iDreamPost
android-app
ios-app

బద్వేలు బరిలో బీజేపీ ఏం సాధించ‌బోతోంది?

బద్వేలు బరిలో బీజేపీ ఏం సాధించ‌బోతోంది?

బద్వేల్ ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు వేశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆమె భ‌ర్త డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య ఇక్క‌డి నుంచి పోటీ చేసి గెలిచారు. మార్చి నెల‌లో అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న మృతి చెంద‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ ఆయ‌న భార్య‌కే టికెట్ ను కేటాయించింది. తొలుత టీడీపీ, జ‌నసేన, బీజేపీ ఇక్క‌డి నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించింది. పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించింది. టీడీపీ కూడా జ‌న‌సేన బాట‌లోనే న‌డిచింది. కానీ.. బీజేపీ మాత్రం మేం త‌గ్గేదేేలేేేదు అంటోంది. బీజేపీ నిర్ణ‌యంపై అంత‌టా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో సొంతంగా పోటీ చేసిన బీజేపీ.. నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు ల‌క్ష‌ల ఓట్ల‌లో క‌నీసం వెయ్యి ఓట్ల‌ను కూడా పొంద‌లేక‌పోయింది. కేవ‌లం 735 ఓట్లు సాధించి.. నోటా, స్వ‌తంత్ర అభ్య‌ర్థి కంటే కూడా వెనుక‌బ‌డింది. చ‌నిపోయిన ఎమ్మెల్యే భార్య‌కే టికెట్ ఇవ్వ‌డంతో ఏక‌గ్రీవం కావాల‌ని ఆశిస్తూ టీడీపీ, జ‌న‌సేన పోటీ నుంచి త‌ప్పుకుంటే.. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు తాము వ్య‌తిరేక‌మంటూ బీజేపీ పోటీకి వెనుకాడ‌బోం అంటోంది. ఇక్క‌డ ఆలోచించాల్సిన విష‌యం ఏంటంటే.. త‌న‌ బ‌లం ఏంటో తెలిసి కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Also Read : బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జ‌న‌సేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కార‌ణాలున్నాయా?

జ‌న‌సేన నిర్ణ‌యం అనంత‌రం.. కూడా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్థానిక నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. పార్టీ పోటీలో ఉంటుంద‌ని, ప‌లువురి పేర్ల‌ను అధిష్ఠానానికి పంపుతామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ప‌లువురు సీనియ‌ర్లు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌నం కూడా పోటీ నుంచి త‌ప్పుకుంటేనే బాగుంటుంద‌ని సూచించిన‌ట్లు తెలిసింది. అయిన‌ప్ప‌టికీ సోము స‌సేమిరా అంటున్నార‌ట‌. పైగా.. శ్రేణులంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని, వైసీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని ప్ర‌క‌టించార‌ట‌. తిరుప‌తి ఉప ఎన్నిక చూపిన చేదు అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని సంస్థాగ‌తంగా మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపైనే దృష్టి సారిస్తూ.. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో పోటీపై మ‌రోసారి పున‌రాలోచిస్తే మంచిద‌ని సీనియ‌ర్లు సూచించిన‌ట్లు తెలిసింది.

ఇదిలా ఉండ‌గా.. వైసీపీ అభ్యర్థి సుధతో నామినేషన్ వేయించిన అధికారపార్టీ ప్రచారంపై ఫోకస్ చేస్తోంది. బీజేపీ పోటీ చేస్తామని చెబుతుండటంతో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నారు వైసీపీ నేతలు. ఓటింగ్‌ ఏకపక్షంగా ఉండాలని, వైసీపీకి అత్యధిక మెజార్టీ రావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఒకవేళ ఎవరైనా పోటీ పెడితే మాత్రం ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రయత్నించాలన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి.. బద్వేల్‌ ఉప ఎన్నికలో డాక్టర్‌ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలని సజ్జల సూచించారు. ఇక, మిగతా పార్టీలతో అనవసరం.. ఏకగ్రీవం అయితే ఓకే.. లేదంటే ఓటింగ్ ఏకపక్షంగా జరగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Also Read : జనసేన అడుగు.. బీజేపీకి అర్థం అవుతోందా..?