iDreamPost
android-app
ios-app

ఆ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తానంటే కానీ ఆయన పార్టీలో ఉన్న సంగతి గుర్తు రాలేదే..!

ఆ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తానంటే కానీ ఆయన పార్టీలో ఉన్న సంగతి గుర్తు రాలేదే..!

కొంత మంది నేతలు ఆయా పార్టీలలో ఉన్నారా..? లేదా..? అనే విషయం ప్రజలకు పెద్దగా తెలియదు. ఆయా నేతలు తమ చర్యలు ద్వారా తాము రాజకీయాల్లోను, ఫలానా పార్టీలో ఉన్నామని తెలియజేస్తుంటారు. తమ రాజకీయ జీవితం ముగిసినా.. కొంత మంది నేతలు పూర్వవైభవం కోసం ఆశతో ప్రయత్నాలు చేస్తుంటారు. పార్టీలు ఫిరాయించిన వారైతే ఇక వారి రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాఫ్‌ పడినట్టే. ఇలాంటి వారిలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌ రాజు ఒకరు.

పార్టీలు ఫిరాయిస్తే తాత్కాలికంగా అధికారం లభిస్తుందేమో గానీ ప్రజా బలంలేని సదరు నేత రాజకీయ జీవితానికి మాత్రం దాదాపు ఫుల్‌స్టాఫ్‌ పడుతుందని డేవిడ్‌రాజును చూస్తే తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున యర్రగొండపాలెం నుంచి గెలిచిన డేవిడ్‌ రాజు రెండు పర్యాయాల తర్వాత మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. గెలిచిన తర్వాత ‘అభివృద్ధి’ కోసమంటూ చంద్రబాబు వద్దకు చేరారు. చంద్రబాబు కాళ్లు మొక్కి అభివృద్ధి కోరారు.

పార్టీ ఫిరాయించిన వారిలో కొంత మందికి 2019 ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వకుండా చంద్రబాబు ఝులక్‌ ఇచ్చారు. వారిలో డేవిడ్‌రాజు ఒకరు. యర్రగొండపాలెం టిక్కెట్‌ లభించకపోవడంతో డేవిడ్‌ రాజు వైసీపీ చేరారు. ఆయన తిరిగి వైసీపీలోకి వచ్చిన విషయం ప్రకాశం జిల్లా రాజకీయలను గమనించే వారికే తెలియదంటే అతిశయోక్తి కాదు.

Also Read : నెల్లూరు మాజీ మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా డేవిడ్‌ రాజు రాజకీయంగా యాక్టీవ్‌గా లేరు. ఈ ఏడాది జనవరిలో తాను వైసీపీని వీడుతున్నానంటూ ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత డేవిడ్‌ రాజు వైసీపీలో ఉన్నారా..? 2017లో టీడీపీలోకి ఫిరాయించారు కదా..? మళ్లీ వైసీపీలో ఎప్పుడు చేరారు..? అనే ప్రశ్నలు ప్రకాశం జిల్లా వాసులు తమకు తామే వేసుకున్నారు.

తనకు వైసీపీలో ప్రాధాన్యత దక్కడం లేదనేది డేవిడ్‌ రాజు విమర్శ. పార్టీలు మారే వారు ప్రభుత్వంలో పదవులు కావాలంటే కుదరదని, పార్టీలో ఆది నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పరోక్షంగా డేవిడ్‌రాజును ఉద్దేశించి అన్నారు. దీంతో డేవిడ్‌ రాజుకు క్లారిటీ వచ్చింది. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.

డేవిడ్‌ రాజు టీడీపీలో చేరేందుకు యత్నిస్తున్నారనే వార్తలు రాగానే.. యర్రగొండపాలెం టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. డేవిడ్‌ రాజు రాకను వ్యతిరేకించాయి. మళ్లీ రెండు నెలల తర్వాత ఈ నెల 8వ తేదీన తాను టీడీపీలో చేరుతున్నానంటూ డేవిడ్‌ రాజు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇంకా ఆయన వైసీపీలోనే ఉన్నారనే విషయం ప్రకాశం జిల్లా వాసులకు తెలిసింది.

