Idream media
Idream media
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లో ఓ కసి అయితే కనిపిస్తోంది. గతానికి భిన్నంగా రాష్ట్రాన్ని పాలించి ప్రజల మనుసుల్లో ముద్రవేసుకోవాలనే తపన కూడా కనిపిస్తోంది. ఆయన వేసే అడుగులు, చెప్పే మాటలు ఆ దిశగానే ఉంటున్నాయి. పనికిమాలిన అంశాలపై రాజకీయాలు తగ్గిస్తూ.. ప్రజా కార్యక్రమాలు పెంచుతూ ముఫ్పై రెండు నెలల పాలనలో కొత్త ఒరవడి అయితే సృష్టించారు. దేశంలోనే టాప్ గేర్ లో సంక్షేమ రథాన్ని పరిగెత్తిస్తున్నారు. ఇందుకోసం వేలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఆ అవసరాలు తీరాలంటే కేంద్రం కూడా సహకరించాల్సి ఉంటుంది. కొత్తగా ఏమీ చేయకపోయినా.. గతంలో ఇచ్చిన హామీలనైనా అమలు చేయాల్సిన అవసరం ఉంది. వాటిని నెరవేర్చుకునే క్రమంలో ముఖ్యమంత్రిగా జగన్ తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు.
తాజాగా మరోమారు ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని ప్రముఖులందరినీ కలిశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జగన్ ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడ ఆయన బిజీ బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కీలక మంత్రులను కలిశారు. ఏపీలోని అనేక సమస్యల మీద వినతిపత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి ఆఫీస్ తెలియచేసిన ప్రకారం చూస్తే జగన్ ఈసారి చాలా మంది కేంద్ర మంత్రులతో భేటీలు వేశారు. మోడీని కలిసిన తరువాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత నితిన్ గడ్కరీ అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి వారితో ఆయన సమావేశాలు జరిపారు. ఏపీ ప్రస్తుత పరిస్థితులు, విభజన హామీలు, వాటి అమలులో ఎదురవుతున్న సవాళ్లను అన్నింటినీ వివరించారు.
ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి విన్నపాలు చేశారు. రెండున్నరేళ్ళుగా జగన్ కనీసం ఆరేడు సార్లు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. వెళ్ళిన ప్రతీసారి ఏపీ కి సాయం చేయాలని కోరుతూ వచ్చారు. కానీ కేంద్రం మాత్రం తాను అనుకున్నదే చేస్తోంది. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇక పోలవరం విషయంలో ఇరిగేషన్ కాంపోనెంట్ ఖర్చునే భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దానికి మించి పైసా ఇవ్వమని చెబుతోంది. విభజన తరువాత రెవెన్యూ లోటుని పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పినా కూడా ఏడేళ్ల కాలంలో ఇచ్చినది నాలుగు వేల కోట్లే. ఇంకా పద్దెనిమిది వేల కోట్ల బకాయి ఉంది. ఇక విశాఖ రైల్వే జోన్ అంశంపై కూడా కేంద్రం దాగుడుమూతలు ఆడుతోంది.
Also Read : నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ
తాజాగా జగన్మోహన్ రెడ్డి మరోసారి తన బాధ్యతను నెరవేర్చారు. రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాలనూ కేంద్ర పెద్దలకు వివరించారు. వారు కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఏపీకి అనుకూలంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, నిధులు విడుదల చేస్తారా, తమ విధులు నెరవేరుస్తారా అనేది వేచి చూడాలి.