iDreamPost
android-app
ios-app

అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది..?

అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది..?

జయలలిత ఉన్నప్పుడు అన్నాడీఎంకేకు అన్నీ ఆమె. పార్టీలో ఏం జరిగినా ఆమె కనుసన్నల్లో జరగాల్సిందే. అంతటి గట్టి పట్టున్న నేత లేని అన్నాడీఎంకే ప్రభుత్వం కకావికలమవుతుందని, పాలన అస్తవ్యస్తమవుతుందని చాలామంది భావించారు. కానీ నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు. అధినేత్రి లేని లోటుగానీ, పదేళ్లు పనిచేసిన ప్రభుత్వం పట్ల ఉండే వ్యతిరేకత గానీ పెద్దగా లేకుండానే చేసుకున్నారు. అయినప్పటికీ తాజా ఎన్నికల్లో డీఎంకేకు పట్టం కట్టారు ప్రజలు. ఇదిలా ఉండగా, అధికారం దూరమైన కొద్ది రోజులకే అన్నాడీఎంకే కీలక నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నట్లు కనిపిస్తోంది.

మాజీ ముఖ్యమంత్రుల మధ్య పోటీ

శాసనసభాపక్ష నేత పదవి అన్నాడీఎంకేలో చిచ్చు పెడుతోందా.. అంటే అవునున్నట్లుగానే పార్టీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకే 65 స్థానాల్లో, కూటమి పార్టీల నేతలు మరో పది స్థానాల్లో గెలుపొందారు. ఫలితాలు వెల్లడైన అనంతరం శాసనసభ పక్ష నేతగా ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నుకుంటారని అందరూ భావించారు. కానీ ఆ పదవిని ఒ.పన్నీర్‌సెల్వం(ఓపీఎస్‌) కూడా ఆశిస్తున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయకర్తగా ఉన్న సెల్వం, ఉపసమన్వయకర్తగా ఉన్న స్వామి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. నిజానికి, శుక్రవారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి తమ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.

వాయిదా పడ్డ సమావేశం

అయితే, శాసనసభాపక్ష నేతను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా పార్టీ సీనియర్లతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ ప్రత్యేకంగా మంతనాలు సాగించారు. రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని సోమవారానికి వాయిదావేశారు. ఇదిలావుంటే, ఈ పదవి కోసం తాజా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీలో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేకపోయినా పిలిచి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు, పార్టీ సమన్వయకర్తగా నియమిస్తే తనకు పన్నీర్‌సెల్వం పోటీ రావడమేంటని పళనిస్వామి పార్టీ నేతల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా తానే ఉంటానని, ఈ విషయంలో మరో మాటే లేదని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం.

నేడు తేలనుందా..?

అదేసమయంలో పన్నీర్‌సెల్వం కూడా శాసనసభాపక్ష నేతగా తానే ఉంటానని పట్టుబడుతున్నారు. పార్టీ సమన్వయకర్తను తానేనని, అందువల్ల పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న తానే ఆ పదవిలో ఉండడం న్యాయమని ఆయన చెప్పినట్లు తెలిసింది. జయ ఉన్నప్పుడే తనను రెండుమార్లు ముఖ్యమంత్రి చేశారంటే, పార్టీకి తానెంత ముఖ్యుడినో పళనిస్వామి గ్రహించాలని ఆయన పార్టీ సీనియర్ల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ ఇద్దరు నేతల మంకుపట్టుతో అన్నాడీఎంకే నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరి దీనిపై నేడు జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.