iDreamPost
android-app
ios-app

కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు భవిష్యత్తేమిటో..?

  • Published Jun 11, 2021 | 5:32 AM Updated Updated Jun 11, 2021 | 5:32 AM
కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు భవిష్యత్తేమిటో..?

అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బండారు సత్యానందరావు సౌమ్యుడిగా చిరపరిచితుడు. కాపు సామాజికవర్గానికి చెందిన సత్యానందరావు గెలుపు, ఓటముల్లో సొంత సామాజికవర్గం కీలకమనే చెప్పాలి. ఆ మాటకొస్తే ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే సంఖ్యలోనే కాపు సామాజివర్గ ఓటర్లు ఉన్నారు. అయితే రాజకీయంగా వారు విడిపోవడంతోనే ఇతరులు విజయం దక్కించుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ శాతం సొంత సామాజికర్గం ఓటర్లే ఉన్నప్పటికీ పోటీ చేసిన అన్నిసార్లు గెలుపు బండారును వరించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

సొంత గ్రామమైన వాడపాలెంలో సర్పంచ్‌గా ఓటమి పాలైనప్పటికీ రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ప్రజా జీవితంలోనే కొనసాగుతూ వచ్చారు. సౌమ్యుడు, చురుకైన వ్యక్తి కావడంతో 1994లో ఎన్టీ రామారావు కొత్తపేట టిక్కెట్టును బండారుకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో సైతం టీడీపీ తరపున విజయం దక్కించుకోగలిగారు. అయితే 2009లో రాజకీయ సమీకరణల నేపథ్యంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. తెలుగుదేశం పార్టీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్‌ నుంచి చిర్ల జగ్గిరెడ్డి పోటీ చేసారు. ఈ ముక్కోణపు పోటీలో 2,470 ఓట్లతో బండారు విజయం సాధించగలిగారు.

రాష్ట్రంలో ప్రజారాజ్యం తరపున గెలుపొందిన 18 మంది ఎమ్మెల్యేల్లో బండారు కూడా ఒకరిగా నిలిచారు. అయితే ఆ తరువాత చిరంజీవి తన ప్రజారాజ్యం పార్గీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో బండారు తన సొంతగూటికి చేరారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కించుకోగలిగారు. ఆ తరువాత 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన ముక్కోణపు పోటీలో మరోసారి బండారు ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఆరుసార్లు పోటీపడగా మూడు సార్లు విజయం వరించగా, మరో మూడు సార్లు ఓటమి పాలయ్యారు. రాజకీయంగా స్నేహశీలిగా పేరున్న బండారు అన్ని సామాజికవర్గాలతోనూ స్నేహ సంబంధాలను మెరుగ్గానే పాటిస్తారని మేలు. అయితే కాపు సామాజికవర్గం మద్దతు బట్టే బండారు విజయం ఖరారు అవుతుందని పలువురి రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు.

ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న బండారు సత్యానందరావు తన రాజకీయ భవిష్యత్తును గురించి ఆలోచించాల్సిన అవసరముందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ తెలుగుదేశం పారీ గ్రాఫ్‌ను ప్రజలు తగ్గించి వేస్తున్నారు. పార్టీతో ప్రమేయం లేకుండా గెలవగలిగే బండారు లాంటి వ్యక్తులు తమ భవిష్యత్తు దృష్ట్యా మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్న బండారు.. చట్టసభల్లో సభ్యుడిగా మరోసారి ముందుకు వస్తారని ఆశించేవారు కొత్తపేట నియోజకవర్గంలో పలు చోట్ల కన్పిస్తున్నారు. 

Also Read : మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇక పార్టీ పదవికే పరిమితం కావాల్సిందేనా..?