iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌ను వెంటాడుతున్న కష్టాలు

కాంగ్రెస్‌ను వెంటాడుతున్న కష్టాలు

కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌ ఏంటి..? నాగార్జున సాగర్‌లో జానారెడ్డి లాంటి వ్యక్తే గెలవకపోతే మున్ముందు పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌కు ఓటమి తప్పని నేపథ్యంలో తీవ్ర చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ పెట్టుకున్న కొండంత ఆశలు ఆవిరయ్యాయి. 2014 ఎన్నికల నుంచీ ఎదురవుతున్న ఓటముల ఖాతాలో సాగర్‌ కూడా చేరింది. గెలిచినా పార్టీ మారబోడన్న నమ్మకం, నియోజకవర్గంలో సానుభూతి, అపారమైన రాజకీయ అనుభవం తమ అభ్యర్థి జానారెడ్డిని గెలిపిస్తాయని కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకున్న నమ్మకం వమ్మయింది.

ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను గట్టెక్కించే సారథి ఎవరన్న చర్చ ఆ పార్టీలో జోరందుకుంది. వాస్తవానికి టీపీసీసీకి నూతన అధ్యక్షుడు సహా నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయినా సాగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో అధిష్ఠానం వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సాగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీపీసీసీకి నూతన అధ్యక్షుడు, కార్యవర్గాన్ని ప్రకటించాలని అధిష్ఠానం భావించింది. టీపీసీసీ నూతన సారథి రేసులో ప్రధానంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లూ ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ ఉప ఎన్నికలో జానారెడ్డి విజయం సాధించినట్లయితే ఆయన కూడా రేసులో చేరేవారని గాంధీ భవన్‌ వర్గాలు తెలిపాయి.

అయితే ఆదివారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సాగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు నిరాశాజనకంగా రావడంతో వాటి ప్రభావం టీపీసీసీ సారథి ఎంపిక ప్రక్రియపై పడుతుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. దీంతో తెలంగాణ సహా రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాలను ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత అధిష్ఠానానికి ఏర్పడిందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

మరో వైపు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కావడానికి బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో నెలకొంది. ముందుగా నిర్ణయించిన దానికే అధిష్ఠానం కట్టుబడితే వారం లోపే టీపీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా రావడంతో పూర్తిస్థాయి సమీక్ష చేపట్టే అవకాశం ఉండడం, ఇప్పట్లో ఎన్నికలేమీ లేకపోవడం, కరోనా పరిస్థితులు పరిగణనలోకి తీసుకుంటే మరి కొంత కాలం వాయిదా పడే సూచనలూ ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.