Idream media
Idream media
చిన్నప్పుడు లెక్కల్లో బాగా భయపెట్టిన వాళ్లలో పైథాగరస్ ఒకడు. లంబకోణ త్రిభుజం అని ఏదో సూత్రం. ప్రతి పదానికి వేరే చిత్రాన్ని ఊహించుకునే అలవాటు. లంబ అంటే హిందీలో పొడవు, కోన అంటే అడవి లేదా వాగు. త్రిభుజం అంటే మూడు భుజాలు. పొడవైన వాగుకి మూడు భుజాలతో ఒక ఆకారం వుంటే? మనిషికి రెండు చేతులు కాకుండా 3 చేతులు వుంటే 3 భుజాలుంటాయి. త్రిభుజుడు , ఇది బాగుంది. రామాయణంలో కబంధుడు అనే రాక్షసుడికి పొడవైన చేతులుంటాయి. కబంధుడి అనంతరం ఆ చేతులు ఆఫీసుల్లో బాస్‌లకి మొలిచాయి. ఎక్కడున్నా మనల్ని పట్టేస్తారు. సెల్‌ఫోన్లు వచ్చిన తర్వాత జీవితమే ఒక ఆఫీస్ అయిపోయింది.
పైథాగరస్‌తో మొదలు పెట్టి ఆవు వ్యాసం ప్రారంభించాను. ఆయన సోక్రటీస్ కంటే ముందుకాలం వాడు. క్రీస్తు పూర్వమే ఈ ప్రపంచమంతా అంకెలమయం అని ఆ మహానుభావుడు చెప్పాడు. నెంబర్లే ఈ విశ్వాన్ని పాలిస్తాయని అన్నాడు. ఇప్పుడు మనం కేవలం నెంబర్లమే. ఫోన్, ఆధార్, పాన్ ఈ మూడు నెంబర్లు లేకపోతే జీవించలేని స్థితికి చేరుకున్నాం. అయితే ఈ లెక్కల మాష్టారు కాలం నాటికి సున్నా లేదు. దాన్ని కనిపెట్టింది భారతీయులే. చాలా విషయాల్లో మనం జీరోగా మిగిలిపోవడానికి ఇదే కారణం.
ప్రపంచంలోని దేన్నైనా సరే అంకెల ద్వారా చెప్పాల్సిందే. వేరే దారి లేదన్నాడు. సుగర్, బీపీ, జ్వరం, గుండె చప్పుడు, ఆస్తులు, అప్పులు అన్నీ నెంబర్లే. అవి లేకుండా జీవితాన్ని ఊహించండి. నెంబర్లకి ప్రత్యేక శక్తులు ఉంటాయని పైథాగరస్ నమ్మాడు. అది న్యూమరాలజీగా మారి నెత్తిన కూచుంది.
శక్తులేమో కానీ, ఈ అంకెలు రకరకాలుగా నాకు దర్శనమిచ్చేవి. 1 అయ్యవారి బెత్తంగా,2. చుట్టచుట్టుకున్న పాములా, 3.త్రిశూలంలా, 4.కాలుమీద కాలు వేసుకున్నట్టు, 5.కోడిపుంజులా, 6.వానపాములా, 7.విరిగిపోయిన నాగలిలా, 8.రెండు కోడిగుడ్లలా, 9.ఊయలలోని పసిబిడ్డలా కనిపించేవి. ఇవన్నీ వేదాంతుల లక్షణాలని నాకప్పుడు తెలియదు.
పైథాగరస్ ఇప్పటి కాలానికి సరిపోయే ఎన్నో జీవన సూత్రాలు చెప్పాడు.
1.సంతోషంగా ఉండడమంటే వర్తమానంలో జీవించడం.
జీవితం అంటే ఏ క్షణానికి ఆ క్షణం జీవించడమే. సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. గుండె, కిడ్నీ , లివర్‌లా అది మన లోపలే వుంటుంది. స్కానింగ్‌కి ఇష్టపడం.
2.మనిషి జంతువుని చంపినంత కాలం జంతువు మనిషిని చంపుతూనే వుంటుంది.
చర్యకి ప్రతిచర్య తప్పదు. బాధని, మరణాన్ని విత్తులుగా నాటి ప్రేమ, దయ పండాలని కోరడం అత్యాశ కదా అంటాడు పైథాగరస్.
