iDreamPost
android-app
ios-app

మంత్రి పదవి – ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఉన్న అడ్డంకి ఏంటి..?

మంత్రి పదవి – ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఉన్న అడ్డంకి ఏంటి..?

తూర్పు గోదావరి జిల్లాలోని సీనియర్‌ ఎమ్మెల్యేలలో చిర్ల జగ్గిరెడ్డి ఒకరు. కొత్తపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తండ్రి చిర్ల సోమసుందర్‌ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న చిర్ల జగ్గిరెడ్డి.. ఇప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు. 2001లో రావులపాలెం జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిన చిర్ల జగ్గిరెడ్డి 2004లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. 2009లో త్రిముఖ పోరులో పీఆర్‌పీ అభ్యర్థి బండారు సత్యానందరావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014, 2019లో వరుసగా వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిర్ల జగ్గిరెడ్డికి వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో బెర్త్‌ దక్కుతుందని ఆయన అనుచరులు ఆశించారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తయ్యే తరుణంలో ముందుగా జగన్‌ చెప్పినట్లుగా.. కేబినెట్‌ విస్తరణ జరిగే క్రమంలో తమ నేతకు అవకాశం లభిస్తుందని జగ్గిరెడ్డి అనుచరులు భావించారు. అయితే కేబినెట్‌లో ఆయనకు బెర్త్‌ దక్కదని తాజాగా జరిగిన పరిణామంతో తేటతెల్లమైంది. వైసీపీ ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ విప్‌గా నియమించింది.

తన అనుచరులు మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. చిర్ల జగ్గిరెడ్డికి ఈ విషయంపై స్పష్టత ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లా నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. తూర్పు గోదావరిలో ప్రధాన సామాజికవర్గాలుగా కాపు, శెట్టిబలిజ, ఎస్సీలు ఉన్నారు. ఈ జిల్లా నుంచి ఈ మూడు సామాజిక వర్గాల నేతలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కాపు సామాజికవర్గం నుంచి కురసాల కన్నబాబుకు, శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌కు, ఎస్సీ సామాజికవర్గం నుంచి పినిపే విశ్వరూప్‌కు మంత్రి పదవులు దక్కాయి.

Also Read : ‘తూర్పు’ రాజకీయం – ఒకప్పటి మిత్రులు.. నేడు రాజకీయ ప్రత్యర్థులు

పిల్లి సుభాష్‌ మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. శెట్టిబలిజ సామాజికవర్గలో బలమైన నేతగా కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పుడు కూడా ఆయన స్థానాన్ని శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో భర్తీ చేశారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తొలిసారి ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి దక్కడానికి ప్రధాన కారణం.. ఆయన సామాజికవర్గమే.

తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 14 చోట్ల గెలిచింది. ఇందులో ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. కాకినాడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, అనపర్తి నుంచి డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొత్తపేట నుంచి చిర్ల జగ్గిరెడ్డిలు గెలిచారు. సత్తి సూర్యనారాయణ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ద్వారంపూడి సీనియర్‌ ఎమ్మెల్యే. ఆయన తండ్రికి ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్‌ పోస్టుల్లో రాష్ట్ర స్థాయి పదవి దక్కింది. రాష్ట్ర సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ చైర్మన్‌గా ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి తండ్రి ద్వారంపూడి భాస్కర్‌ రెడ్డి నియమితులయ్యారు. తాజాగా చిర్ల జగ్గిరెడ్డికి ప్రభుత్వ విప్‌ పదవి దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి లభించే అవకాశాలు లేవని అర్థమవుతోంది.

Also Read : మంత్రివర్గ మార్పు ఊహాగానాలు మొదలు..కానీ అధినేత ఆలోచన ఏమంటే