Also Read :  అధికారములో ప్రవచనాలు , విపక్ష పాత్రలో పరుష పదజాలం ఇదీ బాబు తీరు ..

62 ఏళ్ల డేవిడ్‌ రాజు రాజకీయ పయనం టీడీపీతోనే మొదలైంది. ఒంగోలుకు చెందిన డేవిడ్‌రాజు తొలి నాళ్లలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుచరుడిగా ఉన్నారు. 30 ఏళ్ల వయస్సులోనే నాగులుప్పలపాడు మండలాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. టీడీపీలో బాబు హాయం ప్రారంభమైన తర్వాత దగ్గుబాటికి హ్యాండ్‌ ఇచ్చిన డేవిడ్‌ రాజు బాబు పంచన చేరారు. 1995లో ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

1999లో ఒంగోలుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతనూతలపాడు (ఎస్సీ రిజర్డ్వ్‌) నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచారు. 2004లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ–సీపీఎం పొత్తులో భాగంగా సంతనూతలపాడు టిక్కెట్‌ సీపీఎంకు దక్కింది. నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ ఏర్పడిన యర్రగొండపాలెం ఈ సారి ఎస్సీ రిజర్డ్వ్‌ అయింది. దీంతో చంద్రబాబు డేవిడ్‌ రాజును యర్రగొండపాలెం పంపించారు. ఓడిపోయారు. టీడీపీ ఓడిపోయింది.

వైసీపీ ఆవిర్భవించడంతో డేవిడ్‌ రాజు జగన్‌ పంచన చేరారు. యర్రగొండపాలెం కో ఆర్డినేటర్‌గా పదవి దక్కించుకున్నారు. సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఎన్నికలకు ముందు పార్టీలో చేరినా.. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం యర్రగొండపాలెం టిక్కెట్‌ను వైఎస్‌ జగన్‌ డేవిడ్‌ రాజుకే ఇచ్చారు. ఆదిమూలపు సురేష్‌ను సంతనూతలపాడుకు పంపారు. రెండు చోట్లా వైసీపీ గెలిచింది.

Also Read :విశాఖ ఉక్క… అమ్మేస్తామంతే!!

2014లో వైసీపీ నుంచి గెలిచిన డేవిడ్‌ రాజు 2017లో టీడీపీలోకి ఫిరాయించడం, మళ్లీ 2019 ఎన్నికలకు ముందు అక్కడ టిక్కెట్‌ రాకపోవడంతో వైసీపీలో చేరడం.. ఈ తరహాలో రాజకీయం నడిపిన ఆయన రాజకీయ జీవితం దాదాపుగా ముగిసిందనే చెప్పాలి. టీడీపీలో చేరినా ఆయనకు 2024లో పోటీ చేసే అవకాశం వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. యర్రగొండపాలెంలో టీడీపీ తరఫున అజితారావు రెండు సార్లు పోటీ చేశారు. ఈ సారి మళ్లీ ఆమెకు టీడీపీ టిక్కెట్‌ దక్కే అవకాశం ఉంది.

సంతనూతలపాడులో మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ ఇంచార్జిగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన బీఎన్‌ విజయ్‌కుమార్‌.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలోచేరి పోటీ చేశారు. 2019లోనూ పోటీ చేసి ఓడిపోయారు. బలమైన నేతగా ఉన్న బీఎన్‌ విజయ్‌కుమార్‌ను కాదని డేవిడ్‌రాజుకు సంతనూతలపాడు టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి ఉండబోదు. జిల్లాలో మూడో ఎస్సీ నియోజకవర్గమైన కొండపిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు ఉన్నారు.

వైసీపీలో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా టీజేఆర్‌ సుధాకర్‌బాబు, యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఉన్నారు. కొండపిలో మాదాసి వెంకయ్య ఉన్నారు. వైసీపీలో ఇక భవిష్యత్‌ లేదని తెలుసుకున్న డేవిడ్‌ రాజు టీడీపీ వైపు చూస్తున్నారు. మరి ఆయన ఆశలు ఫలించి.. టీడీపీ తరఫున మళ్లీ పోటీ చేసే అవకాశం 2024లో వస్తుందా..? లేదా..? చూడాలి.