Idream media
Idream media
తెలంగాణ అధికార పార్టీలో కొంత కాలంగా దోబూచులాట కొనసాగుతోంది. పలువురు నేతల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. మంత్రి ఈటల రాజేందర్ బహిరంగంగానే పార్టీపైన, అధినేతపైన పరోక్ష విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అలా మాట్లాడిన ప్రతీ సారీ ఎవరో ఒకరు రంగంలోకి దిగి కారణాలు తెలుసుకునే పనిలోనూ పడ్డారు. కేటీఆరే ఓసారి స్వయంగా ఈటల దగ్గరకు వెళ్లి భోజనానికి రావాలంటూ స్వయంగా ప్రగతిభవన్ కు తోడ్కుని వెళ్లారు. టీఆర్ఎస్ నాయకత్వంపై ఈటల విమర్శలు చేసిన మర్నాడే కావడంతో అది చర్చనీయాంశం అయింది. ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ ను భూ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. తమ నాయకుడి మీద వస్తున్న వ్యతిరేక కథనాలపై ఈటల వర్గీయులు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. బంధువు అయిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో సంతోష్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. దీంతో రచ్చ రోడ్డెక్కింది.
ఈటల రాజేందర్ మీద ఇప్పుడు భూకబ్జా ఆరోపణలు పడ్డాయి. వంద ఎకరాలకు పైనే భూమిని ఆయన స్వాధీనం చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు. అక్కడ షెడ్లు నిర్మిస్తున్నారన్న మీడియాలో కథనాలు, ఫొటోలు కూడా ప్రచురితమయ్యాయి. అధికార పార్టీకి చెందినదిగా ముద్ర పడిన నమస్తే తెలంగాణ దీనిని ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అలాగే, సీఎం కేసీఆర్ దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. దీంతో ఉప్పు, నిప్పుగా ఉన్న అంతర్గత విబేధాలపై రచ్చ కొనసాగుతోంది. క్లీన్ చిట్ ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర మంంత్రి ఈటెల రాజేందర్ కు పేరుంది. బీసీల పక్షపాతిగా.. తెలంగాణ సాధనలో ఆయనకున్న కమిట్ మెంట్ ను ఎవరూ వేలెత్తి చూపలేరు. ఆయన కూడా తన చరిత్ర మొత్తం మ్మీద విచారణ జరుపుకోండంటి అంటూ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈటల తీవ్ర భావోద్వేగంతో ఉన్నట్లు కనిపించింది. అయినప్పటికి ఎక్కడా సహనం కోల్పోకుండా.. శ్రుతి మించకుండా.. వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా తన ప్రెస్ మీట్ ను ముగించారని చెప్పాలి. కేసీఆర్ ఎంత వ్యూహాత్మకంగా ఉన్నారో.. తాను అంతే వ్యూహాత్మకంగా ఉన్నారన్నట్లు ఆయన తీరు కనిపించింది. అంతేకాదు.. తాత్కాలికంగా న్యాయం ఓడిపోవచ్చన్న ఈటల వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. తనపై ఆరోపణలు చేస్తున్న వారిదే ప్రస్తుతానికి పై చేయి కావొచ్చన్న భావన ఇది కలగజేస్తోంది. అయినప్పటికీ ఎక్కడా అతిగా ఆవేశపడకుండా ఈటల నిదానంగానే సమావేశాన్ని ముగించారు.
ఇటీవల కాలంలో ఈటల పలు వేదికల మీద సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొత్త పార్టీ అవసరం తెలంగాణలో ఉందన్న ఆయన.. తెర వెనుక పెద్ద కథనే నడిపిస్తున్నారని చెబుతున్నారు. కొండా.. ఈటెల లాంటి క్లీన్ చిట్ ఉన్నవాళ్లు..టీఆర్ఎస్ సర్కారులో పెద్దగా ప్రాధాన్యత లభించని రెడ్డి.. బీసీ వర్గాల్ని ఒక చోటకు తీసుకొచ్చేలా కొత్త పార్టీ పార్టీ ఏర్పాటు దిశగా రానున్న రోజుల్లో పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఇది జరుగుతుందా, లేదా అన్నది పక్కన బెడితే ఈ భూ ప్రకంపనలు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : ఈటెల మాజీ మంత్రి కాబోతున్నారా..?