారు. కాబట్టి ఇలాంటి విమర్శలు, వ్యాఖ్యలను ఆయన పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. అయినప్పటికీ ఎన్జీవో నేతలు కొంత అతిగా స్పందించే ప్రయత్నం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలను పలువురు సందేహిస్తున్నారు. త్వరలో పీఆర్సీని సీఎం తన ప్రకటనలకు అనుగుణంగా ముందుకు తీసుకొస్తే సమస్య పరిష్కారానికి అడుగుపడుతుంది. అదే సమయంలో ఇలాంటి నేతల వ్యాఖ్యలన్నీ నిలిచిపోతాయి కాబట్టి భవిష్యత్తులో ఎన్జీవో సంఘాలే చిక్కులు చవిచూడాల్సి వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Also Read : CM Jagan, PRC – ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు