Idream media
Idream media
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అనివార్యమైన హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసింది. ఉప ఎన్నికతో వేగం పుంజుకున్న తెలంగాణ రాజకీయాలు ఇంకా పరుగులు పెడుతూనే ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక వల్ల రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. నేతల పార్టీల మార్పులు చకచక జరిగిపోయయి. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకున్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్‌ఎస్ కండువా కప్పుకుని ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. హుజురాబాద్ బీజేపీ నేత పెద్దిరెడ్డి కమలం పార్టీని వీడారు.
నేతల చేరికతో టీఆర్‌ఎస్ పార్టీలో కోళాహళం నెలకొంది. హుజురాబాద్ టిక్కెట్ ఎవరిని వరిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో గులాబీ దళపతి కారులో ప్రయాణించే అభ్యర్థిని ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించి దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న చర్చకు తెరదించారు. ఈ నెల 16న దళితబంధు పథకంపై హుజురాబాద్‌లో ఏర్పాటు చేయబోయే బహిరంగసభలో అనధికారికంగా సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల సమరంలో దిగబోతున్నారు. ఈటల రాజేందర్ గెలుస్తారా..? లేక టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..? అనేదే ఇకపై ఆసక్తికరమైన అంశం.
టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారైన నేపథ్యంలో తాజాగా పార్టీలో చేరిన ఎల్.రమణ సంగతేంటి..? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు ధీటైన అభ్యర్థిని బరిలో దించేందుకే బీసీ సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై సమాలోచనలు జరిపిన తర్వాతనే ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఇది జరిగిన కొన్ని రోజులుగే టీఆర్‌ఎస్ టిక్కెట్ నాదే అనే కాల్ ఆడియో లీక్‌కావడంతో పతాక వార్తల్లో నిలిచిన కాంగ్రెస్ నేత కౌషిక్ రెడ్డి.. గంటల వ్యవధిలో హస్తం పార్టీని వీడాల్సి వచ్చింది. గులాబీ కండువాను కప్పుకున్న రోజుల వ్యవధిలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకుని పెద్దల సభలో కూర్చున్నారు. కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. మరి ఎల్.రమణకు ఏమి ఇవ్వబోతున్నారు..? అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
Also Read : విధేయుడు, ఉద్యమకారుడికే టికెట్.. హుజూరాబాద్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్