iDreamPost
iDreamPost
నిజాయితీ, నిబద్ధత, సిద్ధాంతాలు, పార్టీకి కట్టుబడిన వారు రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాణిస్తారు. ప్రలోభాలకు లొంగిపోయి పక్కదారులు పట్టే వారు తాత్కాలికంగా అందలం ఎక్కవచ్చేమోగానీ.. వారికి మనుగడ ఉండదని చరిత్ర చెబుతోంది. గత టీడీపీ హయాంలో చంద్రబాబు వలలో పడి వైఎస్సార్సీపీ కి ద్రోహం చేసి ఆ పార్టీలోకి వెళ్లిపోయిన చాలామంది అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభావం కోల్పోవడం తాజా ఉదాహరణ. అటువంటి వారిలో విశాఖ జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒకరు. మంత్రి పదవికి ఆశపడి టీడీపీలోకి జంప్ చేసిన ఆమెకు ఆ పదవి దక్కలేదు సరికదా.. ఎన్నికల్లోనూ పరాభవం ఎదురైంది. అప్పుడు ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత ఇప్పటికీ వెంటాడుతోంది. టీడీపీ ఇంఛార్జిగా ఉన్నా.. కుమార్తెను రాజకీయ వారసురాలిగా తెరపైకి తెచ్చినా ఆ వ్యతిరేకతే ఆమె భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారింది.
వైఎస్సార్సీపీ ద్వారా రాజకీయ వెలుగు
నిజానికి ఈశ్వరిది రాజకీయ కుటుంబమే. ఆమె తండ్రి గిడ్డి అప్పలనాయుడు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేయడంతో ఆ కుటుంబం ఏజెన్సీ ప్రజలకు పరిచితమైనదే. అయితే ఈశ్వరి మాత్రం రాజకీయాలతో సంబంధం లేకుండా టీచరుగా పనిచేసేవారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి విశాఖ మన్యంలో అగ్రనేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోనూ, అసెంబ్లీ సమావేశాల్లోనూ చురుగ్గా వ్యవహరించి, పార్టీ వాయిస్ బలంగా వినిపించి జగన్ మనసు చూరగొన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఈశ్వరి మంత్రి కావడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే ఆమె తొందరపడ్డారు. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయారు. మంత్రి పదవి డబ్బుకోసం ఆశపడి తన ఎదుగుదలకు కారణమైన వైఎస్సార్సీపీని వీడి 2017 నవంబర్ 27న టీడీపీలోకి జంప్ అయ్యారు. కానీ ఆమె ఆశపడిన మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. మరోవైపు నియోజకవర్గ ప్రజల్లో ఈశ్వరి చులకన అయ్యారు. వ్యతిరేకత పెంచుకున్నారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.
కుమార్తెను రంగంలోకి దించినా ఫలితం లేదు
ఎన్నికల తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్న ఈశ్వరిపై ప్రజల్లో వ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదు ఎక్కడికి వెళ్లినా తెలుగుదేశంలోకి వెళ్లి మాకు ఏం పనులు చేసిపెట్టారని ప్రజలు నిలదీయడం ప్రారంభించారు. దాంతో ఇటీవలి కాలంలో పర్యటనలు బాగా తగ్గించేశారు. ఇలా లాభంలేదని తన కుమార్తె కీర్తి మాన్వితను రంగంలోకి దించారు. గత ఏడాది జరిగిన పరిషత్ ఎన్నికల్లో పాడేరు జెడ్పీటీసీగా టీడీపీ తరపున పోటీకి నిలబెట్టారు. కానీ వైఎస్సార్సీపీ అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయారు. ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఈశ్వరి రాజకీయాలకు కాస్త దూరం అయ్యారు. టీడీపీ తరపున ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటేనే పాల్గొంటున్నారు. లేకపోతే ఇంటికి, సొంత పనులకే పరిమితం అవుతున్నారు.
Also Read : బాలయ్యకు ఉన్న చిత్తశుద్ధి.. బాబుకు లేకపాయనే..!