iDreamPost
android-app
ios-app

కన్నీళ్లు తెప్పించే దృశ్యం.. రోడ్డుపై ఎండలో పసివాడితో భిక్షాటన

ఆంధ్రప్రదేశ్ లో పసివాడితో భిక్షాటన చేయిస్తున్న ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పసివాడితో భిక్షాటన చేయిస్తున్న ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కన్నీళ్లు తెప్పించే దృశ్యం.. రోడ్డుపై ఎండలో పసివాడితో భిక్షాటన

సమాజంలో పేదరికం ఏ రేంజ్ లో ఉందో ఈ సంఘటన చూస్తూ ఇట్టే అర్థమైపోతుంది. పేదరిక నిర్మూళనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మార్పు కనిపించడం లేదు. దేశంలో ఇంకా ఎంతో మంది కూడు, గూడు, గుడ్డ కోసం జీవన పోరాటం చేస్తున్నారు. ఒక్క పూట తిండికోసం నానా కష్టాలు పడుతున్నారు. ఆకలితో అలమటించి అసువులు బాస్తున్నవారెందరో. పస్తులతో కాలం వెల్లదీస్తున్నారు. ఈ పేదరికంలో బాల్యం బందీ అయిపోతున్నది. కుటుంబ పోషణ కోసం పిల్లలను సైతం యాచకవృత్తిలోకి దించుతున్నారు. ఏమీ తెలియని వయసులో భిక్షాటన చేపిస్తూ పసిపిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎండనకా, వాననక బస్టాండుల్లో, రోడ్లపైన, రద్దీ ప్రాంతాల్లో యాచిస్తూ పిల్లలు పడే యాతన అంతా ఇంతాకాదు.

స్కూల్లో అఆలు దిద్దాల్సిన పిల్లలు చేయి చాచి భిక్షాటన చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన పిల్లలు డబ్బుల కోసం రోడ్లపైకి వస్తున్నారు. ఈ క్రమంలో ఓ పసివాడు రోడ్డుపై కూర్చొని భిక్షాటన చేస్తున్న దృష్యాలు ప్రతిఒక్కరిని కలిచివేస్తున్నాయి. రోడ్డుపై ఎండలో కూర్చొని డబ్బుల కోసం వచ్చిపోయే వారిని వేడుకుంటుంటే మనసు చలించకుండా ఉండదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో చోటుచేసుకుంది. ఓ నెటిజన్ బాలుడు భిక్షాటన చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలులో రోడ్డుపై ఓ బాలుడు యాచిస్తూ దయనీయ స్థితిలో కనిపించాడు. ఆ పసివాడు ఒంటినిండా రంగుతో గాంధీ వేశంలో రోడ్డు పక్కన ఎండలో కూర్చొని ఒక్కరూపాయి ఇవ్వమంటూ వేడుకుంటున్నాడు.

ఆ పసివాడు ఎండకు తాళలేక సొమ్మసిల్లి పోయాడు. అటు ఇటు తూలుతూ కనిపించాడు. ఆ బాలుడిని చూసిన ప్రతి ఒక్కరికి కంట కన్నీళ్లు తెప్పించింది. పసిప్రాయంలోనే వయసుకు మించిన భారం మోస్తున్నాడంటూ వాపోయారు. పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులు పసివాడిని కొట్టి.. ఎండలో కూర్చొబెట్టి భిక్షాటన చేయిస్తున్నట్టు సమాచారం. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. తక్షణమే ఆ బాలుడిని రక్షించి చిన్నారి దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్ (ట్విట్టర్)‌లో హామీ ఇచ్చారు. ఇది హృదయ విదారక సంఘటనగా పేర్కొన్నారు. ప్రతి బిడ్డ భద్రత, ప్రేమానురాగాలు, సమాజంలో గౌరవం పొందడానికి అర్హుడు. ఆ చిన్నారిని గుర్తించి అవసరమైన సంరక్షణ చర్యలు చేపడతాం. చిన్నారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారి పై తగిన చర్యలు తీసుకుంటాం అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. పసివాడు భిక్షాటన చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.