iDreamPost
android-app
ios-app

రేవంత్‌ రెడ్డికి కోమటిరెడ్డి ఏం సలహా ఇచ్చారు..?

రేవంత్‌ రెడ్డికి కోమటిరెడ్డి ఏం సలహా ఇచ్చారు..?

రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు చక్కబడతాయంటారు. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి నియామకం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో తన మాటలతో బాంబులు పేల్చిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రస్తుతం పూర్తిగా మారిపోయినట్లుగా కనిపిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో విభేధించిన కోమటిరెడ్డి గాంధీభవన్‌ మెట్లను ఎక్కబోనని ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ పదవి కొనుక్కున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను రేవంత్‌ రెడ్డి కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. ఇదీ అప్పటి సీన్‌.

కట్‌ చేస్తే కోమటిరెడ్డి మెత్తబడ్డారు. కారణాలైమైనా ఆయన రేవంత్‌ రెడ్డి విషయంలో పూర్తిగా మారిపోయారు. రేవంత్‌ రెడ్డితో తనకు విభేదాలు లేవని కోమటిరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు కలసి పని చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామని తాను రేవంత్‌ రెడ్డితో చెప్పినట్లు వెల్లడించారు. ఈ పరిణామం ఢిల్లీలో జరిగిందట. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా కోమటిరెడ్డి, రేవంత్‌ రెడ్డిలు ఎదురెదురుపడ్డారట. ఆ సమయంలో తాను ఈ విషయాన్ని చెప్పినట్లు కోమటిరెడ్డి చౌటుప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తాను జానారెడ్డి కంటే సీనియర్‌ను అని, తనకంటే జూనియర్‌ అయిన రేవంత్‌ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడం మాత్రం బాధ కలిగించిందని మనసులోని మాటను బటయపెట్టారు కోమటిరెడ్డి.

రేవంత్‌ రెడ్డి ఎదురుపడినప్పుడు మరో విషయం కూడా చెప్పానని తెలిపారు కోమటిరెడ్డి. టీడీపీలో పని చేసిన వారి కోసం వెదకడం మానేసి కాంగ్రెస్‌లోని సీనియర్లతో కలసి పని చేయాలని సలహా ఇచ్చారట. ఈ మాట ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీంశమైంది. ఆయన మాటలు వాస్తవమని కొందరు కాంగీయులు మద్ధతు తెలుపుతున్నారు.

రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలంటూ రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో పని చేసిన వారిని ఆహ్వానించడం మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలలో ఉన్న టీడీపీ మాజీ సహచరులతో వరుస భేటీలు నిర్వహించారు. వారిలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కోమటిరెడ్డి.. రేవంత్‌ రెడ్డికి ఈ తరహాలో సలహా ఇచ్చారని కాంగీయులు చెబుతున్నారు. ఈ పరిణామాలు ఏమైనా.. రేవంత్‌ రెడ్డి పట్ల కోమటిరెడ్డి సానుకూలంగా వ్యవహరించడం కాంగ్రెస్‌ శ్రేణులకు సంతోషానిస్తోంది.

Also Read : తెలంగాణలో రాజీనామాల రాజకీయం!