Idream media
Idream media
మూడు రోజుల క్రితం మంత్రి బొత్స సత్యానారాయణ, తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి మూడు రాజధానుల అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని, విశాఖ నుంచి పాలన సాగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై ఓ వైపు న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి.., మరోవైపు అమరావతి పేరుతో ఓ ఉద్యమం రోజుల తరబడి నడుస్తూనే ఉంది.. అయినప్పటికీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూల అంశాలను పరిశీలిస్తూనే ఉంది. పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీ టీడీపీ కోర్టులో కేసులు వేసింది. ఆ కార్యక్రమం కొనసాగకుండా చాన్నాళ్లు అడ్డగించింది.
చివరకు ఓ వ్యూహం ప్రకారం.. సర్కారు తన పంతం నెగ్గించుకుంది. కేసులున్న వాటి జోలికెళ్లకుండా, మిగిలిన స్థలాలను పేదలకు పంచి ప్రతిపక్షానికి ఝలక్ ఇచ్చింది. మూడు రాజధానుల అంశంలోకూడా సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ విశాఖ నుంచి పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడ నుంచైనా పాలన చేయొచ్చని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తారని ఆయన ప్రభుత్వ ఉద్దేశాన్ని చెప్పారు. అయితే మూడు రాజధానుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎప్పుడొస్తుందనే విషయమై డేట్ అడగొద్దని సూచించారు. కానీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన మనసులో మాట చెప్పారు. దీంతో చట్టంలోని వెసులుబాటును అనుకూలంగా చేసుకుని విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విజయసాయిరెడ్డి మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫలాన చోటు నుంచే పాలన సాగించాలని కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవు. ఎక్కడ నుంచి, ఎలా పాలన సాగించాలనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది.
వాస్తవానికి మే 16న విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టింది. అయితే.. కోర్టులో కేసులు ఉన్నప్పటికీ.. ముందుకు సాగినా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో కాస్త బ్రేక్ పడింది. అయితే, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల ద్వారా త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే న్యాయ రాజధానిగా ఖర్నూలుకు అడ్డంకులు తొలగించే ప్రయత్నాలను సీఎం జగన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆ దిశగా కూడా ఫలితం సాధించినట్లే కనిపిస్తోంది. ఇక శాసన రాజధాని గా అమరావతి ఇప్పటికే ఉంది. వీటిని పరిశీలిస్తే, విపత్తులు, రాజకీయాలు ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించిన మూడు రాజధానుల అంశంలో సర్కారు ముందుకే సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది.