iDreamPost
iDreamPost
ఏపీ రాజధాని అంశంలో జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల ప్రకటన ద్వారా రాజకీయంగా వివిధ పార్టీలను ఆయన సందిగ్ధంలోకి నెట్టారు. చివరకు టీడీపీ అమరావతి కి జై అంటున్న తరుణంలో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో ఆ పార్టీకి చిక్కులు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలకు భవిష్యత్తులో చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండుకళ్ల సిద్ధాంతం ఇప్పటికే ఒంటికన్నుగా మిగిలిన తరుణంలో మళ్లీ అదే ధోరణిలో సాగుతుండడం ఆపార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టడం అనివార్యం అంటున్నారు.
బీజేపీ కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తూ ప్రాంతీయ విద్వేషాలకు ప్రయత్నిస్తున్న తరుణంలో కమలనాధులకు కలిసొచ్చేదేమీ ఉండకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయం. బీజేపీకి చెందిన కీలక నేత జీవీఎల్ మూడు రాజధానులను ఆహ్వానించారు. కానీ కన్నా, సుజనా వంటి వారి స్వరం భిన్నంగా వినిపిస్తోంది. ఇలా ఒకేపార్టీకి చెందిన నేతలు విభిన్న గొంతులు వినిపించే విధానాన్ని కాంగ్రెస్ నుంచి బీజేపీ పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తోంది. దానివల్ల అటు అమరావతి రైతుల్లో, ఇటు ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల్లో తాము నెట్టుకురాగలమని కాషాయ పార్టీ నేతలు ఆశిస్తున్నప్పటికీ సాధారణ జనాలను మభ్యపెట్టడం అంత సులువు కాదని చెప్పక తప్పదు.
జనసేనాని కూడా సీఎం ప్రకటన రాగానే వేగంగా స్పందించినప్పటికీ ప్రస్తుతం సైలెంట్ అయిపోవడం వెనుక అనేక అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి ప్రకటన తర్వాత జనసేన తీరు అనూహ్యంగా మార్చుకోక తప్పలేదు. అదే సమయంలో సామాజిక కోణంలో అమరావతి అంశాన్ని రాష్ట్రస్థాయిలో ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో, గతంలోనే పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దాంతో ఇప్పుడు స్వరం పెంచినా ప్రయోజనం ఉండకపోవచ్చని జనసేన భావిస్తోంది. ఇటీవల జనసేన తరుపున ఎంపీగా పోటీ చేసిన పెంటపాటి పుల్లారావు వంటి వారు అమరావతి చెత్త రాజధాని, అక్కడి రైతులు ఏం త్యాగాలు చేశారంటూ వ్యాఖ్యానించిన తరుణంలో జనసేన కూడా ఈ అంశంలో ప్రస్తుతానికి మిన్నకుండడం మేలని లెక్కిస్తున్నట్టు స్పష్టం అవుతోంది.
ఇప్పటికే 34వేల ఎకరాల ల్యాండ్ ఫూలింగ్ భూములతో పాటుగా ప్రభుత్వ, ఇతర భూములను కలుపుకుంటే మొత్తం 54వేల ఎకరాల భూములు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. వాటిలో సుమారుగా 10వేల ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం వివిధ మార్గాల్లో కేటాయింపులు చేసింది. అందులో అత్యధికం రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర సంస్థలకు ఉన్నాయి. ఇక మిగిలిన 44వేల ఎకరాలను చంద్రబాబు తరహాలోనే జగన్ కూడా అయిన వారికి అత్యల్ప ధరలకు, ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ ధరలకు అమ్మకాలు సాగించడం ద్వారా భారీగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ముఖ్యంగా చంద్రబాబు చెప్పినట్టు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ రాబోయే నాలుగున్నరేళ్లలో భూములను అమ్ముకోవడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం కూడా ఉంది. అవినీతి, అక్రమాలకు విశాఖ లాంటి ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల్లో కంటే అమరావతిలో ఎక్కువ అవకాశాలున్నాయన్నది స్పష్టం. ముఖ్యంగా 44వేల ఎకరాల భూములు ప్రభుత్వం చేతుల్లో ఉన్న తరుణంలో వాటిని తమకు అనుకూలంగా మలచుకునే అవకాశాలు జగన్ కి ఉన్నాయి.
అయినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం అలాంటి సొంత ప్రయోజనాల కంటే ఏపీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నట్టుగా తాజా పరిణామాలను ఆపార్టీ నేతలు చెబుతున్నారు. సామాన్యుల్లో కూడా అత్యధికంగా ప్రభుత్వ వాదనలలో బలం ఉందన్న విషయాన్ని గ్రహిస్తున్నారు. ఈ విషయాలు కూడా ప్రతిపక్షాల వాదనలో బలహీనతలను చాటుతున్నాయి. తద్వారా చంద్రబాబు సహా పలువురు నేతలు ఎంతగా ప్రయత్నించినా రాజధాని వివాదం కేవలం కొద్ది ప్రాంతానికే పరిమితం అయిపోతోంది. మీడియాలో ఎంతగా ప్రచారం చేసినా ఫలితం దక్కుతుందన్న ధీమా కనిపించకపోవడంతో ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న వారు కూడా మదనపడుతున్నట్టు చెబుతున్నారు. స్వయంగా చంద్రబాబు, చినబాబు రంగంలో దిగినా దానికి తగ్గట్టుగా స్పందన లేకపోవడం దానికి నిదర్శనంగా చెబుతున్నారు.