ఇప్పుడు హింస రూపాన్ని మార్చుకుంది. రక్తం కనపడదు. గాయం వుంటుంది.ర్యాగింగ్ ఒకప్పుడు కాలేజీల్లోనే వుండేది. ఇప్పుడు ఏదో ఒక రూపంలో అన్ని రంగాల్లో ఉంది. ఈస్తటిక్స్, సున్నితత్వం ఉండాల్సిన సినిమా ఫీల్డ్‌లో ఇంకా ఘోరంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం ఒక హాస్యనటుడికి ప్రొడక్షన్ బాయ్స్‌ని ఇష్టమొచ్చినట్టు తిట్టే అలవాటు వుండేది. దీన్ని భరించలేని ఒక కుర్రాడు టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చాడు. షూటింగ్‌లు కాన్సిల్ చేసుకుని మూడు రోజులు ఆ నటుడు ఆస్పత్రిపాలయ్యాడు.
ఈ మధ్య ఒక పాట వీడియో లీక్ అయి సంచలనంగా మారింది. అది ఆ యూనిట్‌లో ఎవరో ఒకరి కుర్ర చేష్ట కావచ్చు, లేదా ప్రతీకార చర్య కూడా కావచ్చు. ఆ సంస్థ చేయకపోవచ్చు. కానీ చాలా సంస్థలు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి చివరి నెల లేదా రెండు నెలల జీతాలు ఎగ్గొడతాయి. హీరోలకి కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు బడ్జెట్ నియంత్రణ పేరుతో ఆఫీసుల్లో భోజనాలకి కూరలు తగ్గిస్తారు. పెరుగుకి బదులు మజ్జిగ పోస్తారు. ఇంటర్వ్యూల్లో మహానుభావుల్లా మాట్లాడే డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లకి పైసా ఇవ్వకుండా ఏళ్ల తరబడి పని చేయిస్తారు. నిర్మాతలు ఇస్తామన్నా అడ్డుపడే వాళ్లు ఉన్నారు. వీటన్నింటికి ఏదో రూపంలో ప్రతిచర్యలుంటాయి. కొన్ని బయటికి వస్తాయి, కొన్ని రావు.
3.మౌనానికి మించిన శక్తివంతమైన మాటలు నీ దగ్గర వుంటేనే మాట్లాడు. తెల్లారిలేస్తే నానాచెత్త మాట్లాడే నాయకులకి ఈ వాక్యాల్ని ప్రతిరోజూ డిక్టేషన్ రాయించాలి.
4.మూర్ఖున్ని వాగుడు ద్వారా, తెలివైనవాన్ని మౌనం ద్వారా గుర్తు పట్టొచ్చు. టీవీల వాళ్లు ప్రతిరోజు ఎందరో మూర్ఖుల్ని చూపించి రేటింగ్ పెంచుకుంటారు.
5.ప్రపంచంలో అతి చిన్నపదాలైన అవును, కాదు చెప్పడానికి చాలా జ్ఞానం అవసరం. పెళ్లైన తర్వాత ఈ కొటేషన్ సంపూర్ణంగా అర్థమవుతుంది.
6.కోపంలో మాటల్ని, చేతుల్ని కట్టిపడేసుకో. తన కోపమే తన శత్రువని సుమతికారుడు చెప్పిందిదే.
7.సూర్యుడు, సముద్రానికి పుట్టిన స్వచ్ఛమైన బిడ్డ ఉప్పు. ఉప్పుని ఇంత కవితాత్మకంగా చెప్పొచ్చని పుట్టినప్పటి నుంచి తింటున్నా తెలియదు.
8.స్నేహితుల్ని శత్రువుగా మార్చుకోవడం ఎంత తప్పో. శత్రువుల్ని స్నేహితులుగా మార్చుకోకపోవడం కూడా అంతే తప్పు. మన రాజకీయ నాయకులు ఈ సూత్రం ఆధారంగానే పార్టీలు మారుతుంటారు.
9.చిన్న విషయానికి పెద్ద పదాలు వాడొద్దు. గొప్ప విషయాల్ని కూడా క్లుప్తంగా చెప్పు. మన రచయితలు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం.
10.ప్రకృతితో మన హృదయాన్ని అనుసంధానించేదే నిజమైన సంగీతం. ప్రకృతికి, సంగీతానికి రెండింటికి విధ్వంసకారులు తయారయ్యారు.