Idream media
Idream media
అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ చేస్తున్న ఉద్యమానికి ఒత్తాసు పలుకుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖపై మాత్రం స్పష్టమైన నిర్ణయం చెప్పడం లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడుతున్న టీడీపీ నేతలు.. రాజధానిగా విశాఖ ఓకేనా, కాదా అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు.
మూడు రాజధానులకు అనుగుణంగా వడివడిగా నిర్ణయాలు వెలువడుతున్న వేళ.. టీడీపీ వ్యూహాత్మకంగా కొత్త చర్చకు తెర లేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పాత్ర ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఎంత వరకు ఉందనే చర్చ మొదలైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదాన్ని లేవనెత్తుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు నేతలు చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయనేది హైదరాబాద్ తో స్పష్టమైంది. హైదరాబాద్‌పైనే మొత్తం పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో భారీ నష్టం వాటిల్లింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే విద్వేషాలు ఏర్పడవు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయి. అత్యాశగా విశాఖపట్నం రాజధాని కోరలేదని, అన్ని అర్హతలు ఉన్నాయి కనుకనే విశాఖను రాజధాని నగరంగా ప్రకటించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీకి విశాఖపట్నంలో ఓట్లు, సీట్లు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అవసరం లేదని అవంతి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉప్పుడు పట్టించుకున్నారా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమి లేదన్నారు.
ఉత్తరాంధ్రపై ప్రేమ చూపించే చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత విశాఖను ఎందుకు రాజధాని చేయలేదు? అప్పుడే చేసుంటే దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా విశాఖ అభివృద్ధి చెంది హైదరాబాద్‌తో పోటీపడగలిగేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రపై దృష్టి సారించింది. అనకాపల్లి, పాడేరుల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టింది. మరోవైపు విజయనగరానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కళాశాల అయినా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఆనాడు వైఎస్సార్ సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు 8 లక్షల ఎకరాలకు నీరు తెచ్చే యత్నం చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ రూ.2,500 కోట్ల ప్యాకేజీతో అనకాపల్లి నుంచి ఫేజ్–1, ఫేజ్–2లో నిర్మాణాలు చేపడుతున్నారు. అలాంటి సుజల స్రవంతిపై కూడా చంద్రబాబు అండ్ కో ఆరోపణలు చేస్తూ విమర్శల పాలవుతోంది.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే వైసీపీ ఆకాంక్షగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా భారీ ప్రణాళికలు రచించింది. అయితే, టీడీపీ హయాంలోనే ఉత్తరాంధ్ర అత్యధిక స్థాయిలో అభివృద్ధి చెందినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, దీనిపై బహిరంగచర్చకు సిద్ధమా? అని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సవాల్ విసిరారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ నాయకుడు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని చర్చా కార్యక్రమాలు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతించి, తర్వాతే చర్చా వేదికలు పెట్టుకోవాలని సూచించారు. ఓ వైపు విశాఖ రాజధానిగా ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ తరహా సవాళ్లు – చర్చలు ప్రారంభకావడం ఆసక్తిగా మారింది.