Idream media
Idream media
”17 తర్వాత ఫ్రీ అయిపోతాం.. తర్వాత పార్టీ లేదు.. బొక్కా లేదు..” ఇదీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు రామ్మోహనాయుడు, మరో టీడీపీ నేత మధ్య చోటు చేసుకున్న సంభాషణ. ఈ వీడియో ఎంత కల్లోలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని పక్కనబెడితే.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడయ్యాక తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అందుకు ఆ వీడియోలోని పై సంభాషణలే నిదర్శనమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. వరుస ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. మున్సిపల్ ఎన్నికలైతే కోలుకోలేని దెబ్బ తీశాయి. ఆ దెబ్బతో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే సాహసం చేయలేని పరిస్థితి వచ్చింది. స్వయానా చంద్రబాబే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పడం రాజకీయంగా టీడీపీకి పెద్ద కుదుపే. దీంతో ఇప్పుడు అందరికీ తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కన్నా.. అక్కడ టీడీపీ గతంలో పొందిన ఓట్లయినా పొందకపోతే ఆ పార్టీలో జరిగే పరిణామాలపైనే ఎక్కువ ఫోకస్ ఉంటోంది.
ఏపీలో కొన్ని నెలలుగా తెలుగుదేశం పార్టీ భవితవ్యంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ చర్చలు పార్టీ అధినేత చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ ను పెంచుతున్నాయి. తిరుపతి ప్రచారంలో అది స్పష్టంగా కనిపించింది. 40 ఏళ్ల రాజకీయ కాలంలో ఎన్నడూ లేనంతగా ఆయన మాటలు ఉన్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఉండగా వచ్చిన తిరుపతి ఉప ఎన్నికలో ఆయన తన గోడునంతా వెల్లబోసుకున్నారు. తన పాల వ్యాపారాన్ని దెబ్బతీశారని, అమరావతిలో భూముల ధరలు పెరగకుండా చేశారని, పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోనీయలేదని, రాళ్లు వేశారని.. ఇలా ఎన్నింటినో చెప్పుకుంటూపోయారు తప్పా ప్రజా సమస్యల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పిన పాపాన పోలేదు. ఎలాగైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలనే తపన తప్పా వాటిలోని ప్రయోజనాలను పట్టించుకోలేదు.
రౌడీయిజం వదిలేశా.. మళ్లీ రెడీ.. అంటూ వయసుకు మించిన మాటలెన్నో చంద్రబాబు ప్రచారంలో వాడేశారు. ఇక పోలింగ్ రోజు కూడా దొంగ ఓట్లు అంటూ కొత్త డ్రామాలను పైకి తెచ్చారు. రీ కౌంటింగ్ డిమాండ్ కూడా చేసేశారు. 14 సంవత్సరాల పాటు సీఎం, మరో 12 యేళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగిన స్థాయి ఉన్న నేత ఓ ఉప ఎన్నికలో ఇంతలా రాజకీయాలు చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. వీటిని పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికపైనే తెలుగుదేశం భవిష్యత్తు, తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న విషయం చంద్రబాబు గుర్తించినట్లుగా ఉంది.
ఒక్కటైతే వాస్తవం… సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ సీటు పరిధిలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో సాధించినన్ని ఓట్లను సాధించుకోలేకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గతంలో కన్నా పెరిగినా.. తెలుగుదేశం పార్టీ దుకాణం మూతకు రెడీ అయినట్టే. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55 శాతం, టీడీపీ 37 శాతం ఓట్లను పొందాయి. ఎన్ని ఓట్లు పోలింగ్ అయినా.. శాతాల లెక్కను బట్టి చూస్తే ఆదరణ పెరిగిందో, తగ్గిందో తేటతెల్లం కానుంది. తిరుపతిలో చంద్రబాబు నాయుడే ఎనిమిది రోజుల పాటు ప్రచారం చేశారు. ఇక లోకేష్ మరో పది రోజులకు పైనే ప్రచారం చేసినట్టున్నారు. ఇక చాలా కాలం కిందటే అభ్యర్థిని ప్రకటించారు. టీడీపీ ముఖ్యనేతలంతా తిరుపతిలోనే మకాం పెట్టి ప్రచారం సాగించారు. ఇక తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ వాడుకోని అంశం అంటూ ఏమీ లేదు! అన్ని అంశాలనూ వాడేశారు. ఇలాంటి నేపథ్యంలో.. ఇంతజేసీ 37 శాతం ఓట్లను అయినా పొందకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ కథ ఏపీలో ముగింపుకు చేరినట్టే, రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు ఉనికి కూడా కోల్పోవడం మొదలైనట్టే.